ఎంపీ అంటే ఎందుకు మోజు తగ్గింది...!?
ముందుగా చెప్పుకుంటే ప్రాంతీయ పార్టీలలో ఎంపీ పోస్టులో ఉన్న వారి మీద ఆర్ధిక భారాలు ఎన్నికల వేళ దండీగా పడుతున్నాయి.
By: Tupaki Desk | 17 Jan 2024 4:15 AM GMTనిజానికి ఎంపీ సీటు చాలా విలువ అయినది. ఎమ్మెల్యే అయితే ఒకే అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రతినిధి. అదే ఎంపీ అయితే పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రతినిధి. పైగా ఢిల్లీలోని అత్యున్నత పార్లమెంట్ లో మెంబర్ అవుతారు. చాలా హుందా అయిన పోస్టు. అంతే కాదు గౌరవం కూడా ఎక్కువ.
అలాంటి ఎంపీ పోస్టు అంటే ఎందుకు ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు విముఖత ప్రదర్శిస్తున్నారు అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. ముందుగా చెప్పుకుంటే ప్రాంతీయ పార్టీలలో ఎంపీ పోస్టులో ఉన్న వారి మీద ఆర్ధిక భారాలు ఎన్నికల వేళ దండీగా పడుతున్నాయి. ఎంపీ టికెట్ ఇవ్వడంతో పాటు ఆయన పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను గెలిపించుకునేందుకు ఆర్ధికంగా అండగా ఉండమని బాధ్యత మోపుతున్నారు.
అలా అందరి గెలుపు కోసం నిధులు వెచ్చింది తన గెలుపును కూడా వారిలో చూసుకుంటూ ఖర్చు పెట్టుకుంటే తడసి మోపెడు అవుతోంది. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం లో ఈ రోజులలో చూస్తే కచ్చితంగా వంద కోట్ల దాకా వెచ్చించాల్సి వస్తోంది. పోనీ ఇంత ఖర్చు పెడితే ఎంపీగా అధికారాలు ఉంటాయా అంటే లేవు అనే అంటున్నారు.
కనీసం తమ మటుకు తాము ఒక చిన్న అధికారికి అయినా పోస్టింగ్ వేయించుకునే పవర్ లేకుండా పోయింది అని ఎంపీలు గోల పెడుతున్నారు. అంతే కాదు ప్రతీ చోటా ఎమ్మెల్యేలదే పెత్తనం అయిపోతోంది. వారే అన్నింటా ఉంటున్నారు అన్ని రకాలుగా వారే కనిపిస్తున్నారు.
దాంతో ఎంపీలుగా గెలిచి ఏమి లాభం అన్న వైరాగ్యం అయితే రాను రానూ చాలా మందిలో కలుగుతోంది అని అంటున్నారు. మరో విషయం కూడా ఉంది అంటున్నారు. అదేంటి అంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంపీ నిధులు తగ్గించేశారు అని అంటున్నారు. దాంతో తాము గా ఖర్చు పెట్టేది కూడా పెద్దగా ఉండడం లేదు అని అంటున్నారు.
ఇక ఎమ్మెల్యేలు తమను పట్టించుకోకపోవడంతో ఎంపీ ఎందుకు అన్న భావనకు చాలా మంది వచ్చేశారు. అందుకే ఈసారి అధికార వైసీపీ విపక్ష టీడీపీలలో ఎంపీ అభ్యర్ధులు చాలా మందిని వెతికి చూసినా నో అని చెప్పేస్తున్నారుట. హాయిగా తాము ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తామని టికెట్ ఉంటే అలా ఇవ్వండి అని కోరుకుంటున్నారు అంటున్నారు.
ఈ పరిణామాల నేపధ్యంలో 2024 ఎన్నికల్లో అధికార వైసీపీ విపక్ష తెలుగుదేశం పార్టీలకు ఎంపీ అభ్యర్ధులు దొరకడం కష్టం అన్న భావన ఉంది అని అంటున్నారు. దాంతో ట్రెడిషనల్ పొలిటీషియన్లకు పక్కన పెట్టి పారిశ్రామికవేత్తలు డబ్బున వారి కోసం రెండు ప్రధాన పార్టీలు చూస్తున్నాయని అంటున్నారు. ఈసారి చాలా చోట్ల కొత్త అభ్యర్ధులు కనిపిస్తారు అని అంటున్నారు.