Begin typing your search above and press return to search.

సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి 200 మీటర్ల దూరం.. డీకే అరుణ ఇంట్లో ఆ దొంగ ఏం చేశాడు?

ఇదే ఇప్పుడు ఎంపీ డీకే అరుణలో భయాందోళనకు కారణమైంది.

By:  Tupaki Desk   |   18 March 2025 11:33 AM IST
సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి 200 మీటర్ల దూరం.. డీకే అరుణ ఇంట్లో ఆ దొంగ ఏం చేశాడు?
X

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడటం కలకలం రేపింది. సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా భయాందోళనలు కలిగిస్తోంది. ఆ వ్యక్తి ఇంకా గుర్తించబడలేదు. అయితే అతని కదలికలు నాంపల్లి వరకు ట్రాక్ చేయబడ్డాయి. ఎంపీ ఇంట్లోకి అతను ఎందుకు ప్రవేశించాడనేది కూడా మిస్టరీగానే ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తి ఎంపీ ఇంటి నుండి ఏమీ తీసుకెళ్లలేదు. ఏ దొంగతనం చేయలేదు. కేవలం ఇంటినంతా గంటన్నర సేపు మొత్తం కలియతిరిగి పరిశీలించి వెళ్లాడు. ఇదే ఇప్పుడు ఎంపీ డీకే అరుణలో భయాందోళనకు కారణమైంది.

డీకే అరుణ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె ఉదయం 6 గంటలకు తాను నిద్రలేవగానే బూట్లు ధరించిన వ్యక్తి ఇంటి లో తిరిగినట్లు ఆ ఇంట్లోని వారు చెప్పారు. వెంటనే అరుణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తి ఇంటి మొత్తం కలియ తిరిగాడని, స్టోర్‌లో ఒకటి లేదా రెండు నిమిషాలు నిలబడ్డాడని, పూజ గదిలోకి కూడా వెళ్ళాడని అరుణ తెలిపారు.

తన గది , తన పెద్ద కుమార్తె గదిని అతను తాకలేదని, అయితే తన మనవరాలి గదిలోకి తొంగి చూశాడని ఆమె చెప్పారు. అరుణ తన కుమార్తె, మనవరాళ్ళు, ముగ్గురు మహిళా సహాయకులు, ఒక వంటమనిషి , ఒక డ్రైవర్‌తో కలిసి నివసిస్తున్నారు. డ్రైవర్ మినహా ఇంట్లో అందరూ మహిళలే.

"అతను దొంగ అయితే ఏదో ఒకటి తీసుకునేవాడు. కనీసం చేతికి అందినది ఏదో ఒకటి లాక్కునేవాడు. కానీ కేవలం ఇంటి చుట్టూ తిరగడం భయానకంగా అనిపిస్తోంది" అని మహబూబ్‌నగర్ ఎంపీ అన్నారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరుణకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

తాను నెలలో దాదాపు 20 రోజులు ఇంటికి దూరంగా ఉంటున్నందున భద్రత కల్పించాలని సీఎం రేవంత్ ను కోరినట్లు అరుణ తెలిపారు. అదనపు వ్యక్తిగత భద్రత కూడా కల్పించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు ఆమె చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ ఇదే వీధి చివరన నివసిస్తుండగా, తాను మరో చివరన కేవలం 200 మీటర్ల దూరంలో నివసిస్తున్నానని అరుణ చెప్పారు. అదనపు భద్రత అవసరమని చెబుతూ.. ఆ ఆగంతకుడు ఏమీ ఎత్తుకుపోకపోవడంతో ఇదే తనకు అత్యంత భయానకమైన విషయమని ఆమె అన్నారు.తనపై దాడి చేయడానికి ఏమైనా వచ్చాడా? అన్న భయం వెంటాడుతోందని అరుణ ఆందోళన వ్యక్తం చేశారు.