Begin typing your search above and press return to search.

అక్షరాలనే సబ్బుతో, ఆత్మాభిమానం అనే బండకేసి పవన్ ను బాదిన ముద్రగడ!

టీడీపీ - జనసేన అభ్యర్థుల తొలి జాబితా అనంతరం జనసేనలోను.. ఆ పార్టీ కార్యకర్తల్లోనూ, నేతల్లోనూ, ఆ పార్టీ శ్రేయోభిలాషుల్లోనూ

By:  Tupaki Desk   |   29 Feb 2024 5:29 AM GMT
అక్షరాలనే సబ్బుతో, ఆత్మాభిమానం అనే బండకేసి పవన్ ను బాదిన ముద్రగడ!
X

టీడీపీ - జనసేన అభ్యర్థుల తొలి జాబితా అనంతరం జనసేనలోను.. ఆ పార్టీ కార్యకర్తల్లోనూ, నేతల్లోనూ, ఆ పార్టీ శ్రేయోభిలాషుల్లోనూ.. కాపు సామాజికవర్గానికి చెందిన పెద్దల్లోనూ విపరీతమైన అసంతృప్తి జ్వాలలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ప్రధానంగా జోగయ్య లాంటి వారైతే సెగలు కక్కగా... తాజాగా కాపు ఉద్యమ నేత, ఆ సామాజిక వర్గంలో కీలక నేతగా పేరున్న ముద్రగడ పరోక్షంగా దహించే స్థాయిలో ఫీలవుతున్నారని తెలిసే సంఘటన తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... పొత్తులో భాగంగా జనసేనకు చంద్రబాబు 24 సీట్లే ఇవ్వడం.. వాటిని పవన్ కల్యాణ్ "మహా ప్రసాదం" అన్నట్లుగా భావించారనే కామెంట్లు వస్తుండటం.. ఇది కాపు జాతికి జరిగిన అవమానం అని ఒకరంటే.. పవన్ కల్యాణ్ తనతో పాటు కాపుజాతిని చంద్రబాబు పాదాల వద్ద తాకట్టు పెట్టారని మరొకరు ఘాటుగా స్పందిస్తున్న పరిస్థితి. మరోపక్క... కొన్ని స్థానాల్లో టీడీపీ నేతలనే తామే ఓడిస్తామంటూ జనసేన నేతలు, జనసైనికులు శపథాలు చేస్తున్న పరిస్థితి.

ఈ సమయంలో ముద్రగడ పద్మనాభం.. పవన్ కల్యాణ్ కు ఒక లేఖ రాశారు! గోదావరి జిల్లా వెటకారం.. కడుపు రగిలిపోతున్నా అవతలి వ్యక్తికి కనిపించకుండా మేనేజ్ చేయడం చేస్తూ.. వస్తున్న ఆగ్రహావేశాలను, పడుతున్న అవమాన భారాలనూ పంటికింద నొక్కి పెట్టి.. తన ఆవేదనను అక్షరాలుగా రాస్తూ.. వాటికి గోదారి వెటకరం అనే కోటింగ్ వేస్తూ రాసినట్లుగా ఒక లేఖ రాశారు ముద్రగడ పద్మనాభం. ఇప్పుడు ఈ లేఖ ఏపీ రాజకీయాలతో పాటు.. ప్రధానంగా కాపు సామాజికవర్గంలో పెను ప్రకంపణలు సృష్టించేలా ఉంది.

"మిత్రులు గౌరవ పవన్ కల్యాణ్ గారికి ముద్రగడ పద్మనాభం నమస్కారాలు.." అని మొదలుపెట్టిన ఈ లేఖ... "మీ పార్టీ పోటీచేసే 24 మంది కోశం నా అవసరం రాదు, రాకూడదని భగవంతున్ని ప్రార్ధిస్తున్నానండీ.." అని ముగిసిందంటే... అదీ ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. ఈ లేఖ చదువుతున్న సామాన్యులకే.. ఒళ్లు గగ్గురుపొడుస్తుండటంతో పాటు.. వెటకారం పీక్స్ వెళ్లిందని, ఇది పవన్ కు బిగ్ షాక్ అని అనిపిస్తుందనే మాటలూ వినిపిస్తున్నాయి.

గత కొంతకాలంగా... పవన్ కల్యాణ్ నేరుగా ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయన్ని కలుస్తారనే చర్చ గత కొంతకాలంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ముద్రగడకు సమాచారం అదిందని కూడా అంటున్నారు. ఇదే సమయంలో... అయోధ్యకు వెళ్లొచ్చిన తర్వాత కిర్లంపూడి వస్తాను అని పవన్ కల్యాణ్ కబురు పంపించారని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ పవన్... ముద్రగడను కలవకపోవడంతో.. ఇకపై కలవరనే క్లారిటీకి వచ్చిన ఆయన... తనదైన శైలిలో స్పందించారు.

ఇందులో భాగంగా... "ఎటువంటి ఫలితం ఆశించని సేవ మీతో చేయాలనుకున్నానండి.. మన ఇద్దరి కలయికా జరగాలని యావత్ జాతి కోరుకుందండి.. అందరి కోరిక మేరకు నేను అన్నీ మరిచిపోయి మీతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డానండి.. కానీ దురదృష్ట వసత్తు మీరు నాకు ఆ అవకాశం ఇవ్వలేదండి" అంటూ తాను చెప్పాలనుకున్న విషయాన్ని అత్యంత క్లియర్ గా స్పష్టం చేశారు ముదరగడ పద్మనాభం.

ఇదే సమయంలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయాన్ని గుర్తు చేసిన ముద్రగడ... ఆ సమయంలో పవన్ కల్యాణ్ స్పందించిన తీరు చరిత్రను తిరిగరాసే అంశం అని అన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కనీసం 80 సీట్లు, రెండు సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి కోరి ఉండాలని చెప్పిన ముద్రగడ.. ఆ సాహసం పవన్ చేయకపోవడం బాధాకరమని స్పష్టం చేశారు ముద్రగడ.

ఇక ఈ లేఖ క్లైమాక్స్ లో పీక్స్ కి చేరిన ముద్రగడ... "మీలాగా గ్లామర్ ఉన్నవాడిని కాకపోవడం.. ప్రజలలో పరపతిలేనివాడిని అవ్వడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా, తుప్పు పట్టిన ఇనుప ముక్కలా గుర్తింపు పడటం వల్ల.. మీరు వస్తానని చెప్పించి రాలేకపోయారు" అని అంటూనే... "మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు.. ఎన్నో చోట పర్మిషన్లు తీసుకోవాలండి" అని ఇచ్చిపడేస్తూ... లాస్ట్ లో "ఆల్ ది బెస్ట్ అండి" అని ముగించారు ముద్రగడ.

ఈ లేఖ అటు జనసైనికులు చదివినా.. ఇటు కాపు సామాజికవరం వారు చదివినా.. మరోపక్క కాపు సమాజానికి ముద్రగడ చేసిన సేవలు తెలిసిన వారు చదివినా.. చంద్రబాబు వద్ద పవన్ జీ హుజూరు అన్నట్లు ప్రవర్తిస్తున్నారనే మాటలు నమ్మిన వారు చదివినా... అక్కడితో పవన్ ని లైట్ సీసుకోవడం జరుగుందనే భావించాలి. ఇక పవన్ కల్యాణే చదివితే... !!!!