ముద్రగడ ఎక్కడ... జగన్ తోనే ఉన్నట్లేనా ?
జగన్ పోయి పోయి మాజీ మంత్రి కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇంటిదాక వెళ్ళి వచ్చారు.
By: Tupaki Desk | 15 Sep 2024 3:48 AM GMTజగన్ పోయి పోయి మాజీ మంత్రి కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇంటిదాక వెళ్ళి వచ్చారు. ఆయన నేరుగా హెలికాప్టర్ లో పిఠాపురంలో దిగారు. వరద ప్రాంతాలను పరిశీలించారు. అక్కడ బాధితులతో మాట్లాడారు. అదే విధంగా వరద నీరులో దిగి పొలాలను చూశారు.
ట్రాక్టర్ ఎక్కి కూడా వరద ప్రభావిత ప్రాంతాలలో కలియతిరిగారు. జగన్ వచ్చారు అంటే జక్కం పూడి రాజా, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ ఎంపీ పిఠాపురం నుంచి 2024లో పోటీ చేసిన అభ్యర్థి వంగా గీత కూడా జగన్ వెంట ఉన్నారు. ఇక కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ అయితే సరే సరి.
మరి ఇంత మంది నేతలు వచ్చినా ఆయన మాత్రం జాడ కనిపించలేదు. ఆయన ఎవరో కాదు, గోదావరి జిల్లాలో బిగ్ ఫిగర్ పొలిటికల్ గా సీనియర్ అయిన ముద్రగడ పద్మనాభం. ఆయన జగన్ తో ఎందుకు కనిపించలేదు అన్న చర్చ సాగుతోంది. వైసీపీ ఓడాక ముద్రగడ ఒకటి రెండు సార్లు తాడేపల్లి లో కనిపించారు. జగన్ తో కూడా మాట్లాడారు. ఆ తరువాత నుంచి ఆయన ఎందుకో సైలెంట్ అయ్యారు. గత రెండు మూడు నెలలుగా ఆయన ఊసులు ఏవీ లేవు.
ముద్రగడ అంటేనే ఫైర్ బ్రాండ్. అలాంటి నేత ఎందుకు మౌనంగా ఉంటున్నారు. వైసీపీ అధినేత జగన్ తమ ఇలాకాకు వచ్చినా కూడా ముద్రగడ ఎందుకు ఇంటి గడప దాటి కూడా ఆయనను కలవాలనుకోలేదు అన్నదే ప్రశ్నగా ఉంది.
ముద్రగడ రాజకీయాల నుంచి విరమించుకున్నారా అన్నది కూడా మరో ప్రశ్నగా ముందుకు వస్తోంది. అలాగే ఆయన రాజకీయంగా విసిగి పోయారా అని కూడా డిస్కషన్ చేస్తున్నారు. అదీ కాదు అనుకుంటే ఆయన వైసీపీకి దూరంగా జరగాలని నిర్ణయించుకున్నారా అన్నది మరో ప్రశ్నగా ఉంది.
వైసీపీకి సుదీర్ఘంగా అయిదేళ్ళ పాటు కష్టాలు వెంటాడే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపక్షంలో వైసీపీ ఉంది. ఆ పార్టీ 2029 దాకా కనీసం ఒక్క ఎమ్మెల్సీ కానీ రాజ్యసభను కానీ గెలుచుకోలేదు. ఇక వైసీపీలో ఉన్న గోదావరి జిల్లా నేతలు పార్టీ మారుతున్నారు.
ఇంకో వైపు చూస్తే కూటమి బలంగా ఉంది. పవన్ కూడా పిఠాపురంలో పట్టు పెంచుకుంటున్నారు. గోదావరి జిల్లాల మొత్తంలో జనసేన ప్రభావం గట్టిగానే ఉంది. ఈ పరిణామాల నేపధ్యం నుంచి చూసినపుడు ముద్రగడ సైలెంట్ గా ఉండడమే బెటర్ అని తలచారా అన్నదే ఎవరికైనా కలిగే సందేహం.
మొత్తం మీద చూస్తే నాలుగు నెలల క్రితం ఎన్నికల ప్రచారానికి పిఠాపురం జగన్ వస్తే ఆయనతో పాటే కనిపించిన ముద్రగడ ఇపుడు మాత్రం సీన్ లో లేకపోవడంతో రకరకాలైన సందేహాలు వస్తున్నాయి. అయితే వైసీపీ అధినాయకత్వం ఈ విషయాల గురించి ఆలోచిస్తోందా అన్నదే మరో చర్చ.