జగన్ అత్యంత సన్నిహితుడికి ఈసారి సీటెక్కడ?
అలాగే అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా డిక్లేర్ చేశారు. ఇదే కోవలో కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎంపీ బాలశౌరిని కూడా మారుస్తారని టాక్ నడుస్తోంది.
By: Tupaki Desk | 9 Jan 2024 8:30 AM GMTఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీతోపాటు పార్లమెంటుకు కూడా ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్థానాలతోపాటు పార్లమెంటు స్థానాల్లోనూ వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను ఈసారి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా డిక్లేర్ చేశారు. ఇదే కోవలో కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎంపీ బాలశౌరిని కూడా మారుస్తారని టాక్ నడుస్తోంది.
వల్లభనేని బాలశౌరి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు. బాలశౌరిని జగన్.. బాలా అని ఆప్యాయంగా పిలుస్తారు. జగన్ రాజకీయాల్లోకి ప్రవేశించకముందే వీరిద్దరూ వ్యాపారంలో భాగస్వాములు. 2004లో గుంటూరు జిల్లా తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా వల్లభనేని బాలశౌరి గెలుపొందారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో తెనాలి పార్లమెంటరీ నియోజకవర్గం రద్దు కావడంతో ఆ ఎన్నికల్లో నరసరావుపేట నుంచి ఎంపీగా బరిలో దిగారు.
2009 ఎన్నికలప్పుడు వల్లభనేని బాలశౌరి తరఫున అప్పుడే రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన వైఎస్ జగన్ ప్రచారం చేయడం విశేషం. బాలాను గెలిపించాలని జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో బాలశౌరి టీడీపీ తరఫున పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చేతిలో కేవలం 1607 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఇక 2014లో వైసీపీ తరఫున గుంటూరు నుంచి బరిలోకి దిగి బాలశౌరి పరాజయం పాలయ్యారు. 2019లో మళ్లీ నియోజకవర్గం మార్చి కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి ఎంపీగా గెలుపొందారు.
వల్లభనేని బాలశౌరి ఇప్పటివరకు నాలుగు ఎన్నికల్లో పోటీ చేయగా నాలుగుసార్లు వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం విశేషం. నాలుగు ఎన్నికల్లో రెండుసార్లు గెలిచిన బాలశౌరి మరో రెండుసార్లు ఓడిపోయారు.
కాగా కాపు సామాజికవర్గానికి చెందిన బాలశౌరిని వచ్చే ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేయించే యోచనలో జగన్ ఉన్నారని టాక్ నడుస్తోంది. మచిలీపట్నం సీటును బీసీలకు ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతోంది. టీడీపీ తరఫున మచిలీపట్నంలో 2009, 2014ల్లో గౌడ సామాజికవర్గానికి చెందిన కొనకళ్ల నారాయణ ఎంపీగా గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున ఆయనే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా ఈ సీటును బీసీలకు ఇచ్చే ఆలోచన చేస్తోంది.
ఈ నేపథ్యంలో తనకు అత్యంత సన్నిహితుడైన వల్లభనేని బాలశౌరిని ఏలూరు నుంచి పోటీ చేయిస్తారని టాక్ నడుస్తోంది. లేదంటే నరసాపురం ఎంపీగా పోటీ చేయిస్తారని చెబుతున్నారు.