జగన్ కి మళ్లీ సీఎం ...పెద్దాయన జోస్యం ?
ఆయన మరో టెర్మ్ కొనసాగాలని టీడీపీ కూటమిలో రెండవ అతి పెద్ద పార్టీగా ఉన్న జనసేన గట్టిగా కోరుకుంటోంది.
By: Tupaki Desk | 11 Jan 2025 3:51 AM GMTఏపీ సీఎం గా చంద్రబాబు నాలుగవ సారి కొనసాగుతున్నారు. ఆయన మరో టెర్మ్ కొనసాగాలని టీడీపీ కూటమిలో రెండవ అతి పెద్ద పార్టీగా ఉన్న జనసేన గట్టిగా కోరుకుంటోంది. మరో వైపు చూస్తే 2029లో టీడీపీ కూటమి కచ్చితంగా నెగ్గుతుందని వైసీపీకి ఇక ఎప్పటికీ అధికారం దక్కే సీన్ లేదని కూటమి పెద్దలు ధీమాగా ఉన్నారు.
అయితే రాజకీయాల్లో తలపడిన సీనియర్ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ విషయంలో ఏ రకమైన అంచనాతో ఉన్నారు అనడానికి ఆయన లేటెస్ట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. రెడ్ బుక్ అంటూ ఆయన ప్రస్తావిస్తూ ఇలా రాజకీయ ప్రత్యర్ధులను రెడ్ బుక్ పేరిట వేధిస్తే రేపటి రోజున జగన్ మళ్లీ అధికరంలోకి వస్తే అపుడు మీకు కూడా ఇలాంటివే పరిస్థితులు ఉంటాయని భవిష్యత్తుని దర్శనం చేయించారు.
ఏపీలో వైసీపీ క్యాడర్ ని వేధిస్తున్నారు అంటూ ఆయన రాసిన ఈ లేఖ ఇపుడు సంచలనంగా మారింది. అంతే కాదు ఆయన చంద్రబాబుతో తన సాన్నిహిత్యాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. రాజకీయ ప్రత్యర్ధులను వేధించే గుణం బాబులో గతంలో తాను చూడలేదని కూడా ముద్రగడ చెప్పారు. బాబు తాను వైఎస్సార్ ముగ్గురం ఒకేసారి 1978లో అసెంబ్లీలో అడుగుపెట్టామని సమకాలీనులమని అన్నారు.
అయితే ఈ లేఖలో ముద్రగడ ప్రస్తావించింది ఏంటి అంటే ఏపీలో ఎవరూ ఎపుడూ శాశ్వతంగా అధికారంలో ఉండరని ఏపీ ఎవరి జాగీరు కాదని. దాని అర్ధం ఏంటి అంటే ఈ రోజున టీడీపీ కూటమి అధికారంలో ఉన్నా రేపటి రోజున వైసీపీ కూడా రావచ్చు అని. అపుడు వారు కూడా ప్రత్యర్ధులను ఇదే విధంగా రెడ్ బుక్ అంటూ వేధిస్తే అపుడు సంగతి ఏంటి అని ఈ రోజు అధికారంలో ఉన్న టీడీపీ కూటమి పెద్దలు ఆలోచించుకోవాలని ముద్రగడ సూచించారు.
రాజకీయంగా వేధింపులు అన్నవి మంచి రాజకీయం కాదని గతంలో ఎపుడూ ఇలాంటివి లేవని ఆయన చెప్పారు. తమ రోజులలో అంతా స్నేహభావంతో ఉండేవారు అని కూడా అన్నారు. ఇవన్నీ చెబుతూనే జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారు అన్నట్లుగా మాట్లాడారు.
ఈ లేఖకు టీడీపీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది పక్కన పెడితే వైసీపీ వారికి మాత్రం చాలా ఆనందంగానే ఉంది అని అంటున్నారు. ఎందుకు అంటే జగన్ మళ్లీ సీఎం అవుతారు అన్నట్లుగా ముద్రగడ ఈ లేఖలో జోస్యం చెప్పారని అంటున్నారు.
రాజకీయాల్లో ఓడలు బళ్ళు అవుతాయని బళ్ళు మళ్లీ ఓడలు అవుతాయని చెబుతారు. మరి రాజకీయంగా ఎన్నో చూసిన ముద్రగడ ఏపీ పరిస్థితులను అవగాహన చేసుకుని ఈ జోస్యం చెప్పారా అన్నది చర్చకు వస్తోంది. ఏది ఏమైనా జగన్ మళ్లీ సీఎం అంటూ పెద్దాయన చెప్పిన ఈ మాటలు ఏపీ పాలిటిక్స్ లో చర్చకు తావిస్తున్నాయి.