Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లో మోత్కుపల్లి కలకలం

గత శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అత్యధికంగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించ లేదు

By:  Tupaki Desk   |   18 April 2024 11:49 AM IST
కాంగ్రెస్ లో మోత్కుపల్లి కలకలం
X

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో లోక్ సభ టికెట్ల వ్యవహారం కలకలం రేపుతున్నది. ఎస్సీ సామాజికవర్గంలో అత్యధికంగా ఉన్న మాదిగలకు ఒక్క టికెట్ కూడా కేటాయించకపోవడంతో ఆ వర్గం కాంగ్రెస్ మీద మండిపడుతున్నది. ఇప్పటికే మంద క్రిష్ణ మాదిగ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్, బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి మీద తీవ్ర విమర్శలు చేశాడు.

అయితే బీఆర్ఎస్ పార్టీని వీడి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాదిగలకు టికెట్ ఇవ్వకపోవడం పట్ల రేవంత్ మీద గుర్రుగా ఉన్నాడు. పలు మార్లు రేవంత్ ను కలిసేందుకు ప్రయత్నించిన మోత్కుపల్లి కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం మీద ఆగ్రహంగా ఉన్నాడు. రేవంత్ సీఎం కావాలని అనుకున్న మొదటి వ్యక్తిని తాను అని, కానీ తనకే కలిసేందుకు అవకాశం ఇవ్వడం లేదని, ఇక ముందు జరిగే పరిణామాలకు రేవంత్ దే బాధ్యత అని మోత్కుపల్లి హెచ్చరించాడు.

బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మాదిగలకు రెండు, రెండు టికెట్లు ఇచ్చాయని, కాంగ్రెస్ పార్టీ మాత్రం పార్టీ నేతల కుటుంబాలలో రెండు, మూడు టికెట్లు ఇచ్చిన మాదిగలకు మాత్రం ఒక్క సీటు కూడా ఇవ్వలేదని మోత్కుపల్లి విమర్శించారు. పలుమార్లు కలిసేందుకు రేవంత్ అపాయింట్ మెంట్ ఇవ్వని నేపథ్యంలో గురువారం తన ఇంట్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాదిగలకు రెండు లోక్ సభ సీట్లు కేటాయించలన్న డిమాండ్ తో దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు.

గత శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అత్యధికంగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించ లేదు. అనేక డిమాండ్లు వచ్చినా వారికి టికెట్ కేటాయించకపోవడంతో ఆ సామాజిక వర్గం గత ఎన్నికల్లో గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీ వైపు నిలిచారు. ప్రస్తుత చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తో పాటు, బిత్తిరి సత్తి వంటి సెలబ్రిటీలను నష్టనివారణ కోసం బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నా ఓటమి నుండి తప్పించుకోలేక పోయింది. తెలంగాణలో అధికంగా ఉన్న మాదిగలకు టికెట్ ఇవ్వకపోవడం మూలంగా ఎదురయ్యే పరిణామాలను కాంగ్రెస్ ఎలా ఎదుర్కుంటుంది అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.