పవన్ పైన ముద్రగడ రగడ ఖాయం...!?
ఆ మంట ఏ స్థాయిలో ఉందంటే ఇటీవల ఒక బహిరంగ లేఖ రాసి మరీ పవన్ మీద ఘాటు విమర్శలు చేశారు.
By: Tupaki Desk | 2 March 2024 8:57 AM GMTముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ మీద మండిపోతున్నారు. ఆ మంట ఏ స్థాయిలో ఉందంటే ఇటీవల ఒక బహిరంగ లేఖ రాసి మరీ పవన్ మీద ఘాటు విమర్శలు చేశారు. దాంతో ఇక పవన్ మీద ముద్రగడ దాదాపుగా
యుద్ధం ప్రకటించేశారు అని అంటున్నారు. ముద్రగడ రాజకీయ సమరం కొనసాగించాలంటే సరైన రాజకీయ వేదిక అవసరం.
దాంతో ఇపుడు వైసీపీ ముద్రగడ ఫ్యామిలీ టచ్ లోకి వెళ్ళింది. ముద్రగడ రెండవ కుమారుడు గిరితో వైసీపీ నేతలు చర్చలు ప్రారంభించారు అని అంటున్నారు. ముద్రగడ కుమారుడి ద్వారా పెద్దాయనను తమ వైపు తిప్పుకునే ప్లాన్ లో ఉన్నారు. ఇక తనతో వైసీపీ నేతలు చర్చించిన అంశాలు అన్నీ కూడా గిరి తండ్రికి చెప్పారని అంటున్నారు.
దాని మీద ముద్రగడ అతనికి తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరినట్లుగా చెబుతున్నారు. తనతో నేరుగానే వైసీపీ నేతలు చర్చిస్తారు అని అన్నట్లుగా కూడా చెబుతున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే ముద్రగడ వైసీపీ నేతల నుంచి ప్రతిపాదనలు కనుక వస్తే అంగీకరిస్తారు అని అంటున్నారు.
దాంతో రెండు మూడు రోజులలో వైసీపీ నేతలు ముద్రగడల మధ్య చర్చలు జరుగుతాయని అంటున్నారు. ఆ మీదట ఆయన వైసీపీ లోకి వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. అయితే ముద్రగడను పిఠాపురం నుంచి పోటీ చేయించాలని వైసీపీ భావిస్తోంది.
అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు. ఇది అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. అయితే పవన్ ని పిఠాపురంలో ఓడించాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఆయనని ఓడించాలంటే కాపు నేత ముద్రగడ సరైన వారు అని కూడా అంచనాకు వస్తోంది. అందుకే ముద్రగడ కుమారుని ద్వారా రాయబారం నడిపారు అని అంటున్నారు.
ఇక ముద్రగడ కనుక వైసీపీలో చేరాలనుకుంటే కొన్ని కండిషన్లు పెడతారు అని అంటున్నారు. తనకు తన కుమారిడికి టికెట్లతో పాటు తమ అనుచరులకు కూడా టికెట్లు ఇవ్వాలని కోరుతారు అని అంటున్నారు. మరి దీని మీద వైసీపీ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాల్సి ఉంది. గతంలో కూడా ముద్రగడతో వైసీపీ నేతల మధ్య చర్చలు జరిగాయి.
అయితే అవి సీట్ల పంచాయతీ వద్దనే ఆగిపోయాయి. ఇపుడు పవన్ పిఠాపురం నుంచి పోటీ అనడంతో వైసీపీకి ముద్రగడ అవసరం వచ్చింది అని అంటున్నారు. దాంతో వైసీపీ ప్రతిపాదనలు పెడుతోంది. మరి వీటికి అంగీకరించి ముద్రగడ భేషరతుగా వైసీపీలో చేరుతారా లేక కొన్ని సీట్లు డిమాండ్ చేసి మరీ తన పంతం నెగ్గించుకుంటారా అన్నది చూడాలి.
ఇక్కడ చూస్తే ముద్రగడ పవన్ మీద గుస్సాగా ఉన్నారు. వైసీపీకి పవన్ ప్రత్యర్ధిగా ఉన్నారు. దాంతో ఇద్దరి మధ్య కామన్ అజెండా ఉంది కాబట్టి ముద్రగడను తొందరలోనే పార్టీలోకి చేర్చుకుని టికెట్ ప్రకటిస్తారు అని అంటున్నారు. అదే టైం లో పవన్ కళ్యాణ్ మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవకుండా చేయాలన్నది వైసీపీ ఆలోచనగా చెబుతున్నారు.
ఈసారి కనుక పవన్ ని ఓడిస్తే ఇక ఆయన రాజకీయ జీవితం శాశ్వతంగా ఇబ్బందుల్లో పడుతుందని ఆయన పార్టీ కూడా ఉండే చాన్స్ లేదు అన్నది తలపండిన వైసీపీ నేతల ఆలోచన. అయితే పిఠాపురంలో పవన్ కి ఫ్యాన్ మెయిల్ పటిష్టంగా ఉంది. మరి రాజకీయంగా వారి మద్దతు ఎంతవరకూ ఉంటుందో చూడాల్సి ఉంది. అదే టైం లో మొత్తం ఓటర్లలో అత్యధిక శాతం అంటే తొంబై వేల పై బడి కాపులే ఉన్నారు. వారంతా ఎపుడూ తమ సామాజిక వర్గం వారికే ఓటేసి గెలిపించుకుంటున్నారు.
ఇపుడు పవన్ కనుక పోటీలో ఉంటే ఆయన్ని గెలిపించి తీరుతారు అని అంటున్నారు. అయితే ముద్రగడ రంగంలో ఉంటే మాత్రం సీన్ మారుతుంది అని అంటున్నారు. పెద్దలు మధ్య వయస్కులు ముద్రగడ వైపు మొగ్గు చూపే చాన్స్ ఉంది. అలా కాపు ఓట్లలో బలమైన చీలిక తీసుకుని రావడం ద్వారా పవన్ ని ఓడించవచ్చు అన్నది వైసీపీ ఆలోచంగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో. పవన్ తో ముద్రగడ ఢీ కొడితే మాత్రం పిఠాపురం లో రాజకీయ రగడ తప్పదు అని అంటున్నారు.