Begin typing your search above and press return to search.

చోరీ చేస్తూ దొరికిన మహిళా ఎంపీ.. ఆమె ఎవరంటే?

ఆమె ఒక ఎంపీ. చట్టసభకు ఎంపికైన సదరు మహిళా నేత.. షాపుల్లో దొంగతనం చేస్తూ కెమేరా కంటికి దొరికిపోయింది

By:  Tupaki Desk   |   17 Jan 2024 6:20 AM GMT
చోరీ చేస్తూ దొరికిన మహిళా ఎంపీ.. ఆమె ఎవరంటే?
X

ఆమె ఒక ఎంపీ. చట్టసభకు ఎంపికైన సదరు మహిళా నేత.. షాపుల్లో దొంగతనం చేస్తూ కెమేరా కంటికి దొరికిపోయింది. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వైరల్ గా మారటం.. దీనిపై విపక్షాలు విరుచుకుపడటంతో.. మరో దారి లేని ఆమె తాజాగా తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన వైనం ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకూ సదరు మహిళా ఎంపీ ఏ దేశానికి చెందిన వారన్నది చూస్తే.. ఆమె న్యూజిలాండ్ కు చెందిన గోలిజ్ గ్రాహమన్. కొద్ది రోజులకు ముందు ఇదే న్యూజిలాండ్ కు చెందిన యువ మహిళా ఎంపీ ఒకరు తన పవర్ ఫుల్ స్పీచ్ తో.. ఆ దేశ పార్లమెంట్ ను.. ప్రపంచాన్ని తన వైపు చూసేలా చేయటం తెలిసిందే.

అందుకు భిన్నంగా మహిళా ఎంపీ గోలిజ్ మాత్రం తన తీరుతో న్యూజిలాండ్ దేశ పరువును మంట కలిపిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్లాండ్.. వెల్లింగ్టన్ నగరాల్లోని వస్త్ర దుకాణాలు.. షాపింగ్ మాల్ లో మూడుసార్లు ఆమె చోరీకి పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఖరీదైన హ్యాండ్ బ్యాగ్.. డ్రెస్ లను చోరీ చేస్తూ కెమేరా కంటికి చిక్కేశారు.

ఈ నేపథ్యంలో ఆమెపై వచ్చిన విమర్శల తాకిడితో మరో మార్గం లేక ఆమె తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అయితే.. ఈ సందర్భంగా తాను చేసిన తప్పుడు పనుల్ని తెలివిగా కవర్ చేసుకునే ప్రయత్నం చేయటం గమనార్హం. తాను చోరీ చేయటానికి కారణం.. తన మానసిక ఆరోగ్యం సరిగా లేదని పేర్కొనటం గమనార్హం. తాజాగా వెలుగు చూసిన సీసీ ఫుటేజ్ దెబ్బకు తన ప్రవర్తనకు సారీ చెప్పిన ఆమె.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రస్తుతం ఆమెపై చోరీ కేసు విచారణ సాగుతోంది. గతంలో ఆమె మానవ హక్కుల కేసులు వాదించే లాయరుగా సుపరిచితం. తర్వాతి కాలంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఎంపీగా గెలుపొందారు. ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాలి. 2017లో ఆమె ఇరాన్ నుంచి వలస వచ్చి న్యూజిలాండ్ లో ఎంపీగా గెలుపొందిన తొలి వలస వ్యక్తిగా రికార్డుక్రియేట్ చేశారు. ఇంతటి పేరు ప్రఖ్యాతులున్న ఆమె.. షాపుల్లో దొంగతనం చేస్తారన్న విషయం తెలుసుకొని షాక్ తింటున్నారు.

ఇదిలా ఉంటే.. తన ప్రవర్తనకు చింతిస్తున్నట్లుగా చెప్పిన ఆమె.. ఇప్పుడు కొత్త వాదనను తెర మీదకు తీసుుకొచ్చారు. తాను మానసిక వ్యాధితో బాధ పడుతున్నానని.. తన చర్యలకు అదే కారణమన్న ఆమె.. ‘‘నాపై పని ఒత్తిడి విపరీతమైన ప్రభావాన్ని చూపుతోంది. ఆ ఒత్తిడి నా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తోంది. కొన్నిసార్లు వాస్తవ మనస్తత్వానికి భిన్నంగా కొన్ని పనులు చేసేలా మానసిక ఒత్తిళ్లు దారి తీస్తున్నాయి. అయితే.. ఆ పనులు ఏమిటో నేను వెల్లడించలేను. ప్రజాప్రతినిధిగా అత్యున్నత స్థాయి ప్రమాణాల్ని నెలకొల్పాల్సి ఉంది. ఆ విధంగా చేయలేకపోయా. అందుకు క్షమాపణలు’’ అంటూ వివరణ ఇచ్చిన ఆమె.. ఇకపై తాను మానసిక ఆరోగ్యంపై ఫోకస్ చేస్తానని చెప్పటం గమనార్హం.