Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డి అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌క పోయేస‌రికి!

అయితే.. ఆశించిన ఎమ్మెల్సీ ద‌క్క‌క పోవ‌డంతో తిరుగుబావుటా ఎగ‌రేసి.. అదే కేసీఆర్‌ను నానా తిట్లూ తిట్టి బ‌య‌ట‌కు వ‌చ్చారు.

By:  Tupaki Desk   |   5 May 2024 5:55 AM GMT
రేవంత్ రెడ్డి అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌క పోయేస‌రికి!
X

మోత్కుప‌ల్లి న‌ర‌సింహులు. తెలంగాణ‌లో మ‌రో కేఏ పాల్‌ను త‌ల‌పించే రాజ‌కీయాలు చేస్తున్నార‌ని అంటున్నారు కాంగ్రెస్ నాయ కులు. పార్టీలు మార‌డంలో సిద్ధ‌హ‌స్తుడిగా పేరున్న మోత్కుప‌ల్లి గ‌తంలో టీడీపీలో ఉన్నారు. త‌న‌కేదో చంద్ర‌బాబు గ‌వ‌ర్న‌ర్ గిరీ ఇప్పిస్తారని హామీ ఇచ్చి.. మోసం చేశారంటూ.. వీరంగం వేశారు. నానా తిట్టూ తిట్టేశారు. త‌ర్వాత‌.. బీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకు ని.. కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తేశారు. ద‌ళితుల పాటి దేవ‌దేవుడంటూ.. కీర్త‌న‌లు.. భ‌జ‌న‌లు చేశారు. అయితే.. ఆశించిన ఎమ్మెల్సీ ద‌క్క‌క పోవ‌డంతో తిరుగుబావుటా ఎగ‌రేసి.. అదే కేసీఆర్‌ను నానా తిట్లూ తిట్టి బ‌య‌ట‌కు వ‌చ్చారు.

అటు త‌ర్వాత‌.. కాంగ్రెస్‌లో చేరారు. ఇంకేముంది.. రేవంత్ సూరుడు.. వీరుడు అంటూ.. ఎన్నిక‌ల‌కుముందు.. త‌ర్వాత కూడా.. పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించాడు మోత్కుప‌ల్లి. పాల‌న అద్భుత‌మ‌ని జ‌న‌వ‌రిలో ప్ర‌త్యేక ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ చెప్పారు. అయితే.. పార్ల మెంటు ఎన్నిక‌ల్లో తాను ఆశించిన స్థానం ద‌క్క‌క పోయేస‌రికి.. త‌న‌కు రేవంత్ రెడ్డి అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌క పోయేస‌రికి.. టంగ్ మార్చేశారు.. మోత్కుప‌ల్లి. ఇప్పుడు ఏకంగా దీక్ష‌లు, నిర‌స‌న‌లు చేస్తున్నారు. ఎందుకంటే.. రేవంత్ రెడ్డి.. మాదిగ‌ల‌కు అన్యాయం చేస్తున్నార‌ని చెబుతున్నారు.

ఏంటా అన్యాయం అంటే.. మూడు ఎస్సీ స్థానాలు(ఎంపీ) ఉన్నాయ‌ని.. ఒక్క‌టి కూడా మాదిగ‌ల‌కు ఇవ్వ‌ల‌దేన్న‌ది మోత్కుప‌ల్లి వారి ఆరోప‌ణ‌. (ఇక్క‌డ ఆయ‌న బాధ వేరేవారికి ఇవ్వ‌లేద‌ని కాదు..త‌న‌కు ఇవ్వ‌లేద‌ని అంటున్నారు కాంగ్రెస్ నేత‌లు) ఒక్క సీటును కూడా ఇవ్వ‌ని రేవంత్‌రెడ్డికి ఓటు తో బుద్ధి చెప్పాల‌ని తాజాగా ఆయ‌న మంద కృష్ణ‌మాదిగ‌తో క‌లిసి ఇందిరా పార్కు వ‌ద్ద చేసిన ఆందోళ‌న‌లో వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మాదిగ‌లు కాంగ్రెస్‌కు ఓటేస్తే.. త‌న‌ను చంపిన‌ట్టేన‌ని అన్నారు. మాదిగ‌లుగా పుట్టిన ఎవ్వ‌రూ కూడా రేవంత్ వ‌ర్గానికి ఓటేయొద్ద‌ని మోత్కుప‌ల్లి పిలుపునిచ్చారు.

ఏంటి ఎఫెక్ట్‌..

భారీ ఎత్తున మాదిగ‌ల‌ను స‌మీక‌రించి.. మంద కృష్ణ‌మాదిగ‌ను రంగంలోకి దింపి.. మోత్కుప‌ల్లి చేసిన ఈ తతంగంతో కాంగ్రెస్‌కు న‌ష్ట‌మా? అంటే.. ఏమీ లేక‌పోతే.. ఆయ‌న మ‌రో కేఏ పాల్‌(ప్ర‌జాశాంతి పార్టీ నేత‌)గా మారార‌ని అంటున్నారు కాంగ్రెస్ నేత‌లు. ఎందుకంటే.. ఆయ‌న‌కే దిక్కులేదు. సొంత జిల్లా న‌ల్ల‌గొండ‌లోనే ఆయ‌న‌ను గుర్తించే నాయ‌కులు లేరు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మోత్కుప‌ల్లిని ప‌ట్టించుకునేవారు ఎవ‌రు? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. త‌న కోసం.. మాదిగ‌ల‌ను వాడుకుంటున్నార‌నే విమ‌ర్శ‌లు కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్నాయ‌ని అంటున్నారు. కొస‌మెరుపు ఏంటంటే.. బీజేపీలోకి వెళ్లిపోవాల‌నేది మోత్కుప‌ల్లివారి ఆలోచ‌న‌ట‌! అందుకే.. ఏదో ఒక వంక వెతుక్కున్నార‌ని అంటున్నారు.