ముద్రగడ వల్ల వైసీపీకి మేలు జరిగిందా.. కీడు కలిగిందా..?
ఈ సమయంలో ముద్రగడ పద్మనాభానికి సంబంధించిన ఓ చర్చ తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 15 May 2024 10:31 AM ISTఏపీలో మునుపెన్నడూ లేనివిధంగా అన్నట్లుగా సాగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక ఫలితాలు తెలియాలంటే జూన్ 4 వరకూ వేచి చూడాలి. మరోపక్క గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో దాదాపు అందరికళ్లూ పిఠాపురంలో గెలుపు ఎవరిది అనే అంశంపై ఆసక్తిగా నెలకొన్నాయని అంటున్నారు. ఈ సమయంలో ముద్రగడ పద్మనాభానికి సంబంధించిన ఓ చర్చ తెరపైకి వచ్చింది.
అవును... ఏపీలో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమిగా కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఎస్సీ, ఎస్టీ, క్రీస్టియన్, ముస్లిం లు పూర్తిగా జగన్ వైపు ఉన్నారని.. బీసీలు, రెడ్లు సగం సగం మాత్రమే ఫ్యాన్ కు ఫేవర్ గా పనిచేశారని ఒక చర్చ నడిచింది. దీంతో కమ్మ కులస్థులు పూర్తిగా, బీసీలు సుమారుగా సగం మంది మాత్రమే కూటమికి అనుకూలంగా రియాక్ట్ అయ్యారనే మాటలూ వినిపించాయి. ఈ సమయంలో కాపుల ఓట్లు అత్యంత కీలకంగా మారాయి.
కాపుల్లో మెజారిటీ ఓటర్లు జనసేన వైపే ఉన్నారనే కామెంట్లు బలంగా వినిపించాయి. ఈ సమయంలో జనసేన కూటమిలో భాగం కావడంతో ఇక కాపుల ఓట్లపై అధికారపార్టీ ఆశలు వదిలేసుకోవడమే అనే చర్చా తెరపైకి వచ్చింది. ఈ సమయంలో... కాపు ఉద్యమ నేత ముద్రగడను జగన్ రంగంలోకి దించారు. దీంతో... ఆ సామాజికవర్గానికి చెందిన పలు మీటింగులకు ముద్రగడ ముఖ్య అతిధిగా హాజరై.. జగన్ కు అనుకూలంగా ప్రసంగించారు!
వాస్తవానికి మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే... ముద్రగడకు అసలైన టాస్క్ పిఠాపురంలో పవన్ ఓటమికి కారణం అవ్వడం! అయితే... ఈ విషయంలో ముద్రగడ చేసిన కొన్ని “అతి” వ్యాఖ్యలు పవన్ కు అనుకూలంగా మారాయనే చర్చ ఎన్నికల వేళ బలంగా వినిపించింది. ఇందులో భాగంగా వృద్ధులు, మహిళలు కాస్త ముద్రగడ అభిప్రాయంతో ఏకీభవించినట్లు కనిపించినా... ప్రధానంగా యువత మాత్రం ముద్రగడ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంది. ఫలితంగా పవన్ వైపు మరింత గట్టిగా నిలబడిందని అంటున్నారు.
ఈ క్రమంలోనే మొదట్లో ముద్రగడ వైపు ఆ సామాజికవర్గం కాస్త బలంగా నిలబడినా.. పోలింగ్ నాటికి పరిస్థితి భిన్నంగా మారిపోయిందని చెబుతున్నారు. అందువల్లే పోలింగ్ అనంతరం ముద్రగడ & కో సైలంట్ అయిపోయారనే కామెంట్లూ వినిపిస్తుండటం గమనార్హం. మరి జగన్ ఆశించినట్లుగా నిజంగా ముద్రగడ వైసీపీకి బలంగా మారారా.. లేక, ఆయన ఎంట్రీ వల్ల అసలుకే ఎసరొచ్చిందా అనేది తెలియాలంటే జూన్ 4వరకూ వేచి చూడాల్సిందే!