జనసేనలో ముద్రగడ చేరిక అనుమానమా?
అవును... ఈసారి ఎలాగైనా ఏపీ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని బలంగా భావిస్తున్న కాపులు.. జనసేన పార్టీలో చురుగ్గానే చేరుతున్నారు.
By: Tupaki Desk | 22 Jan 2024 7:18 AM GMTఏపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని, చట్ట సభల్లో ప్రాతినిథ్యం వహించాలని, అధికారంలోకి వచ్చి కనీసం రెండున్నరేళ్లయినా రాజ్యాధికారం చేపట్టాలని కాపు సామాజికవర్గం బలంగా భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే స్లోగన్ తో వారు ముందుకు వెళ్తున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో ముద్రగడం అంశం అసక్తికరంగా మారింది.
అవును... ఈసారి ఎలాగైనా ఏపీ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని బలంగా భావిస్తున్న కాపులు.. జనసేన పార్టీలో చురుగ్గానే చేరుతున్నారు. ఈ క్రమంలో ఆ సామాజిక వర్గానికి చెందిన మెజారిటీ నాయకులు జనసేనను తమ పార్టీగానే భావిస్తున్నారనే భావనను సృష్టించారు. మరోపక్క ఆ పార్టీకూడా చంద్రబాబు కంట్రోల్ ఉందని భావించిన వారు బయటకు వెళ్తున్నారు!
ఆ సంగతి అలా ఉంటే... కాపు సామాజికవర్గానికి చెందిన కీలక నేత, కాపు ఉద్యమ నేత ముద్రగడ్ద పద్మనాభం వ్యవహారం ఆసక్తిగా మారింది. ఇందులో భాగంగా. నెల రోజుల క్రితమే పవన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన కాపు ఉద్యమనేత.. పవన్ కు బహిరంగ లేఖలు రాసి కడిగిపారేసిన ముద్రగడ పద్మనాభం.. తన మనసు మార్చుకుని జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని కథనాలొచ్చాయి.
పవన్ కల్యాణ్ వారాహి యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న సమయంలో ఆయన వైసీపీలో చేరతారని ఊహాగానాలు రావడం, ఆయన పలువురు వైసీపీ నేతలతో భేటీ కావడం తెలిసిందే. అయితే తాజాగా.. ముద్రగడ తన కుటుంబ సభ్యులతో కలిసి జనసేనలో చేరుతున్నట్లు ఆ పార్టీ కీలకనేతల్లో ఒకరైన బొలిశెట్టి శ్రీనివాస్ ప్రకటించారు.
ఇందులో భాగంగా... ఈ నెల 23లోపు ముద్రగడ పద్మనాభంను పవన్ కల్యాణ్ స్వయంగా సంప్రదించి పార్టీలోకి ఆహ్వానిస్తారని ఆయన వెల్లడించారు. దీంతో ముద్రగడపై జనసేన నేతలు, కార్యకర్తలు పెట్టిన పోస్టులను జనసేన సోషల్ మీడియా నుంచి తొలగించారని తెలుస్తుంది. ఇదే సమయంలో కాపు సామాజికవర్గం కోసం ముద్రగడ ఎంతో కృషి చేశారంటూ సానుకూల కథనాలు ప్రచారం కూడా మొదలైపోయింది.
అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో... జనసేనలో ముద్రగడ చేరికపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఇందులో భాగంగా "జనసేనలోకి ముద్రగడ" అనే అంశం నిజంగా జరుగుతుందా.. లేక, చివరి నిమిషంలో ఏదైనా ట్విస్ట్ చోటు చేసుకునే అవకాశం ఉందా అనే చర్చ మొదలైంది. అసలు ఇటువంటి విషయాల్లో ఆలస్యం తగదని.. అనుకున్నవెంటనే కండువా కప్పేసి పార్టీలో జాయిన్ చేసేసుకోవాలనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే... ప్రస్తుతం అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఆ పర్యటన అనంతరం ముద్రగడ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. దీంతో పవన్ అయోధ్య నుంచి వచ్చిన అనంతరం ముద్రగడ చేరిక ఉంటుందా.. లేక, మరో ముహూర్తం పెడతారా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా... రాజకీయాల్లోని కొన్ని నిర్ణయాల్లో ఆలస్యం అమృతం విషం అని అంటున్నారు పరిశీలకులు!!