Begin typing your search above and press return to search.

రూ.లక్షల కోట్ల ఆస్తులు.. పైగా ఎంపీ.. ఇంత సింప్లిసిటీనా!

ప్రముఖ రచయిత్రి, ఐటీ దిగ్గజం.. ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణమూర్తి సతీమణి, రాజ్యసభ ఎంపీ అయిన సుధామూర్తి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.

By:  Tupaki Desk   |   6 July 2024 6:16 AM GMT
రూ.లక్షల కోట్ల ఆస్తులు.. పైగా ఎంపీ.. ఇంత సింప్లిసిటీనా!
X

ప్రముఖ రచయిత్రి, ఐటీ దిగ్గజం.. ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణమూర్తి సతీమణి, రాజ్యసభ ఎంపీ అయిన సుధామూర్తి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె పలు స్వచ్ఛంధ సంస్థలను కూడా నడుపుతున్నారు. ఎన్నో పుస్తకాలను రాశారు. ఇన్ఫోసిస్‌ లో తన భర్త, కుమార్తె ఆస్తులు కాకుండానే సుధామూర్తికి రూ.వేల కోట్ల విలువ చేసే షేర్లు ఉన్నాయి. అయినప్పటికీ ఆమె చాలా సింపుల్‌ గా ఉంటారు. ఆడంబరాలకు పోరు.. చాలా నిరాడంబరంగా ఉంటారు. ఇప్పటికీ మధ్యతరగతి మహిళను తలపించేలానే ఆమె ఆహ్యారం ఉంటుంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సుధామూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 30 ఏళ్లుగా తాను ఒక్క చీర కూడా కొనుగోలు చేయలేదని వెల్లడించారు. తన నిర్ణయానికి కాశీ యాత్ర కారణమని ఆమె వివరించారు. కాశీకి వెళ్లినప్పడు ఏదో ఒకటి మనకు ఇష్టమైనదాన్ని వదిలేయాలంటారని సుధామూర్తి గుర్తు చేశారు. దీంతో తాను తనకెంతో ఇష్టమైన షాపింగ్‌ ను వదిలేశానని తెలిపారు. జీవితాంతం షాపింగ్‌ ను వదిలేస్తానని గంగలో స్నానం సందర్భంగా వాగ్ధానం చేశానన్నారు.

దీంతో గత 30 సంవత్సరాలకు పైగా సోదరీమణులు, సన్నిహితులు, తాను సహకారం అందజేసే ఎన్జీవోలు తనకు బహుమతిగా ఇచ్చిన చీరలనే తాను ధరిస్తున్నానని సుధామూర్తి తెలిపారు. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ తో కలిసి స్వచ్ఛంధ సంస్థలకు ఆమె సహకారం అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళల బృందం ఎంబ్రాయిడరీ చేసిన చీరలు తనకు బహుమతిగా అందించారని.. వాటినే ధరిస్తున్నానని సుధామూర్తి వెల్లడించారు.

గత 50 ఏళ్లుగా తాను చీరలు ధరిస్తున్నానని.. వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటానని సుధామూర్తి తెలిపారు. వాటిని పాడవకుండా చూసుకుంటానన్నారు. అలాగే నేలను తాకేలా చీరను ధరించనన్నారు. దీంతో వాటికి మురికి అంటదన్నారు. అలాగే ఇస్త్రీ అవసరం కూడా లేకుండా చూసుకుంటానన్నారు.

తన తల్లిదండ్రులు, తన గ్రాండ్‌ పేరెంట్స్‌ ఎంతో నిబద్ధతతో తనను పెంచారని.. ఉన్న కొద్దిపాటి ఆస్తులతోనే వారెంతో పొదుపుగా జీవించేవారని తెలిపారు. అవే లక్షణాలు తనకు కూడా అబ్బాయని చెప్పారు.

తన ఆరేళ్ల క్రితం మరణించినప్పుడు ఆమె అల్మారాలో ఉన్న కేవలం 8–10 చీరలు మాత్రమే ఉన్నాయన్నారు. అలాగే 32 ఏళ్ల క్రితం తన అమ్మమ్మ మరణించినప్పుడు కూడా ఆమె వద్ద కేవలం నాలుగే చీరలు ఉన్నాయని సుధామూర్తి గుర్తు చేసుకున్నారు. తన తల్లి, అమ్మమ్మ చాలా పొదుపుగా, పొందికగా జీవించారని.. అవే లక్షణాలు వారి నుంచి తనకు కూడా వచ్చాయని తెలిపారు. తక్కువ మొత్తంతోనే జీవించడం నేర్చుకున్నానన్నారు.