Begin typing your search above and press return to search.

ముద్రగడ...కండిషన్లు అప్లై...!

అలా అందరివాడుగా ఉన్న ముద్రగడ పద్మనాభం తరువాత కాలంలో ఒక సామాజిక వర్గానికి పరిమితం అయిపోయారు

By:  Tupaki Desk   |   11 Jan 2024 6:26 PM GMT
ముద్రగడ...కండిషన్లు అప్లై...!
X

ముద్రగడ పద్మనాభం. రాజకీయంగా చూస్తే కొరుకుడు పడని మొండిఘటంగా చెబుతారు. ఆయన పట్టుదల రాజకీయంగా ఎంతవరకూ పనికి వచ్చింది అన్నది పక్కన పెడితే ఆయన సామాజిక ఉద్యమ కర్తగా కీలకం కావడానికి మాత్రం కలసి వచ్చింది అని అంటారు.

అలా అందరివాడుగా ఉన్న ముద్రగడ పద్మనాభం తరువాత కాలంలో ఒక సామాజిక వర్గానికి పరిమితం అయిపోయారు. అలా ఆయన తన రాజకీయ జీవితాన్ని కాపు ఉద్యమానికి అంకితం చేసినా ఆయన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే పిఠాపురంలో ఓటమి పాలు అయ్యారు.

ఇక 2014లో ఆయన తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన కాపులను బీసీలలో చేరుస్తామన్న హామీ కోసం చేసిన ఉద్యమం చాలా పెద్ద ఎత్తున సాగింది. కేసులు కూడా ఎదుర్కొన్నారు. ఇవన్నీ పక్కన పెడితే ముద్రగడ వైసీపీ పట్ల కాస్తా సాఫ్ట్ కార్నర్ తో ఉంటారు అన్న ప్రచారం ఉంది.

దాంతో 2024 ఎన్నికల ముందు ముద్రగడ రీయాక్టివ్ అవుతూంటే ఆయన వైసీపీలో చేరుతారు అని అనుకున్నారు. ఆయన కుమారుడు గిరిబాబు కూడా ఆ విధంగా సంకేతాలు ఇచ్చారు. జనవరి 1న ముద్రగడ తన ఇంట్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో రాజకీయ ప్రకటన చేసినంత పనిచేశారు. ఒక విధంగా ఆయన వైసీపీకి సంకేతాలు పంపించారు అని అంటారు.

అయితే ఆయన కోరుకున్న సీట్లలో వైసీపీ అభ్యర్ధులను రెండవ జాబితాలో ప్రకటించేసింది. పిఠాపురం, పత్తిపాడు, వంటి చోట్ల వైసీపీ ఇంచార్జిలను నియమించడంతో కాకినాడ ఎంపీ సీటు మాత్రమే మిగిలి ఉంది అంటున్నారు. ఇక ముద్రగడ తాను తనతో పాటు తన కుటుంబంలో ఒకరికి టికెట్ అలాగే తన సన్నిహితులకు ఒకరిద్దరికి టికెట్ కోరుతున్నారని ప్రచారం సాగుతోంది.

మరి వైసీపీ ఎందుకు ముద్రగడ విషయంలో జాప్యం చేసింది అన్నది అర్ధం కాలేదు అని అంటున్నారు ఈ నేపధ్యంలో జనవరి 4న పవన్ కళ్యాణ్ కాపు పెద్దలకు నమస్కారాలు పేరుతో విడుదల చేసిన ప్రకటన కూడా ముద్రగడను ఆలోచింపచేసింది అని అంటున్నారు. ఆ మీదట జనసేన నుంచి నేతలు ఆయనతో చర్చలు జరిపారు అని అంటున్నారు.

దాంతో ముద్రగడ కుమారుడు తాజాగా మాట్లాడుతూ చేరితే జనసేన లేకపోతే టీడీపీ అని చెప్పేశారు. ఇదిలా ఉంటే ముద్రగడ కోరుతున్న సీట్లు ఆయన ప్రయారిటీ వంటివి కూడా కొత్తగా చేరే పార్టీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది అని అంటున్నారు.

ఆ విధంగా అన్నీ కుదిరితేనే జనసేన అయినా టీడీపీ అయినా ముద్రగడ చేరుతారు అని అంటున్నారు. లేకపోతే ఇంట్లో కూర్చుంటాను అని కూడా ఆయన చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ముద్రగడను చేర్చుకోవడానికి జనసేన టీడీపీ రెండూ సుముఖంగా ఉన్నాయి. అయితే ముద్రగడ కోరే సీట్లు ఏమిటి ఆయన కండిషన్లు ఏమిటి అన్నది కూడా తెలిసిన మీదటనే ఆయన ఏ పార్టీలో చేరేది ఒక కొలిక్కి వస్తుంది అని అంటున్నారు. ఏది ఏమైనా ముద్రగడ మాత్రం వైసీపీలో చేరరు అని కుమారుడు గిరిబాబు తేల్చేశారు. ఇక ఆయన రాజకీయ గమనం ఏమిటి అన్నాది చూడాల్సి ఉంది.