ముద్రగడ ‘పేరు’ మార్చుకుంటాడా ?
ఎన్నికల ప్రచారం చివరిరోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వంగా గీతను గెలిపిస్తే ఉప ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు.
By: Tupaki Desk | 4 Jun 2024 4:50 PM ISTఈ ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించి ఇంటికి పంపుతాం. ఒకవేళ ఓడించి పంపకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభం కాదు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని’ కొన్నాళ్ల క్రితం కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు. ‘‘మేం మీ బానిసలమా మీకు ఓటేయడానికి ? పవన్ సమస్యలు, పద్ధతులు తెలుసుకుని మాట్లాడాలి. నోరుంది, ముఖానికి రంగుందని ఏది పడితే అది మాట్లాడితే చెల్లదు. పిఠాపురం నుంచి త్వరలో పవన్ ను తన్ని తరిమేస్తారు’’ అని అన్నాడు.
ముద్రగడ సవాల్ నేపథ్యంలో ఈ రోజు వెల్లడైన ఫలితాలలో పిఠాపురంలో మరో రౌండ్ లెక్కింపు మిగిలి ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాన్ 67843 ఓట్ల ఆధిక్యంలో ఘన విజయం దిశగా ముందుకు సాగుతున్నాడు. పవన్ కు పోటీగా ఇక్కడ పవన్ సామాజికవర్గానికే చెందిన కాకినాడ ఎంపీ వంగా గీతను పోటీకి దింపారు. ఇక్కడ ఉన్న 75 వేల కాపు ఓట్లను చీల్చడం లక్ష్యం పెట్టుకున్నారు.
ఎన్నికల ప్రచారం చివరిరోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వంగా గీతను గెలిపిస్తే ఉప ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు. అయితే ఇక్కడ పవన్ గ్లామర్ ముందు జగన్ అఫర్ పనిచేయలేదు. పవన్ గెలుపు కోసం జబర్దస్త్ నటులతో పాటు, మెగా కుటుంబం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. పవన్ గెలుపు నేపథ్యంలో ముద్రగడ స్పందన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.