పాము కోసం "మోస్ట్ వాంటెడ్" పోస్టర్... ఆచూకి తెలిస్తే చెప్పమంటున్న పోలీసులు!
కొన్ని సందర్భాల్లో వారి ఆచూకి తెలిపినవారికి బహుమతులను కూడా ప్రకటిస్తారు. అయితే తాజాగా అత్యంత ప్రమాధకరమైన ఒక పాము కోసం మోస్ట్ వాంటెడ్ పోస్టర్ రిలీజ్ చేశారు పోలీసులు.
By: Tupaki Desk | 23 Nov 2023 7:07 AM GMTసాధారణంగా మోస్ట్ వాంటెడ్ అనే పోస్టర్ భారీ నేరాలు చేసిన వారి కోసం పోలీసులు విడుదల చేస్తుంటారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా వారి కళ్లు కప్పి తిరుగుతూ.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ.. నేరాలకు పాల్పడే వారిని మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో చేర్చుతారు. కొన్ని సందర్భాల్లో వారి ఆచూకి తెలిపినవారికి బహుమతులను కూడా ప్రకటిస్తారు. అయితే తాజాగా అత్యంత ప్రమాధకరమైన ఒక పాము కోసం మోస్ట్ వాంటెడ్ పోస్టర్ రిలీజ్ చేశారు పోలీసులు.
అవును... ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది.. మున్సిపల్ సిబ్బంది, పోలీసులు ఎంత ప్రయత్నించినా తప్పించుకు తిరుగుతుంది.. ఇది అత్యంత ప్రమాదకరమైన విష సర్పం.. ఇది ఎవరికైనా కనిపిస్తే దూరంగా వెళ్లిపోంది.. తగు జాగ్రత్తలు తీసుకోండి.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి అంటూ పోస్టర్లు విడుదల చేశారు పోలీసులు. దీంతో ఇప్పుడు ఆ పాము, దాని తాలూకు మోస్ట్ వాంటెడ్ పోస్టర్లు వైరల్ గా మారాయి. దీంతో ఆ పాము ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారింది.
వివరాళ్లోకి వెళ్తే... నెదర్లాండ్స్ లోని టిల్ బర్గ్ నగరంలో ఒక విషపూరిత పాము స్థానిక మునిసిపాలిటీ సిబ్బందిని, పోలీసులను ఇబ్బంది పెడుతోంది. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న ఈ పాము చాలా ప్రమాదకరమైనది. దీనిపేరు గ్రీన్ మాంబా. ఇటీవల నగరంలోని ఒక ఇంట్లో దీన్ని కనుగొన్నారు. దీంతో దీని గురించి తెలుసుకున్న అధికారులు... ఇది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన పాములలో ఒకటి అని చెబుతున్నారు.
ఆ ఇంట్లో కనిపించిన ఆ పామును పట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా వీలు కాలేదంట. ఆ ఇంట్లోంచి బయటకు ఎవరికీ కనిపించకుండా పారిపోయింది. దీంతో అత్యంత విషపూరితమైన ఈ గ్రీన్ మాంబా పాము వల్ల ప్రజలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. దీంతో పోలీసులు ఈ మోస్ట్ వాంటెడ్ పరిష్కారం ఆలోచించారు.
ఇందులో భాగంగా... పోలీసులు గ్రీన్ మాంబా కోసం "మోస్ట్ వాంటెడ్" పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్లను నగరం అంతటా అతికించారు. ఈ గ్రీన్ మాంబా పామును ఎవరైనా, ఎక్కడైనా చూసినట్లయితే... దాన్ని పట్టుకోవడానికి ఒంటరిగా ప్రయత్నించవద్దని హెచ్చరికలు జారీచేశారు. అది చాలా విషపూరితమైనది కావడం వల్ల ఎవరూ దీనివద్దకు వెల్లడానికి ప్రయత్నించొద్దని పోలీసులు హెచ్చరించారు.
ఇదే సమయంలో ఈ పాము ఎవరికంట పడినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, తద్వారా ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడవచ్చని పోలీసులు చెబుతున్నారు. ఇదే సమయంలో దీన్ని పట్టుకోవడానికి స్నిఫర్ డాగ్స్ ని కూడా రంగంలోకి దింపినట్లు చెబుతున్నారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో అత్యవసర వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు! దీంతో... ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.