ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.. కూటమిలో ఆధిపత్య పోరు.. !
కూటమిలో అందరూ కలిసి మెలిసి ఉండాలంటూ.. సీఎం చంద్రబాబు నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వరకు అందరూ చెబుతున్నారు.
By: Tupaki Desk | 1 Jan 2025 5:30 PM GMTకూటమిలో అందరూ కలిసి మెలిసి ఉండాలంటూ.. సీఎం చంద్రబాబు నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వరకు అందరూ చెబుతున్నారు. కానీ, ఇది మేడిపండు మాదిరిగానే ఉంది. చాలా చోట్ల ఎంపీలు.. ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ పెరిగిపోతోంది. కారణాలు ఏవైనా.. నాయకులు రోడ్డున పడుతున్నారు. ఇటీవల రెండు కీలక పార్లమెంటు స్థానాల్లో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ మధ్య చోటు చేసుకున్న రాజకీయాలు.. రాష్ట్రం లో చర్చకు దారితీశాయి. బాపట్ల పార్లమెంటు స్థానంలో ఓ ఎమ్మెల్యేకు ఇక్కడి ఎంపీకి భగ్గు మనే రాజకీ యాలు సాగుతున్నాయి.
అదేవిధంగా మచిలీపట్నం ఎంపీగా ఉన్న బాలశౌరికి ఈ నియోజకవర్గం పరిధిలోని ఇద్దరు టీడీపీ ఎమ్మె ల్యే లకు మధ్య కూడా రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. బాపట్ల విషయానికి వస్తే.. ఇసుక లావాదేవీలు.. ఎంపీ అనుచరులకు, ఎమ్మెల్యే అనుచరులకు మధ్య చిచ్చు పెట్టింది. ఈ వ్యవహారంలో ఎంపీ అనుచరులకు చెందిన ఓ ట్రాక్టర్‌ను ఎమ్మెల్యే అనుచరులు.. కాల్చేశారు. వారిపై భౌతిక దాడికి కూడా దిగారు. ఈ పరిణామం వెనుక ఎంపీ, ఎమ్మెల్యేల ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపించింది.
ఇక, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సొంత నియోజకవర్గం మచిలీపట్నం ఉన్న పార్లమెంటు స్థానం లోనూ కూటమిపార్టీ నేతల మధ్య మద్యం సిండికేట్ విషయంలో వివాదాలు చెలరేగాయి. వాటాల వ్యవ హారం.. ఇక్కడ ఎంపీకి, ఇద్దరు కీలక ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. ముందు తామే తీసుకుంటామని టీడీపీ ఎమ్మెల్యేలు.. అసలు తీసుకోవడానికి వీల్లేదని జనసేన ఎంపీ పట్టు బట్టడం వివాదానికి దారితీసింది. నాలుగు షాపులకు తాళాలు వేశారు.
ఇదేవిధంగా విజయవాడ ఎంపీకి.. మైలవరం ప్రాంతంలోని ఓ ఎస్సీనియోజకవర్గం ఎమ్మెల్యేకు మధ్య మద్యం వివాదం తారాస్థాయిలో చోటు చేసుకుంది. ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారైనా.. పంపకాల విషయంలో తనకు అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్యే చెబుతున్నారు. ఈ క్రమంలోనే రోడ్డెక్కి ఘర్షణ వైఖరిని ప్రదర్శిస్తున్నారు. దీనిపై పంచాయితీ పెట్టాలన్నది ఎంపీ ఆలోచన. కానీ, అధిష్టానం ఈ విషయాన్ని ప్రస్తుతానికి సర్దుబాటు చేసింది. తన అనుచరుల దుకాణాలకే తాళం వేయడంపై ఎంపీ రగిలిపోతున్నారట. మొత్తంగా.. మద్యం, ఇసుక విషయాల్లో కూటమి పార్టీల నాయకులమధ్య వివాదాలు ముదురుతున్నాయనే అంటున్నారు పరిశీలకులు.