పొలిటికల్ డ్రామాలు, మృత్యుంజయ హోమాలు.. వీహెచ్ నిప్పులు!
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరూ మైకుల ముందుకు వచ్చి జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తూ.. విరుచుకుపడుతున్నారు.
By: Tupaki Desk | 23 Dec 2024 1:52 PM GMT‘పుష్ప-2’ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ వద్ద గల సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన ఇప్పుడు రాజకీయంగానూ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరూ మైకుల ముందుకు వచ్చి జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తూ.. విరుచుకుపడుతున్నారు.
ప్రధానంగా ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవివరంగా వ్యాఖ్యానించడం.. అల్లు అర్జున్ మీడియా ముందుకు వచ్చి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అప్పటి నుంచి కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా అల్లు అర్జున్ పై ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో వీహెచ్ స్పందించారు.
అవును... సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర చర్చనీయాంశం అయిన వేళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు స్పందించారు. ఇందులో భాగంగా... తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సమాచారం మాత్రమే ఇచ్చారని.. దానికి బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదని అన్నారు.
ఈ సందర్భంగా.. ఈ వ్యవహారాన్ని చాలా మంది రాజకీయంగా వాడుకుంటున్నారని.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని ఒకరు, కక్ష సాధింపు చర్యలు అని మరొకరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా... రాష్ట్రంలో పరిస్థితులు బాగా లేవని అంటున్న కిషన్ రెడ్డి.. మణిపూర్ అల్లర్ల గురించి సమాధానం చెప్పాలని అన్నారు.
ఈ ఘటనపై బీఆరెస్స్, బీజేపీ నాయకులు శవాల మీద పేలాలు ఏరుకుంటున్నట్లు చేస్తున్నారని.. అల్లు అర్జున్, అల్లు అరవింద్ ల మాటలు నమ్మొద్దని సూచించిన వీహెచ్... ఈ ఘటనపై పొలిటికల్ డ్రామాలు బంద్ చేయాలని.. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని.. శ్రీతేజ కోలుకోవాలని అంతా కోరుకుందామని అన్నారు.
అంతే కాకుండా... కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ చావు బ్రతుకుల మధ్య ఉన్నాడని.. ఈ సమయంలో ఆ బాలుడి కోసం అల్లు అర్జున్ మృత్యంజయ యాగం చేయాలని సూచించారు. ఈ ఘటనలో ఏం జరగకముందే సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రావాలని ఆఫర్లు ఇస్తున్నారని మండిపడ్డారు. అసలు ఫిల్మ్ ఇండస్ట్రీని తెలంగాణకూ తీసుకొచ్చిందే కాంగ్రెస్ అని తెలిపారు.