బైక్ ప్రమాదంలో 'మిస్టర్ తెలంగాణ' సోహైల్ మృతి!
రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 11 July 2024 7:43 AM GMTరోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. నిర్లక్ష్యపు డ్రైవింగ్, అవగాహన లేని డ్రైవింగ్, మద్యం మత్తు, నిద్రలేమి, మితిమీరిన వేగం... కారణం ఏదైనా నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతూనే ఉన్నాయి. ఈ సమయంలో ‘మిస్టర్ తెలంగాణ’ మృతి చెందారు.
అవును... ప్రముఖ బాడీ బిల్డర్, మిస్టర్ తెలంగాణ విజేత మహ్మద్ సోహలి మృతి చెందాడు. జూన్ 29న అతని స్నేహితుడు మహ్మద్ ఖదీర్ తో కలిసి సిద్దిపేట నుంచి మిరిదొడ్డి వైపుకు బైక్ పై వెళ్తుండగా.. ఆ బైక్ అదుపుతప్పి స్క్రాప్ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహ్మద్ సోహైల్ తో పాటు అతని స్నేహితుడు ఖదీర్ కూ తీవ్రంగా గాయాలయ్యాయి.
ఇలా తీవ్రంగా గాయపడిన సోహైల్, ఖదీర్ లను హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అతన్ని బ్రతికించేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదని అంటున్నారు వైద్యులు. దీంతో.. అతడి కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది!
కాగా... సిద్దిపేట పట్టణానికి చెందిన మహ్మద్ సోహైల్ ప్రముఖ బాడీ బిల్డర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇందులో భాగంగా.. తన కేరీర్ లో జిల్లా, రాష్ట్ర, సౌతిండియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్ లను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో చిన్న వయసులోనే "మిస్టర్ తెలంగాణ" టైటిల్ ను గెలుచుకున్నాడు.
ఇలా చిన్న వయసులోనే తమ ప్రాంతానికి మంచి పేరుతెచ్చిన సోహైల్ మృతిచెందడంతో సిద్ధిపేట వాసులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. బాడీ బిల్డింగ్ లో గొప్ప భవిష్యత్తు ఉన్న గొప్ప స్నేహితుడిని కోల్పోయామని అతని స్నేహితులు వాపోతున్నారు. మరోపక్క... అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు!