వైసీసీకి మరో బిగ్ షాక్.. కీలక ఎంపీ గుడ్ బై?
సోషల్ మీడియా కథనాల ప్రకారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు అత్యంత నమ్మకస్తుడైన ఎంపీ ఒకరు ఆ పార్టీని వీడనున్నారు.
By: Tupaki Desk | 28 Aug 2024 9:30 AM GMTఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమెల్యే కిలారి రోశయ్య రాజీనామా చేసి వెళ్లిపోయిన సంగతి మర్చిపోకముందే.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గుడ్ బై చెప్పి కొద్ది రోజులు కూడా గడవక ముందే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కలకలం చోటుచేసుకునందా? ఇటీవలి ఎన్నికల్లో దారుణ పరాజయంతో అధికారం కోల్పోయిన వైఎస్సార్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే చాన్సుందా? సోషల్ మీడియా ఊహాగానాలే నిజమైతే.. ఆ పార్టీకి ఓ కీలక ఎంపీ గుడ్ బై చెప్పనున్నారా?
ఆయనంటే జగన్ కు నమ్మకం
సోషల్ మీడియా కథనాల ప్రకారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు అత్యంత నమ్మకస్తుడైన ఎంపీ ఒకరు ఆ పార్టీని వీడనున్నారు. కారణాలు ఏమనేది చెప్పకున్నా.. తమ జిల్లాకు చెందిన మంత్రితో ఆయన సమావేశం అయ్యారని అంటున్నారు. వైసీపీలో ఆయనకు మంచి ప్రాధాన్యమే దక్కినా.. ఆ పార్టీ అధికారం కోల్పోవడం, అసెంబ్లీ ఎన్నికల్లో తాను కోరుకున్న నియోజకవర్గం సీటు ఇవ్వకపోవడంతో ఆ ఎంపీ పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చాక తొలి విడత మంత్రివర్గంలో ఆ ఎంపీకి చోటు లభించింది. ఏడాది పాటు మంత్రిగా కొనసాగారు. ఇంతలోనే రాజ్య సభ సీటు ఖాళీ కావడంతో జగన్ ఆయనను రాజ్యసభకు పంపారు.
రెండేళ్ల పదవీ కాలం ఉన్నా..
సోషల్ మీడియా కథనాల ప్రకారం.. పార్టీ మారే యోచనలో ఉన్న వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ. 1989, 1994లో కూచినపూడి (తర్వాత రద్దయింది) నుంచి ఓడిపోయిన మోపిదేవి.. 1999, 2004లో గెలిచారు. 2009లో రేపల్లె నుంచి విజయం సాధించారు. అయితే, వైసీపీ తరఫున
2014, 2019లో రేపల్లెలోనే ఓడిపోయారు. 2020లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయనను రాజ్యసభకు పంపింది. కాగా, తాజా ఎన్నికల్లోనూ మోపిదేవి రేపల్లె టికెట్ ఆశించారు. కానీ, జగన్ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఇక పార్టీ కూడా పరాజయం పాలవడంతో మోపిదేవి వైసీపీలో కొనసాగే ఉద్దేశంలో లేరని అంటున్నారు. వాస్తవానికి మరో రెండేళ్లు ఆయన రాజ్యసభ పదవీ కాలం ఉంది.
చేరేది ఏ పార్టీలోనో?
మోపిదేవి వెంకటరమణ ఏ పార్టీలో చేరతారనేది కీలకం కానుంది. రాజ్యసభలో బీజేపీకి బలం లేదు. దీంతో కాషాయ పార్టీ పెద్దలు ఆయనను చేర్చుకునే అవకాశం ఉంది. మరోవైపు గుంటూరు జిల్లాలో జనసేన ప్రభావం కూడా అధికమే. ఆ పార్టీకి రాజ్య సభలో ఎంపీ లేరు. ఇక ఏపీ అధికార కూటమిలో పెద్దన్న టీడీపీ. రాజ్యసభకు ఈసారి భారీగా ఎంపీలను పంపగల సంఖ్యాబలం కూటమికి దక్కంది. మోపిదేవి చేరేది కూడా టీడీపీలోనే అంటున్నారు. ఒకవేళ రాజ్యసభకు రాజీనామా చేసినా.. ఎన్నికలు జరిగే గెలిపించుకునే సంఖ్యా బలం కూటమికి ఉంది. మరి మోపిదేవి రాజీనామా చేసి చేరతారా? లేక టీడీపీలో నేరుగా చేరుతారా? చూడాలి. కాగా, మోపిదేవి.. జగన్ పై నమోదైన అక్రమ ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్నారు. జగన్ తో పాటు కొన్నాళ్లు జైలులో ఉన్నారు.