వైసీపీకి మరో షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఎస్సీ ఎమ్మెల్యే
తాజాగా కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరిపోయారు.ఆ పార్టీ పీసీసీచీఫ్ వైఎస్ షర్మిల నేతృత్వంలో శనివారం బాబు.. కండువా కప్పుకొన్నారు.
By: Tupaki Desk | 6 April 2024 7:41 AM GMTఏపీ అధికార పార్టీ వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం.ఎస్ బాబు.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. తాజాగా కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరిపోయారు.ఆ పార్టీ పీసీసీచీఫ్ వైఎస్ షర్మిల నేతృత్వంలో శనివారం బాబు.. కండువా కప్పుకొన్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఎస్సీ వర్గంలో పేరుతెచ్చుకున్న బాబుకు.. వైసీపీ టికెట్ నిరాకరించింది. గత 2019లోఆయన వైసీపీ తరఫున పోటీ చేశారు.
ఆ ఎన్నికల్లో 29 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో బాబు విజయం దక్కించుకున్నారు. అయితే.. ఈ దఫా మాత్రం ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయని.. పార్టీలోనూ సఖ్యతలేదని.. పైగా టీడీపీ నేతలతో కలిసి తిరుగుతున్నారని పేర్కొన్న వైసీపీ అధిష్టానం బాబుకు టికెట్ నిరాకరించింది. దీంతో అప్పట్లోనే బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ''ఎస్సీలంటే ఆత్మాభిమానం ఉండదా? మీ మోచేతి నీళ్లు తాగి బతకాలా?'' అంటూ.. వైసీపీపై విరుచుకుపడ్డారు. తర్వాత ఏమైందో ఏమో.. రెండు రోజులుకే నోరు సవరించుకున్నారు.
తను చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని..జగన్‌వల్లే తాను ఎమ్మెల్యే అయ్యాయని అన్నారు. ఇక, అప్పటి నుంచి వైసీపీకి, బాబుకు గ్యాప్ పెరిగిపోయింది. ఇక, వైసీపీ పూతలపట్టు అభ్యర్థిగా 2014లో ఇదే పార్టీ నుంచి విజయం దక్కించుకున్న ఎం. సునీల్‌కుమార్‌కు ఇచ్చారు. ఈ పరిణామాలతో హర్టయి న.. బాబు.. పార్టీకి పూర్తి దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన పేరు ప్రకటించడమే తరువాయి.
ఇక, కీలకమైన ఎన్నికల నేపథ్యంలో వైసీపీలో చేరేవారి కన్నా.. జారుకుంటున్న వారే ఎక్కువగా ఉండడం ఒకింత ఆపార్టీకి ఇబ్బందిగానే మారిందని అంటున్నారు పరిశీలకులు. గడిచిన మూడు రోజుల్లో ముగ్గురు కీలక నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పారు. ముగ్గురూ కూడా.. సీఎం జగన్ పదే పదే తాను తనతోనే కలుపుకున్న వర్గాలని చెబుతున్న సామాజిక వర్గాలకు చెందిన వారు కావడం గమనార్హం. వీరిలో కిల్లి కృపారాణి(బీసీ-కళింగ), మహమ్మద్ ఇక్బాల్(మైనారిటీ ముస్లిం), ఎం.ఎస్ బాబు(ఎస్సీ-మాదిగ) ఉన్నారు. దీంతోవైసీపీపై అంతో ఇంతో వీరిప్రభావం ఉంటుందనే చర్చ అయితే సాగుతోంది.