12న వైసీపీలో చేరనున్న ముద్రగడ...!?
ముద్రగడతో ఈసరికే వైసీపీ ముఖ్య నేతలు చర్చలు పూర్తి చేశారు అని అంటున్నారు.
By: Tupaki Desk | 6 March 2024 7:40 AM GMTగోదావరి జిల్లాలలో కీలక నేత, కాపు నాయకుడు అయిన ముద్రగడ పద్మనాభం ఈ నెల 12న వైసీపీలో చేరబోతున్నారు అని అంటున్నారు. ఆ రోజున ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో తాడేపల్లిలో వైసీపీ కండువా కప్పుకుంటారు అని అంటున్నారు. ముద్రగడతో ఈసరికే వైసీపీ ముఖ్య నేతలు చర్చలు పూర్తి చేశారు అని అంటున్నారు.
ముద్రగడ ఇంటికి తాజాగా వైసీపీ నేత జక్కంపూడి గణేష్ వెళ్లి మంతనాలు జరిపారని, అక్కడ నుంచే గోదావరి జిల్లాల వైసీపీ రీజననల్ కో ఆర్డినేటర్ మిధున్ రెడ్డితో ముద్రగడకు ఫోన్ కలిపి మాట్లాడించారని తెలుస్తోంది. ముద్రగడను పార్టీలోకి సాదరంగా మిధున్ రెడ్డి ఆహ్వానించారని అంటున్నారు.
దాంతో ముద్రగడ వైసీపీలో చేరికకు దాదాపుగా పూర్వ రంగం అంతా సిద్ధం అయింది. ముద్రగడ ఈ నెల 12న వైసీపీలో చేరడం ఖాయం అని ప్రచారం కూడా సాగుతోంది. ఇదిలా ఉంటే ముద్రగడ చివరిసారిగా 2009 ఎన్నికల్లో పిఠాపురం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి 45 వేల ఓట్ల దాకా తెచ్చుకున్నారు. గట్టి పోటీ ఇచ్చారు.
ఆ తరువాత ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు. పూర్తిగా కాపు ఉద్యమానికి అంకితం అయ్యారు. 2014 నుంచి 2019 దాకా సాగిన టీడీపీ ప్రభుత్వంలో కాపులను బీసీలలో చేర్చాలని కోరుతూ ముద్రగడ ఉద్యమించారు. అప్పట్లో ముద్రగడ వర్సెస్ చంద్రబాబుగా రాజకీయం సాగింది.
ఆ తరువాత వైసీపీ అధికారంలోకి రావడంతో ముద్రగడ కాపు ఉద్యమానికి స్వస్తి పలికారు. ఆయన వైసీపీకి సానుకూలంగా ఉన్నారు అన్న వార్తలు కూడా గత అయిదేళ్లుగా వినిపించాయి. అయితే ఆయన వైసీపీలో చేరుతారు అని ఈ ఏడాది మొదట్లో గట్టిగా ప్రచారం సాగినా ఆయన రెండవ కుమారుడు గిరి మాత్రం తాము టీడీపీ లేదా జనసేనలో చేరుతామని ప్రకటించారు.
దాంతో వైసీపీలో ముద్రగడ ఇక చేరరు అనుకున్నారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముద్రగడ ఇంటికి వెల్ళి చర్చలు జరుపుతారు అంటూ వచ్చిన వార్తలు కూడా నిజం కాకపోవడంతో తిరిగి వైసీపీ నేతలు చేసిన ప్రయత్నాల వల్ల ముద్రగడ ఫ్యాన్ పార్టీ వైపు వస్తున్నారు ఆయన్ని పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ మీద పోటీకి దించాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది.
అయితే ముద్రగడ వైసీపీకి ఎన్నికల ప్రచారం చేసి పెడతాను అని తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లుగా చెబుతున్నారు. అలాగే రాజ్యసభ సీటుకి ముద్రగడ పేరుని కూడా ప్రతిపాదిస్తున్నారని మరో ప్రచారం సాగుతోంది. మొత్తానికి చూస్తే ముద్రగడ వైసీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
గోవరి జిల్లాలో సామాజిక సమీకరణలను బ్యాలెన్స్ చేయడానికే వైసీపీ ముద్రగడను పార్టీలోకి ఆహ్వానిస్తోంది అని అంటున్నారు. ముద్రగడ రాకతో వైసీపీ బలమైన సామాజిక వర్గానికి అనుసంధానం అవుతుందని ఫలితంగా టీడీపీ జనసేన కూటమిని విజయన్వతంగా గోదావరి జిల్లాలలో అడ్డుకునేందుకు మార్గం సుగమం అవుతుందని ఆలోచిస్తోంది అని అంటున్నారు.