పైకి చెప్పడు కానీ.. ఎమ్మెల్యే `రాజు`గారు చాలా ముదురే.. !
ఎక్కడ ఏ సమస్య తనకు తారసపడినా.. వదిలి పెట్టుకుండా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాదు.. ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఫాలో చేస్తున్నారు.
By: Tupaki Desk | 22 Feb 2025 2:30 PM GMTనాయకులు అందరూ ఒకేలా ఉండరు కదా! ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు కదా! కొందరు చేసింది గోరంతైతే.. కొండంత ప్రచారం కోరుకుంటారు. మరికొందరు.. చేసింది కొండంతైనా.. గొరంత కూడా ప్రచారం చేసుకోరు. ఇలాంటి రెండో తరహా నాయకులు చాలా వరకు తక్కువ మందే ఉన్నారు. ఇలాంటి వారిలో ఉమ్మడి అనంతపురం జిల్లా ఎస్సీ నియోజకవర్గం మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఒకరు. తక్కువ మెజారిటీతోనే ఆయన విజయం దక్కించుకున్నా.. ఇప్పుడు ప్రజల నుంచి ఎక్కువ మన్నన పొందుతున్నారు.
ఎక్కడ ఏ సమస్య తనకు తారసపడినా.. వదిలి పెట్టుకుండా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాదు.. ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఫాలో చేస్తున్నారు. ఇతర నాయకుల మాదిరిగా రోజుకోసారి మీడియా ముందుకు వచ్చి.. నేను అది చేశాను.. ఇది చేశాను.. అని చెప్పుకోవడం లేదు. చేయాల్సింది చేస్తూ.. ప్రజల మనిషిగా మన్ననలు పొందుతున్నారు. అంతేకాదు.. తన సొంత నియోజకవర్గం శింగన మల సమస్యలను కూడా ఆయనే పట్టించుకోవడం గమనార్హం.
నిజానికి శింగనమల ఎమ్మెల్యే ఉన్నప్పటికీ.. అక్కడి సమస్యలపై కూడా రాజుగారు.. దృష్టి పెట్టి వివాద రహితంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. అన్నింటినీ తన భుజాన వేసుకోవడం లేదు. కీలకమైన శింగనమల సమస్యలనే పట్టించుకుంటున్నారు. ఇదిలావుంటే.. తాజాగా రాజుగారు గొప్పపనే చేశారు. కానీ, ప్రచారం మాత్రం కోరుకోలేదు. ఇదేపని ఎవరైనా చేసి ఉంటే.. వెంటనే ప్రచారం కోరుకునేవారు. మీడియా ముందుకు వచ్చి.. ఇంత చేశానని.. చెప్పుకొనే వారు. అధినేత కు చేరే వరకు మీడియా ముందు ప్రసంగాలు దంచేవారు. కానీ, రాజుగారు..పనిలో ముదురు.. ప్రచారంలో వదరు అన్నట్టే ఉన్నారు.
ఇంతకీ ఏం చేశారంటే..
సరిగ్గా నాలుగు నెలల క్రితం.. ఓ నిరుపేద కుటుంబానికి ఇచ్చిన హామీని రాజుగారు నిలబెట్టుకున్నారు. మడకశిర మండలం హెచ్ఆర్ హళ్ళిలో నరసింహప్ప అనే నిరుపేద కుటుంబం నిలువ నీడ లేక… ఏడు సంవత్సరాలుగా బాత్రూంలో కాపురం ఉంటున్నారు. ఈ సంగతి తెలుసుకున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చలించిపోయారు. అప్పట్లో బాత్రూంలో ఉంటున్న నరసింహప్ప కుటుంబ దీన స్థితిని స్వయంగా చూశారు. నరసింహప్ప ఇంటికి వచ్చిన ఎమ్మెల్యే ఆ ఇంటిని చూసి షాక్ అయ్యారు.
నరసింహప్పకు కొత్తగా ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. తక్షణ సాయంగా ఆ కుటుంబానికి 20వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. కేవలం 24 గంటల్లోనే నరసింహప్ప కుటుంబానికి గ్రామంలో రెండు సెంట్లు స్థలం మంజూరు చేయించారు. అంతటితో ఆగకుండా తన సొంత నిధులతో ఇల్లు నిర్మించి ఇస్తానని చెప్పి అంత పనీ చేశారు. తాజాగా ఈ ఇంటిని రాజు ప్రారంభించి.. గృహ ప్రవేశం చేసి.. తాళాలు అందించారు. కానీ.. ఎక్కడా మీడియాను పిలవలేదు. ఫొటోలకు పోజులు కూడా ఇవ్వలేదు. అంతా సైలెంట్‌గా చేసుకుపోయారు. దీంతో పైకి చెప్పడు కానీ.. మా ఎమ్మెల్యే చాలా ముదురే! అనే టాక్ వినిపిస్తుండడం విశేషం.