Begin typing your search above and press return to search.

మమతా దీదీ కి భారీ షాక్ ఇచ్చిన సొంత ఎంపీ !

బెంగాల్ లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలి మీద జరిగిన అత్యాచారం హత్యాకాండ మీద దేశమంతా రగిలిపోయింది.

By:  Tupaki Desk   |   9 Sep 2024 1:30 AM GMT
మమతా దీదీ కి భారీ షాక్ ఇచ్చిన సొంత ఎంపీ !
X

బెంగాల్ టైగర్ గా దీదీగా ఎంతో గుర్తింపు పొంది ప్రధాని పదవికే టార్గెట్ పెట్టిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఇటీవల కాలం అంతా పూర్తి వ్యతిరేకంగా ఉంది. బెంగాల్ లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలి మీద జరిగిన అత్యాచారం హత్యాకాండ మీద దేశమంతా రగిలిపోయింది.

అది అతి పెద్ద చిచ్చుగా మారింది. దీదీకి ఏమి చేయాలో పాలుపోవడం లేదు. ఈ విషయంలో ఆమె ప్రభుత్వం తీసుకున్న చర్యలు మాత్రం ఉపశమమం ఇవ్వకపోతే బెడిసికొడుతున్నాయి. ఏకంగా ఒక చీఫ్ మినిస్టరే ఈ ఇష్యూలో రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేయడం ఒక వింతగా చెప్పుకున్నారు.

అంతే కాదు ఆమె ఇటువంటి ఘటనలు జరగకుండా కఠినమైన చట్టాలను చేయమని కేంద్రాన్ని డిమాండ్ చేయడం మరో వింతా విడ్డూరం. ఆమె బెంగాల్ సీఎం. ఆమె చేతిలో పూర్తి అధికారాలు ఉన్నాయి. ఆమె చట్టాలను చేయగలరు. ఆమె పరిధిలో ఇలాంటి ఘటనలను అణచివేయడానికి తగిన చర్యలు తీసుకోవచ్చు.

కానీ మమతా బెనర్జీ మాత్రం కేంద్రం మీద విరుచుకుపడుతూ రాంగ్ రూట్ లోకి వెళ్లారు. ఇక బెంగాల్ లో బలంగా మారడానికి ఇదే తగిన తరుణం అని బీజేపీ భావిస్తోంది. దాంతో ఆ పార్టీ ఎక్కడా తగ్గలేదు. దీదీ మీద తనదైన రాజకీయ పోరాటం సాగిస్తూ వస్తోంది. మరో వైపు ఈ ఇష్యూ మీద సొంత పార్టీ తృణమూల్ కాంగ్రెస్ తో పాటు ప్రభుత్వంలో విభేదాలు ఉన్నాయని కూడా ప్రచారం సాగింది. ఈ ఇష్యూని సరిగ్గా టేకిల్ చేయలేక దీదీ ఇబ్బందులో పడి ప్రభుత్వాని పార్టీని అలాగే ఇబ్బంది పెట్టారు అని సొంత పార్టీలో అనేకమంది అనుకున్నారు. ఈ నేపధ్యంలో ఆమెకు సొంత పార్టీ ఎంపీ నుంచే భారీ షాక్ తగిలింది.

ఆ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపి జవహర్‌ సిర్కార్‌ ఆదివారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రాజీనామాకు దారి తీసిన కారణాల గురించి ఆయన చెప్పినవి మాత్రం దీదీకి మరింతగా ఇబ్బందిపెట్టేవిగా ఉన్నాయి. ఆర్‌జి కర్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌ హత్యాచారం ఘటనతో పాటు, ఆస్పత్రిలో జరిగిన అవినీతికి సంబంధించి తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు ఆయన టిఎంసి పార్టీ చైర్‌పర్సన్‌, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాసిన లేఖలో అనేక అంశాలను ప్రస్తావించారు. ఆర్‌జి కర్‌ ఆస్పత్రిలో ఘోరమైన ఘటనపై తీవ్రంగా బాధపడ్డాను, ఈ ఘటన జరిగిన తర్వాత ఓపిగ్గా నెలరోజులపాటు ఎదురు చూశాను. కానీ మీరు పాత పద్ధతిలొ జూనియర్‌ డాక్టర్ల సమస్యపై ప్రత్యక్షంగా.జోక్యంగా చేసుకుంటారని ఆశించాను. కానీ, అది జరగలేదు. ప్రభుత్వం ఇప్పుడు చాలా ఆలస్యంగా అరకొర చర్యలు తీసుకుంటుంది. నేను ఇక ఎంపీగా కొనసాగలేను. అవినీతి, మతతత్వం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల్లో నయంతృత్వంపై పోరాడటంలో ఏమాత్రం రాజీలేదు అని జవహర్‌ తన లేఖలో పేర్కొన్నారు.

ఆయన మరిన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. దీదీ ప్రభుత్వం వాస్తవాలను సత్యాన్ని చెప్పినప్పటికీ ప్రభుత్వంపై వ్యతిరేకత, అవిశ్వాసాన్ని ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఆప్తులైన కొద్ది మంది అవినీతిపరుల అడ్డూ అదుపు లేని, మితిమీరిన వైఖరికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రజలు చేపడుతున్న ఆందోళన ప్రభుత్వాన్ని తాకుతోందని అని కూడా ఆయన హెచ్చరించారు.

అదే సమయంలో బాధితులకు రాజకీయాలు వద్దని, న్యాయం కావాలని, నిందితులకు శిక్ష విధించడం కావాలని అన్నారు. ఇక తృణమూల్ కాంగ్రెస్ పనితీరు గురించి ఆయన తీవ్ర వ్యాఖ్యలే చేశారు. పార్టీలో ఆప్తుల, అవినీతిపరులకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని ఆక్షేపించారు.

ఇటీవల ఎన్నికైన పలువురు పంచాయితీ, మునిసిపల్‌ నేతలు అవినీతితో పెద్ద ఎత్తున ఆస్తులను సంపాదించడం చూసి ఆశ్చర్యపోయానని, ఇవి తనకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా బాధ కలిగిస్తున్నాయని అన్నారు. మొత్తానికి దీదీ ప్రభుత్వాన్ని అవినీతి అసమర్థ ప్రభుత్వంగా సొంత పార్టీ ఎంపీ తేల్చేశారు. అంతే కాదు తృణమూల్ కాంగ్రెస్ పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన తనదైన సర్వే వినిపించారు. ఇది ఒక విధంగా దీదీకి హెచ్చరికగానే చూడాలని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే దీదీకి ఇలాంటి షాక్ గతంలో తగిలి ఉండదు. ఒక సీనియర్ ఎంపీ రాజీనామా చేస్తూ ఇన్ని బండలు వేశారు అంటే తృణమూల్ లో ఏదో జరుగుతోంది దీదీకి రానున్న రోజులు ఇబ్బంది పెట్టేవే అన్నది విశ్లేషకుల మాటగా ఉంది.