ఒకరు ధన్యవాదాలు.. మరొకరు నమస్కారాలు: వైసీపీకి ఎంపీల గుడ్ బై
కొద్ది సేపు ఆయనతో ముచ్చటించిన అనంతరం.. ఇద్దరూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
By: Tupaki Desk | 29 Aug 2024 10:58 AM GMTఅనుకున్నట్టుగానే వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ.. బీద మస్తాన్ రావులు రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం 1 గంట సమయంలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌తో భేటీ అయిన ఇద్దరు నాయకులు.. ఆయనకు తమ రాజీనామా పత్రాలు అందించారు. వ్యక్తిగత కారణాలతోనే తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ఈ సందర్భంగా చైర్మన్‌కు తెలిపారు. కొద్ది సేపు ఆయనతో ముచ్చటించిన అనంతరం.. ఇద్దరూ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
తొలుత మోపిదేవి మాట్లాడుతూ.. ``వైసీపీకి నమస్కారం`` అని ముక్తసరిగా వ్యాఖ్యానించారు. తాను టీడీపీ లో చేరుతున్నానని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించేందుకు కృషి చేస్తున్న చంద్రబాబు కు మద్దతు ఇవ్వడం కోసమే.. తాను టీడీపీలో చేరుతున్నానని తెలిపారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టులు ఆయన హయాంలోనే పూర్తవుతాయని నమ్ముతున్నట్టు చెప్పారు. ఉపాధి, ఉద్యోగ కల్పనకు కూడా చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. ఇంతకుమించి ఆయన వైసీపీ పై ఎలాంటివిమర్శలు చేయలేదు.
బీద మస్తాన్ రావు మాట్లాడుతూ.. ``వైసీపీకి ధన్యావాదాలు. పార్టీ కార్యకర్తలు.. వెన్నంటి నిలిచారు. వారికి కూడా ధన్యవాదాలు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేశా`` అని మస్తాన్ రావు వ్యాఖ్యానించారు. తాను ఇంకా ఏ పార్టీలో చేరేదీ నిర్ణయించుకోలేదన్న ఆయన.. త్వరలోనే తన అభిమానులు, అనుచరుల తో చర్చించి నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. వైసీపీలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. కానీ, వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని చెప్పారు. దీంతో వీరి ప్రధాన ఘట్టం పూర్తయింది. ఏపీకి తిరిగి వచ్చిన వెంటనే పార్టీకి కూడా రాజీనామా చేయనున్నారు. దీంతో వారికి వైసీపీకి బంధం తెగిపోనుంది.