ఎంపీ అటు.. మంత్రి ఇటు.. భలే ఈక్వేషన్!
స్థానికంగా అనంతపురంలో ఇప్పటి వరకు ఈ సీటు నుంచి మహిళలకు ఏ పార్టీ కూడా సీటును కేటాయిం చింది లేదు
By: Tupaki Desk | 29 Dec 2023 2:45 AM GMTఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ సంచలన ఈక్వేషన్‌కు తెరదీసింది. కురబ సామాజిక వర్గానికి చెం దిన ప్రజల ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండడంతో వారి అభీష్టానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఈక్వేషన్లను కూడా.. ఆచి తూచి తీసుకుంటోంది. తాజాగా పార్టీ నిర్ణయించిన మేరకు.. జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉష శ్రీచరణ్‌ను అనంతపురం ఎంపీ పోస్టుకు పంపాలని భావిస్తున్నారు.
స్థానికంగా అనంతపురంలో ఇప్పటి వరకు ఈ సీటు నుంచి మహిళలకు ఏ పార్టీ కూడా సీటును కేటాయిం చింది లేదు. పైగా కురబ సామాజిక వర్గానికి చెందిన మహిళకు పెద్దగా ఈ జిల్లాలో ప్రాధాన్యం లేదు. గతంలో కమ్మ, రెడ్డి, లేదా రిజర్వ్‌డ్ సామాజిక వర్గాలకు మాత్రమే కాంగ్రెస్, టీడీపీలు టికెట్లు ఇచ్చాయి. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు వైసీపీ కురబ వర్గానికి చెందిన ఉష శ్రీచరణ్‌ను అనంతపురం ఎంపీగా పంపాలని నిర్ణయించినట్టు సమాచారం.
ఇక, ఇదే అనంతపురం ఎంపీగా ఉన్న సేమ్ సామాజిక వర్గానికి చెందిన తలారి రంగయ్య ను కూడా మార్పు చేయనున్నారు. ఈయనను ఇదే జిల్లాలోని సొంత నియోజకవర్గం పెనుకొండకు పంపించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. వాస్తవానికి ఎంపీగా రంగయ్య మంచి పేరు తెచ్చుకున్నారు. మాజీ బ్యూరోక్రాట్ అయిన రంగయ్య. . మంచి వక్త కూడా. అయినప్పటికీ.. మంత్రి ఉష కు ఈ సీటును ఇవ్వనున్న నేపథ్యంలో మార్పు దిశగా పార్టీ అడుగులు వేసింది.
ఇక, పెనుకొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి శంకరనారాయణను ఈసారి పక్కన పెట్ట నున్నట్టు సమాచారం. ఈయనపై వస్తున్న వ్యతిరేకత, పార్టీలోనూ సానుభూతి తగ్గడం వంటి పరిణా మాల నేపథ్యంలో శంకరనారాయణకు ఈ సారి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. పెనుకొండకు ఎంపీని, అనంతపురం ఎంపీగా మంత్రి ఉషశ్రీచరణ్‌ను పంపించడం ద్వారా.. రసవత్తరమైన రాజకీయ ఈక్వేషన్‌కు పార్టీ తెరదీసిందని అంటున్నారు.