Begin typing your search above and press return to search.

ముద్రగడ టైట్ చేస్తున్నారా...కూతురు సడెన్ ఎంట్రీ !

కానీ బంగారం లాంటి రాజకీయ భవిష్యత్తును ఫణంగా పెట్టి కులం శ్రేయస్సు కోసం ఉద్యమించిన నాయకులు లేరనే చెప్పాలి.

By:  Tupaki Desk   |   4 May 2024 1:30 AM GMT
ముద్రగడ టైట్ చేస్తున్నారా...కూతురు సడెన్ ఎంట్రీ !
X

ముద్రగడ పద్మనాభం. ఈ పేరు ఒక బ్రాండ్ గానే చూడాలి. ఈ దేశంలో తన సొంత సామాజిక వర్గం కోసం పోరాటం చేసి రాజకీయ నేతలుగా మారిన వారు ఉన్నారు. కానీ బంగారం లాంటి రాజకీయ భవిష్యత్తును ఫణంగా పెట్టి కులం శ్రేయస్సు కోసం ఉద్యమించిన నాయకులు లేరనే చెప్పాలి.

కులాన్ని నిచ్చెనగా చేసుకుని రాజకీయ అందలాలు అందుకున్నాక కులాన్ని పక్కన పెట్టే వారే నూటికి నూరు మందీ ఉంటారు. కానీ ముద్రగడ పద్మనాభం విషయం అలా కాదు అనే చెప్పాలి. ఆయన మంత్రిగా ఉంటూ పదవులను వదులుకున్నారు. ఎంపీ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా సరే కాపు సామాజిక వర్గం కోసం అంటూ ఉద్యమాలు నడిపారు. మూడున్నర పదుల వయసులో ఎంతటి పోరాటం చేశారో ఆరు పదుల వయసు లోనూ అంతటి పోరాటం చేశారు.

ముద్రగడ పోరాటంలో నిజాయతీ ఉంది. ఆయన ఉద్యమాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. ఫలితాలు ఎపుడూ దైవాదీనాలు. ఆయన కాపు ఉద్యమాన్ని గట్టిగా చేసినా సరైన ఫలితం అందుకోలేకపోయారు. ఒకవేళ అందుకుని ఉంటే ఆయన లెక్కే వేరేగా ఉండేది. ఇదిలా ఉంటే ముద్రగడ నిజాయతీపరుడు. అవినీతి మచ్చ లేని రాజకీయ నేతగా అంతా అంగీకరిస్తారు.

అంతే కాదు ఆయన నిబద్ధత చిత్తశుద్ధి మీద కూడా ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు. అయితే ఆయనలో మైనస్ ఏంటి అంటే ఫైర్ బ్రాండ్. ఆయన ఆవేశం వల్లనే ఆయన కొన్ని ఇబ్బందులు పడ్డారు. అదే ఆవేశం ఆయనకే హాని చేసింది కానీ ఇతరులకు కాదని చెప్పాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే ముద్రగడ వైసీపీలో చేరారు. ఆయన పంతం పట్టేశారు. అదే జనసేన అధినేత పవన్ ని ఓడిస్తాను అని. అది ఎంతటి పవర్ ఫుల్ పంతం అంటే పవన్ ని ఓడించ లేకపోతే తన పేరుని ఏకంగా పద్మనాభరెడ్డి గా మార్చుకుంటాను అనేంతగా. ఇది ఒక సవాల్. దమ్ము అయినా సవాల్ గానే చూస్తున్నారు.

దీంతో గ్రౌండ్ లో ముద్రగడ భారీ స్కెచ్ నే వేశారు అని అంటున్నారు. అంతే కాదు ఆయన వర్క్ కూడా అండర్ గ్రౌండ్ లో గట్టిగానే ఉందని అంటున్నారు. ముద్రగడ వరసబెట్టి కాపు ఆత్మీయ సమావేశాలు పెడుతున్నారు. కాపు నేతలను దగ్గర కూర్చోబెట్టుకుని వంగా గీత గెలుపు ఆవశ్యకత చెబుతున్నారు. కేవలం పదవుల కోసం హైదారాబాద్ విడచి పవన్ కళ్యాణ్ పిఠాపురం దాకా వచ్చారు అని కూడా అంటున్నారు.

ఒక్కసారి ఆయన గెలిస్తే కనుక దొరకరని అందుబాటులో అసలు ఉండరని అంటున్నారు ఇలా ఆయన పిఠాపురంలో కాపులకు పెద్ద ఎత్తున బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. వారు కూడా ఆసక్తిగా వింటున్నారు. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా అంతా ముద్రగడను ప్రేమిస్తారు. అభిమానిస్తారు. సమస్య తమకు ఏదైనా వస్తే ఆయన వద్దకే ముందుగా పరిగెత్తుకుని వెళ్తారు.

పెద్దాయన అన్న గౌరవం వారికి ఉంది. ఇపుడు ఆయన మాట వినకుండా పోతే రేపు ముఖం చూపించగలమా అన్న సందేహాలు కాపులలో చాలా మందికి ఉన్నాయి. అంతే కాదు ఆయన ఏది చేసినా కరెక్ట్ గా ఆలోచించి చేస్తారు అన్నది వారి నమ్మకం. ఇక ముద్రగడ చెబుతున్న దాంట్లో కూడా లాజిక్ ఉంది. అదెలా అంటే పవన్ చంద్రబాబు కోసం రాజకీయం చేస్తున్నారు తప్ప తనకోసం కాదు, కాపుల కోసం కాదు అని.

కాపు ఉద్యమం పీక్స్ లో ఉన్నపుడు పవన్ ఏ విధంగానూ నోరెత్తలేదని హెల్ప్ చేయలేదని ముద్రగడ అంటున్నారు. కాపులను చంద్రబాబు అణగదొక్కితే పవన్ ఎక్కడ ఉన్నారు అని ఆయన ప్రశ్నిస్తున్న తీరు కూడా ఆలోచనలు రేకెత్తించేలా ఉందని అంటున్నారు. ఇలా ముద్రగడ తనకు ఉన్న పలుకుబడితో పిఠాపురంలో రాజకీయం మార్చేందుకు వైసీపీకి అనుకూలత పెంచేందుకు కృషి చేస్తున్నారు.

దీంతో జనసేన కొంత ఇబ్బంది పడుతోంది అని అంటున్నారు. ఇల కాపు పెద్ద అందునా కాపులకు ఆరాధ్యంగా ఉండే నాయకుడు పవన్ గురించి వ్యతిరేక ప్రచారం చేస్తూంటే అది జనంలోకి వెళ్తుంది. పైగా కాపులు నమ్మేలాగానే ఉంటుంది. అందుకే జనసేన లేట్ గా అయినా లేటెస్ట్ గా అలెర్ట్ అయింది అని అంటున్నారు. ముల్లుని ముల్లుతోనే కోయాలి అన్న దానికి నిదర్శనంగా ముద్రగడ కుమార్తెని రంగంలోకి దించారు అని అంటున్నారు.

ఇలా ముద్రగడ సొంత కూతురునే తమ వైపు తిప్పుకోవడం ద్వారా జనసేన సక్సెస్ అయింది అని అంటున్నారు. ఎంతో కొంత ముద్రగడ ప్రభావం తగ్గించడం ఒక ఎత్తు అయితే ఇంట్లో వారే కన్న బిడ్డలే ముద్రగడ మాటకు విలువ ఇవ్వడం లేదని కాపు సామాజికి చూపించడం ద్వారా ముద్రగడను పలుచన చేసే వ్యూహం ఇందులో ఉంది అని అంటున్నారు. తాను ఎవరికీ భయపడను అని ముద్రగడ అంటున్నా కూతురు కామెంట్స్ ని లైట్ గా తీసుకుంటున్నా ఇది ముద్రగడకు ఇరకాటమే అని అంటున్నారు.