అమ్మా బయటకు రా.. జైలు దగ్గర చిన్నారి కన్నీళ్లు
చదివినంతనే అయ్యో పాపం అనే ఉదంతం ఒకటి తాజాగా కర్నూలు పట్టణంలో చోటు చేసుకుంది
By: Tupaki Desk | 17 Dec 2023 5:05 AM GMTచదివినంతనే అయ్యో పాపం అనే ఉదంతం ఒకటి తాజాగా కర్నూలు పట్టణంలో చోటు చేసుకుంది. పెద్ద వారు చేసే తప్పులకు వారి పిల్లలు ఎంతటి వేదనకు గురి అవుతారన్న విషయాన్ని తెలిపే ఈ ఉదంతం పలువురిని కదిలించింది. తన తల్లి చేసిన నేరం గురించి.. ఆమె ఎందుకు జైలుకు వెళ్లిందన్న విషయం ఆ చిన్నారికి తెలీదు. తనకు తెలిసిందల్లా.. తనను అపురూపంగాచూసుకునే తన తల్లి జైలుకు వెళ్లిందనే. తల్లిని కలిసేందుకు జైలు బయట గోడ వద్దకు చేరుకొని.. తన తల్లి కోసం చిన్నారి పడే వేదన జైలు అధికారుల్ని సైతం కదిలించివేసింది. అయ్యో అనిపించే ఈ ఉదంతంలోకి వెళితే..
కర్నూలు పాత పట్టణానికి చెందిన ఒక మహిళ చోరీ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను రిమాండ్ కు తరలించారు. ఈ క్రమంలో ఆమెను సబ్ జైలులో ఉంచారు. అయితే.. తన తల్లి చేసిన తప్పు గురించి.. నేరం గురించి అవగాహన లేని వయసులో ఉన్న చిన్నారి.. తల్లి కోసం జైలు వద్దకు వచ్చి.. అమ్మ కావాలంటూ పెద్ద ఎత్తున ఏడ్చేయటం.. జైలు గోడలు పట్టుకొని అమ్మా.. అమ్మా.. అని ఏడ్చేస్తున్న వైనం అందరిని కదిలించి వేసింది.
తన తల్లి తనకు దూరమైనందన్న ఆవేదనలో ఉన్న ఆ చిన్నారిని చూసిన వారంతా అయ్యో అనుకోకుండా ఉండలేని పరిస్థితి. చివరకు చిన్నారి శోకం జైలు అధికారుల్ని సైతం కదిలించి వేసింది. దీంతో.. రోటీన్ కు భిన్నంగా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆమె వద్దకు చిన్నారిని తీసుకెళ్లారు. తల్లితోమాట్లాడించారు.అనంతరం ఆమెను తల్లి బంధువులకు అప్పజెప్పారు. ఇదంతా చూసినోళ్లు.. పెద్దలు చేసే తప్పులు చిన్న పిల్లలకు ఎంతలా శాపంగా మారతాయన్న మాట పలువురి నోట వినిపించింది.