Begin typing your search above and press return to search.

రైల్వేల బాదుడుపై భలే ప్రశ్న సంధించిన సమాజ్ వాదీ ఎంపీ!

ప్యాసింజర్ ట్రైన్ల సేవల్లో కోత మొదలు.. రైల్వేల సమయ పాలన విషయంలో చోటు చేసుకున్న అంశాలు రైల్వే ప్రయాణికులకు తరచూ ఇబ్బందులకు గురయ్యేలా చేస్తుంటాయి.

By:  Tupaki Desk   |   12 Dec 2024 4:26 AM GMT
రైల్వేల బాదుడుపై భలే ప్రశ్న సంధించిన సమాజ్ వాదీ ఎంపీ!
X

కేంద్రంలో మోడీ సర్కారు కొలువు తీరితే రైల్వేల రూపురేఖలు మారిపోతాయని.. రైల్వేలు పెద్ద ఎత్తున సంస్కరణ బాట పడతాయని.. సేవల్లో అద్భుతాలు చోటు చేసుకుంటాయని.. సరికొత్త రైల్వే ప్రయాణ అనుభూతిని అస్వాదించటం ఖాయమంటూ.. 2014 ముందు పెద్ద ఎత్తున చర్చ జరిగేది. కట్ చేస్తే.. గడిచిన పదేళ్ల మోడీ పాలనను చూస్తే.. రైల్వేలో చోటు చేసుకున్న మార్పుల్ని చూస్తే.. వరాల కంటే వాతలే ఎక్కువగా కనిపిస్తాయి. సీనియర్ సిటిజన్లకు ఉండే రాయితీని ఎత్తి పారేయటం దగ్గర నుంచి.. ప్యాసింజర్ ట్రైన్ల సేవల్లో కోత మొదలు.. రైల్వేల సమయ పాలన విషయంలో చోటు చేసుకున్న అంశాలు రైల్వే ప్రయాణికులకు తరచూ ఇబ్బందులకు గురయ్యేలా చేస్తుంటాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా జరుగుతున్న లోక్ సభ సమావేశాల్లో సమాజ్ వాదీ ఎంపీ ఇక్రా చౌధరి ఆసక్తికర అంశాన్ని లేవనెత్తారు. రైల్వే ప్రయాణం కోసం టికెట్ ను ఆన్ లైన్ లో బుక్ చేసుకొన్నప్పుడు వెయిటింగ్ లిస్టు టికెట్ ఖరారు కాకపోతే.. రైల్వే శాఖ దాన్ని క్యాన్సిల్ చేస్తుంది. అలాంటప్పుడు రుసుములు ఎందుకు వసూలు చేస్తున్నారు? అంటూ కోట్లాది మంది రైల్వే ప్రయాణికుల మనసుల్ని తొలిచే ప్రశ్నను సంధించారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. దీనికి కేంద్ర రైల్వే మంత్రి చెప్పిన సమాధానం వింటే.. రైల్వే శాఖ గడుసుతనం ఇట్టే కనిపిస్తుంది. వెయిటింగ్ లిస్టు టికెట్లు రద్దు చేసినప్పుడు విధించే క్లరికేజ్ ఛార్జిలను మినహాయించుకునే ఆలోచన ఉందా? ఇప్పటివరకు అలా వసూలు చేసిన మొత్తం ఎంత? అన్న ప్రశ్నలను సంధించారు సమాజ్ వాదీ ఎంపీ. దీనికి రాతపూర్వక సమాధానాన్ని ఇచ్చారు రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్.

తాము వసూలు చేస్తున్న రుసుములు రైల్వే ప్రయాణికుల నిబంధనలు 2015ను అనుసరించి వసూలు చేస్తున్నామని.. అప్పటికే కన్ఫర్మ్ అయిన.. ఆర్ ఏసీ టికెట్లను ఎవరైనా క్యాన్సిల్ చేసుకుంటే.. ఆ బెర్తుల్ని ఇతరులకు కేటాయించేందుకు వీలుగా వెయిటింగ్ లిస్టు టికెట్లను జారీ చేస్తున్నామని.. ఏదైనా తరగతిలో బెర్తులు మిగిలిపోతే.. అందులోకి మారేందుకు లేదంటే ఇతర రైళ్లలో బెర్తులు ఖాళీగా ఉంటే (వికల్ప్ సౌకర్యం) వాటిల్లో ప్రయాణించేందుకు వీలుగా అవకాశాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. టికెట్ల రద్దు ద్వారా వచ్చిన ఆదాయానికి విడిగా పద్దు ఉండదని.. అన్ని రూపాల్లో వచ్చిన ఆదాయాన్ని రైళ్ల నిర్వాహణకు.. సదుపాయాలకు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారే కానీ.. వెయిటింగ్ టికెట్లు కన్ఫర్మ్ కాకున్నా విధించే ఛార్జీల బాదుడు నుంచి ఉపశమనం కలిగిస్తామన్న మాట మాత్రం రైల్వే శాఖ మంత్రి నుంచి రాకపోవటం గమనార్హం.