కాపు నేత తుది నిర్ణయం ఇదే!
ముద్రగడ ఇంటి నుంచే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడించారు
By: Tupaki Desk | 7 March 2024 10:51 AM GMTకాపు రిజర్వేషన్ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం ఎట్టకేలకు అధికార వైసీపీలో చేరడానికి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. ముద్రగడ పద్మనాభాన్ని కలిశారు. ఆయనను వైసీపీలోకి ఆహ్వానించారు. అంతకుముందు రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేశ్.. ముద్రగడను కలిసి చర్చలు జరిపారు. ముద్రగడ ఇంటి నుంచే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడించారు. దీంతో పెద్దిరెడ్డి మిథున్ కూడా ముద్రగడ ఇంటికి చేరుకున్నారు.
అయితే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని.. తన కుమారుడు గిరి పోటీ చేస్తాడని ముద్రగడ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే వైసీపీ నేతలు మాత్రం ముద్రగడ పద్మనాభాన్ని పోటీ చేయాలని కోరినట్టు సమాచారం. తన పోటీపై ఒకసారి ఇంట్లో మాట్లాడి చెబుతానని ముద్రగడ వైసీపీ నేతలకు చెప్పినట్టు తెలుస్తోంది.
వాస్తవానికి చాలా ముందుగానే వైసీపీలో ముద్రగడ చేరతారని వార్తలు వచ్చాయి. జనసేనాని పవన్ కళ్యాణ్.. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై విమర్శలు చేసినప్పుడు ముద్రగడ.. ద్వారంపూడిని వెనకేసుకొచ్చారు. పవన్ కు దమ్ముంటే ద్వారంపూడిపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. వంగవీటి రంగా సభలకు ద్వారంపూడి లారీలు, బస్సులు పెట్టారని కూడా తెలిపారు. దీనిపై ముద్రగడపై తీవ్ర స్థాయిలో సొంత సామాజికవర్గం నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ద్వారంపూడి లారీలు పెడితే కానీ సభకు వెళ్లలేని స్థితిలో కాపులు లేరంటూ తేల్చిచెప్పారు. దీంతో ముద్రగడ వెనక్కి తగ్గారు. మరోవైపు తనకు, తన కుమారుడికి ఇద్దరికీ ముద్రగడ సీట్లు కోరుకున్నారని టాక్ నడిచింది. ముద్రగడ కోరిన ప్రత్తిపాడు, కాకినాడ ఎంపీ సీట్లకు వైఎస్ జగన్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు.
దీంతో వైసీపీలో చేరకుండా ముద్రగడ ఆగిపోయారు. మీ పార్టీకో దండం అంటూ లేఖ సంధించారు. తనను కలవడానికి ఎవరూ రావద్దని కోరారు. ఈలోపు జనసేన నేతలు బొలిశెట్టి సత్య తదితరులు ముద్రగడను కలిశారు. జనసేనలోకి రావాలని ఆహ్వానించారు. స్వయంగా పవన్ కళ్యాణ్ మీ ఇంటికొచ్చి ఆహ్వానిస్తారని ముద్రగడకు చెప్పారు. అయితే పవన్.. ముద్రగడను లైట్ తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో పవన్ కు ముద్రగడ మరో లేఖాస్త్రాన్ని సంధించారు. జనసేన 24 సీట్లే తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను కలుస్తానని కలవకపోవడంపై సెటైర్లు వేశారు. తనను కలవడానికి మీకు ఇంకా పర్మిషన్ రాలేదనుకుంటూ అని పవన్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అంతేకాకుండా మీ పార్టీ తరఫున కానీ, అభ్యర్థుల తరఫున కానీ తనను ప్రచారం చేయాలని కోరవద్దన్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ముద్రగడను తమ పార్టీలోకి ఆహ్వానించారు. పలుమార్లు ఆ పార్టీ నేతలు ముద్రగడను కలిసి చర్చలు జరిపారు. దీంతో ముద్రగడ కూడా తాను వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు.
కాగా ముద్రగడకు పిఠాపురం అసెంబ్లీ సీటును కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈలోపు ఆయన స్థాయికి తగ్గకుండా ఏదైనా రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవి ఇస్తారని టాక్ నడుస్తోంది
కాగా 2009లో ప్రముఖ నటుడు చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం సమయంలోనూ ముద్రగడ కాంగ్రెస్ పార్టీ తరఫున పిఠాపురం నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆ ఎన్నికల్లో ముద్రగడ పిఠాపురంలో ఘోరంగా ఓడిపోయారు. ఏకంగా మూడో స్థానానికి పడిపోయారు. ఇప్పుడు కూడా అదే స్థానం నుంచి బరిలోకి దిగే అవకాశమున్న నేపథ్యంలో ఈసారి ఏం జరుగుతుందో వేచిచూడాల్సిందే.