మంత్రి గుడివాడ ఇంటికి ముద్రగడ... మ్యాటర్ అదేనా...?
గుడివాడ అమరనాధ్ తో ముద్రగడ భేటీ వేసి చర్చించారు. మరి ఆ చర్చల సారాంశం ఏంటి అన్నది బయటకు రాలేదు.
By: Tupaki Desk | 27 July 2023 3:32 PM GMTఏపీ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడడంతో వారూ వీరూ కూడా సర్దుకుంటున్న నేపధ్యం ఉంది. ఇక అధికార వైసీపీ కి విపక్ష టీడీపీ జనసేనల కు ఎవరి వ్యూహాలు వారివి ఉన్నాయి. కాపు ఓట్లు ఈసారి అత్యంత కీలకం అని భావిస్తున్న టీడీపీ జనసేన తో మొదటి నుంచి పొత్తు కుదుర్చుకునే ప్రయత్నంలో ఉంది.
అదే టైం లో వైసీపీ కూడా ఈ విషయం లో ఏమి తక్కువ తినడంలేదు ఆ పార్టీ కూడా ముద్రగడ పద్మనాభం వంటి కాపు బ్రాండ్ పుష్కలంగా ఉన్న నేతల ను తమ పార్టీలోకి తీసుకుని రావాల ని అనుకుంటోంది. ఈ మేరకు కిర్లంపూడి లోని ముద్రగడ ఇంటికి ఇటీవల కాలం లో వైసీపీ నేతల రాకపోకలు ఎక్కువ అయ్యాయి.
ఎంపీ మిధున్ రెడ్డి స్వయంగా ముద్రగడ ను కలసి వచ్చారు. అలాగే కాకినాడ లోక్ సభ ఎంపీ వంగా గీత, స్థానిక ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు వంటి వారు అంతా ముద్రగడ ను కలసి తమ పార్టీలో చేరమని కోరారు. ఇవన్నీ ఇలా ఉండగానే పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో గోదావరి జిల్లాల లో హల్ చేసినపుడు ఇండైర్కెట్ గా ముద్రగడ మీద కామెంట్స్ చేశారని ప్రచారం జర్గింది.
దానికి గట్టి రిటార్టు ఇస్తూ ముద్రగడ పిఠాపురం నుంచి నాతో పోటీ చెయ్ అని సవాల్ విసిరారు. ఇక రెండు సార్లు బహిరంగ లేఖలు కూడా రాసారు. ఇవన్నీ ఇలా ఉంటే ముద్రగడ సందడి కొన్ని రోజులుగా లేదు. ఈ నేపధ్యంలో హఠాత్తుగా ఆయన విశాఖ వచ్చారు గాజువాక లోని మిందికి వెళ్లి వైసీపీ మంత్రి గుడివాడ అమరనాధ్ ని కలిశారు.
గుడివాడ అమరనాధ్ తో ముద్రగడ భేటీ వేసి చర్చించారు. మరి ఆ చర్చల సారాంశం ఏంటి అన్నది బయటకు రాలేదు. అయితే ముద్రగడ వైసీపీ లో చేరుతారు అన్న చర్చ అయితే చాలా కాలంగా ఉంది. ఆయన ఎక్కువగా వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేల తోనే సన్నిహితంగా ఉంటారు అని కూడా అంటారు.
ఇక ముద్రగడ కు కాకినాడ లోక్ సభ, ఆయన కుమారుడికి పిఠాపురం ఎమ్మెల్యే సీటు ఇస్తారని కూడా ఆ మధ్య ప్రచారం సాగింది. ఈ నేపధ్యంలో అందరి నాయకుల ను తన ఇంటికి రప్పించుకున్న ముద్రగడ గుడివాడ ఇంటికి తానే స్వయంగా రావడం అంటే మాటర్ ఏంటి అన్నదే ఎవరికీ అర్ధం కావడం లేదు అంటున్నరు.
అయితే అప్పట్లో కాపు ఉద్యమానికి మద్దతుగా గుడివాడ అమరనాధ్ తండ్రి, మాజీ మంత్రి దివంగత గుడివాడ గురునాధరావు నిలిచారు. ఆయనకూ ముద్రగడ కు మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో స్నేహితుని కుమారుడు మంత్రి అయిన గుడివాడ ను కలసి వ్యక్తిగతంగా ముచ్చటించి ఉంటారు అని అంటున్నారు.
అయితే జగన్ కి అత్యంత సన్నిహితుడు అయిన అమరనాధ్ తో ముద్రగడ భేటీ అంటే ఆషామాషీగా తీసుకోవాల్సింది కాదని రాజకీయంగా అంటున్న మాట. ముద్రగడను వైసీపీ లోకి రప్పించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. అందులో భాగంగానే ఈ భేటీ జరిగి ఉంటుందని కూడా అంటున్నారు. ముద్రగడ వైసీపీ లో చేరితే ఏపీ రాజకీయాల్లో అది పెను సంచలనం అవుతుంది. అంతే కాదు వైసీపీకి గోదావరి జిల్లాల లో మంచి బూస్టింగ్ కూడా వస్తుంది అని అంటున్నారు.