నన్ను మోసం చేశారు.. కోర్టు మెట్లెక్కిన క్రికెట్ దిగ్గజం ధోనీ
క్రికెట్ అకాడమీ విషయంలో ధోనీ భాగస్వామిగా ఉన్న ఓ కంపెనీ ఆయనను రూ.15 కోట్ల మేర మోసగించింది. దీంతో ఆ బిజినెస్ పార్టనర్ షిప్ నుంచి ధోనీ పక్కకు తప్పుకొన్నారు.
By: Tupaki Desk | 6 Jan 2024 3:15 AM GMTభారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ థోనీ కోర్టు మెట్లెక్కారు. వ్యాపార భాగస్వాములు తనను మోసం చేశారంటూ ఆయన పిటిషన్ వేశారు. ఈ మోసం విలువ 15 కోట్ల రూపాయలు ఉందని పేర్కొన్నారు. దీంతో భారత క్రికెట్ రంగంలో ఒక్కసారిగా పెను సంచలనం నమోదైంది. ఇప్పటి వరకు ఎవరూ ఇంత పెద్ద మొత్తంలో తాము మోసపోయామని పేర్కొంటూ కోర్టును ఆశ్రయించిన వారు లేరు. ఈ నేపథ్యంలో ధోనీ కేసు ఆసక్తిగా మారింది.
వివాదం ఇదే..
క్రికెట్ అకాడమీ విషయంలో ధోనీ భాగస్వామిగా ఉన్న ఓ కంపెనీ ఆయనను రూ.15 కోట్ల మేర మోసగించింది. దీంతో ఆ బిజినెస్ పార్టనర్ షిప్ నుంచి ధోనీ పక్కకు తప్పుకొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేసేందుకు.. 'ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్' సంస్థ 2017లో ధోనీతో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఆర్కా స్పోర్ట్స్.. ఫ్రాంఛైజీ ఫీజులు, లాభాల్లో వాటాను క్రికెటర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ ఒప్పందంలోని షరతులను కంపెనీ ఉల్లంఘించిందనేది ధోనీ వాదన.
వాస్తవానికి ఈ విషయాన్ని సంప్రదింపులు.. చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ధోనీ ప్రయత్నించారు. అయితే, ఆర్కా స్పోర్ట్స్‌కు చెందిన మిహిర్ దివాకర్, సౌమ్య విశ్వాస్‌తో చర్చించినా ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే సదరు ఒప్పందం నుంచి ధోనీ తప్పుకొన్నారు. 2021 ఆగస్టు 15న ఆర్కా స్పోర్ట్స్‌కు ఇచ్చిన అథారిటీ లెటర్‌ను ఆయన రద్దు చేసుకున్నారు. అనంతరం పలుమార్లు లీగల్ నోటీసులు పంపించారు. అయినప్పటికీ అటు వైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ధోనీ తాజాగా కోర్టును ఆశ్రయించారు.
మిహిర్ దివాకర్, సౌమ్య విశ్వాస్‌పై రాంచీ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేసినట్లు ధోనీ తరఫు న్యాయవాది వెల్లడించారు. ఒప్పందాన్ని ఉల్లంఘించి ఆర్కా స్పోర్ట్స్ చేసిన మోసం కారణంగా ధోనీకి రూ.15 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో వారిద్దరిపై క్రిమినల్ కేసు నమోదైంది. ధోనీ క్రికెట్ అకాడమీ పేరుతో ఆర్కా స్పోర్ట్స్ దేశంలో పలు చోట్ల అకాడమీలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.