ఆ హీరోను తరిమేయండి...ముద్రగడ హాట్ కామెంట్స్ !
ఎవరా హీరో ఏమా కధ అంటే అందరికీ తెలిసిన హీరోనే. ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
By: Tupaki Desk | 15 April 2024 4:10 AM GMTఎవరా హీరో ఏమా కధ అంటే అందరికీ తెలిసిన హీరోనే. ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన సినిమాలు ప్లస్ రాజకీయం రెండూ చేస్తున్నారు దాంతో ఆయనను ముద్రగడ హీరో అని అంటున్నారు. పిఠాపురంలో హీరో గారిని ఓడించండి అని ఓపెన్ గానే పిలుపు ఇచ్చారు ముద్రగడ పద్మనాభం.
అసలు సినిమా హీరోలకు రాజకీయాలు ఎందుకు అని ఆయన మొదటి నుంచి లాజిక్ తోనే ప్రశ్నిస్తున్నారు. అందులోనే అసలైన అర్ధం ఉంది. అది సామాన్యుల మెదళ్ళలోకి వెళ్లాలన్నది ముద్రగడ ఆలోచన. అదెలా అంటే ఎమ్మెల్యే అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి.కానీ సినిమా హీరోగా ఉంటూ రాజకీయాల్లో ఉన్న పవన్ అందుబాటులో ఎలా ఉంటాడు అన్నదే ముద్రగడ ప్రశ్న.
పిఠాపురం ప్రజలు అయితే తమకు అందుబాటులో లేని వారి మీద ఎంతో కోపం పెంచుకుంటారు. దానికి ఉదాహరణ ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అని అంటారు. ఆయన తమకు అందుబాటులో లేరని పెండెం దొరబాబు మీద బాహాటంగానే విమర్శిస్తారు. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు అయినా తమకు అందుబాటులో ఉండకపోతే అసలు స్పేర్ చేయరు అని చెప్పడానికే ఈ ఉదాహరణ అంటున్నారు.
ఇక వర్మ అన్న ఆయనను తెచ్చి ఏకంగా 47 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు. ఆయనకు కుల బలం లేదు, అయినా ప్రజల అభిమాన ధనం ఉంది. దానికి కారణం వర్మ నిరంతరం జనాల్లో ఉంటారు. అలాగే వంగా గీత కూడా ప్రజలలో ఉంటారు అని పేరు. అందుకే ఆమె ఇపుడు వైసీపీ నుంచి పవన్ కి గట్టి పోటీ ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే పవన్ ని ఓడించమని ఆయన అందుబాటులో ఎవరికీ ఉండరని ముద్రగడ పిలుపు ఇస్తున్నారు. అసలు పవన్ కి ఎందుకు ఎమ్మెల్యే పదవి అని ప్రశ్నిస్తున్నారు. సినిమా షూటింగులు చేసుకోవడానికా అని ఎద్దేవా చేస్తున్నారు.
ఒక్క పవన్ ని ఓడిస్తే ఆ తరువాత ఏ సినిమా హీరో కూడా రాజకీయాల్లోకి రానే రారు అని కూడా ముద్రగడ అంటున్నారు. జగన్ దృష్టిలో పిఠాపురం నంబర్ వన్ అని ఆ తరువాతనే ఆయన పులివెందుల అని కూడా ముద్రగడ చెబుతున్నారు. ఎటూ వచ్చేది వైసీపీ ప్రభుత్వమని అందువల్ల పిఠాపురం ప్రజలు వైసీపీని గెలిపిస్తే నంబర్ వన్ గా డెవలప్మెంట్ చేసుకోవచ్చు అని ఆయన అంటున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ మీద ముద్రగడ ఒక రేంజిలో ఫైర్ అయ్యారు. అసలు ఎందుకు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు అని నిలదీశారు. ఎక్కడో హైదరాబాద్ లో ఉండే పవన్ కి పిఠాపురం అవసరమా అని కూడా ప్రశ్నించారు. ప్రజలకు కష్టాలు వస్తే ఎక్కడికి వచ్చి చెప్పుకోవాలి. సినిమా షూటింగుల వద్దకు వెళ్లాలా అని ఆయన హాట్ కామెంట్స్ చేసారు.
సినిమా హీరోగా ఉంటూ వచ్చిన పవన్ లాంటి వారు ముఖానికి రంగు వేసుకుని తైతక్కలాడుతూ ప్రజలకు పిచ్చోళ్ళను చేస్తున్నారు అని మండిపడ్డారు. పిఠాపురంలో ఉన్నవే రెండు లక్షల ముప్పై వేల ఓట్లు అయితే తాను మూడు లక్షల మెజారిటీతో గెలుస్తాను అని అంటున్న పవన్ గురించి ఏమి చెప్పాలని అని ఆయన ఎద్దేవా చేశారు.
ఒక రాజకీయ నేత ముఖ్యమంత్రి అయిన జగన్ మీద హత్యా యత్నం జరిగితే దాన్ని కనీసం ఖండించలేని దుస్థితిలో విపక్షాలు ఉండడం బాధాకరం అన్నారు. తమ రాజకీయ ఆకలిని తీర్చుకోవడానికి ఈ తరహా వైఖరి తీసుకోవడం ఎంతవరకూ సమంజసం అని ఆయన ప్రశ్నించారు.