అనకాపల్లిలో అరుదైన పురుగు... దీని ధర రూ.కోటి ఎందుకు?
అసలు ఏమిటీ కీటకం, కీటకం అంత ధర ఏమిటి, దొరికిన లక్కీ పర్సన్ ఎవరు మొదలైన విషయాలు ఇప్పుడు చూద్దాం...!
By: Tupaki Desk | 17 Aug 2024 8:34 AM GMTప్రపంచంలోనే అత్యంత అరుదైన కీటకం ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో ప్రత్యక్షమైంది. ఈ కీటకానికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఈ కీటకం ధర రూ.75 లక్షల నుంచి రూ. కోటి వరకూ ఉంటుందని అంటున్నారు. అసలు ఏమిటీ కీటకం, కీటకం అంత ధర ఏమిటి, దొరికిన లక్కీ పర్సన్ ఎవరు మొదలైన విషయాలు ఇప్పుడు చూద్దాం...!
అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలోని కోనాం గ్రామానికి చెందిన గేమ్మెలి చంటి అనే గిరిజనుడు ఇటీవల అటవీప్రాంతానికి వెళ్లడంతో ఓ అరుదైన కీటకం కనిపించింది. చూడటానికి చాలా వింతగా ఉండటంతో దాన్ని ఆకులో చుట్టి ఇంటికి తీసుకొచ్చాడు. ఈ విషయం పలువురికి తెలియడంతో ఆ కీటకాన్ని చూసేందుకు వచ్చారు. ఈ సమయంలో దాన్ని స్టాగ్ బీటిల్ గా గుర్తించారు.
ఈ కిటకం ధర మార్కెట్ లో రూ.కోటి వరకూ ఉంటుందని అంటున్నారు. కీటకం ఏమిటి.. అంత ధర ఏమిటి అని ఆశ్చర్యపోవద్దు! ఈ కీటకం ప్రపంచంలోనే అత్యంత ఔషద గుణాలు కలిగి ఉందని చెబుతారు. ఈ కీటకం ఎవరికైనా దొరికితే వాళ్లు అదృష్టవంతులే అని అంటుంటారు. ఇప్పుడు ఆ జాబితాలో చంటి కూడా చేరినట్టే.
ఈ స్టాగ్ బీటిల్ కు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకాలలో ఒకటిగా గుర్తింపు ఉంది. ఈ కీటకం ఆకారం కూడా ఓ ప్రత్యేకమైన రూపంలో ఉంటుంది. దీన్ని ప్రధానంగా ఔషధ తయారీదారులు ఎక్కువగా వినియోగించడం వల్లే దీనికి అంత ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. ఇవి సాధారణంగా అడవుల్లో నేలపై కనిపిస్తుంటాయి.
ఇక ఇతర కీటకాల మాదిరిగానే ఈ స్టాగ్ బీటిల్ కూడా కాలినడక, రెక్కల ద్వారా ప్రయాణిస్తాయి. ఈ కీటకాలు ఆహార వనరులకు సమీపంలోనే గుడ్లు పెట్టే చోటు వెతుక్కుని ఉంటాయి. ఇవి ఎక్కువగా ఉత్తర భారతదేశం, ఆగ్నేసియాలోని దట్టమైన ఉష్ణమండల అడవుల్లో ఉంటాయని చెబుతుంటారు. ఇక ఈ స్టాగ్ బీటిల్స్ లో మగవాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుందని అంటుంటారు.