గోదావరి పల్స్ : పవన్ వర్సెస్ ముద్రగడ...!
ఈ నేపధ్యంలో వైసీపీ వైపు ముద్రగడ చూస్తున్నారు అని వార్తలు రావడం ఇపుడు ఆయన చేరికకు కూడా తగిన ప్రాతిపదిక ఏర్పడింది అని అంటున్నారు.
By: Tupaki Desk | 6 March 2024 1:17 PM GMTముద్రగడ పద్మనాభం వైసీపీలోకి మొదటే ఎందుకు రాలేదు, ఇపుడే ఎందుకు వస్తున్నారు. ఇది పెద్ద ప్రశ్న. నిజానికి ముద్రగడ వైసీపీకి అనుకూలం అని కాపు సామాజిక వర్గంలో ఒక అనుమానం అయితే ఉంది. దాంతోనే పెద్దాయన అసలే రూమర్స్ ఉన్నాయి, తీరా కండువా కప్పుకుంటే మరింత ఇబ్బంది అని ఆగారు అని కూడా ప్రచారం సాగింది.
అయితే ఇక్కడే ఒక కీలక పరిణామం జరిగింది. కాపుల కోసం ఒక పార్టీ అని జనసేన వైపు మెజారిటీ కాపులు చూస్తూ వస్తున్నారు. అదే టైం లో ముద్రగడ జనసేనలో చేరాలని కాపుల నుంచి గతంలో తీవ్ర స్థాయిలో వత్తిడి వచ్చింది. టీడీపీతో జనసేన పొత్తు ఉండడం చంద్రబాబు పట్ల వ్యతిరేకతతో ఉన్న ముద్రగడ అందుకే ఆ వైపు వెళ్లలేదు అని కూడా అంటారు. కానీ కాపులకు రాజ్యాధికారం దక్కుతున్న వేళ ముద్రగడ వంటి వారు వైరి పక్షంలో ఉండే కంటే జనసేన వైపు వెళ్లాలన్న వాదంతోనే ఆయన కూడా అంగీకరించారు అని అంటారు.
ఇలా ముద్రగడ వైపు నుంచి లైన్ క్లియర్ గా ఉన్నా జనసేన వైపు నుంచి మాత్రం సానుకూలత రాలేదు. పవన్ స్వయంగా వచ్చి ముద్రగడను పార్టీలో చేర్చుకుంటారు అన్న ప్రచారం నెలలు జరిగినా ఆచరణలో మాత్రం సాధ్యపడలేదు దాని వెనక టీడీపీ అధినాయకత్వం ఉందని అనుమానిస్తున్నారు. ఇదే విషయం ముద్రగడ ఇటీవల పవన్ కి రాసిన బహిరంగ లేఖలో కూడా చెప్పుకొచ్చారు.
మీ నిర్ణయాలు మీ చేతులలో ఉండవని దెప్పిపొడిచారు. ఇక అంతటితో జనసేనలోకి ముద్రగడ చేరికకు ఫుల్ స్టాప్ పడింది. ఇదంతా కూడా గోదావరి జిల్లా కాపులకు కూడా అర్ధం అయింది. ముద్రగడ రావాలనుకునా ఆయనను చేర్చుకోలేదు అన్న భావం కూడా వారిలో ఉంది. టీడీపీతో పొత్తు తరువాత సీన్ అయితే మారింది అని అంటున్నారు. ఈ పొత్తులో భాగంగా మరీ ఇరవై నాలుగు సీట్లనే పవన్ తీసుకోవడంతో కాపులు మండిపోతున్నారు.
ఈ నేపధ్యంలో వైసీపీ వైపు ముద్రగడ చూస్తున్నారు అని వార్తలు రావడం ఇపుడు ఆయన చేరికకు కూడా తగిన ప్రాతిపదిక ఏర్పడింది అని అంటున్నారు. ముద్రగడ ఇపుడు వైసీపీలో చేరినా బలమైన కాపు సామాజిక వర్గం తప్పు పట్టే అవకాశమే లేదు అని అంటున్నారు. ఎందుకంటే ఆయన జనసేన వైపు రావాలని చూసినా తీసుకోలేదు అన్నది ఎటూ ఉంది కదా అంటున్నారు.
ఇక ముద్రగడ పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తే పోటీలో ఉంటారా లేక తన కుమారుడిని పోటీలో పెడతారా అంటే రెండవదే కరెక్ట్ అంటున్నారు. ముద్రగడ రెండవ కుమారుడు గిరిని పిఠాపురం నుంచి పోటీలోకి దింపబోతున్నారు అని అంటున్నారు.
ఇక ముద్రగడ మాత్రం గోదావరి జిల్లాలలో వైసీపీ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం బాధ్యతలు చూస్తారని, ఎన్నికల అనంతరం మరోసారి వైసీపీ ప్రభుత్వం ఏర్పడితే ముద్రగడకు రాజ్యసభ సీటు ఇస్తారని కూడా ప్రచారం సాగుతోంది.
ఇక గోదావరి జిల్లా పల్స్ ని చూసిన మీదటనే ముద్రగడ కుటుంబం వైసీపీ వైపు వెళ్తోంది అని అంటున్నారు. ఇప్పటిదాకా జనసేన వైపు ఊగిన వర్గాలు కూడా పొత్తులు ఆ మీదట జనసేనకు దక్కిన సీట్లలో ఆలోచనలో పడ్డారు అని అంటున్నారు. ఈసారి గంపగుత్తగా కాపుల ఓట్లు ఒకే పార్టీకి పడే అవకాశాలు లేవని అంటున్నారు.
అందువల్ల అధికార వైసీపీకి కూడా బలమైన సామాజిక వర్గం నుంచి మొగ్గు ఉండే చాన్స్ ఉందని అంటున్నారు. ఇవన్నీ సమీక్షించుకున్న మీదటనే ముద్రగడ వైసీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఇక వారాహి యాత్ర గతంలో పవన్ గోదావరి జిల్లాలలో నిర్వహించినపుడు లేఖల ద్వారా తన మనసులోని మాటలను చెప్పారు.
ఇపుడు పవన్ కనుక బరిలో ఉంటే టీడీపీ జనసేన కూటమి మీద ఆయన ఎదురు నిలిచి పోరాడేందుకు వైసీపీని రాజకీయ వేదికగా చేసుకుంటారు అని అంటున్నారు. కాపు సామాజిక వర్గంలో ముద్రగడ ప్రభావం ఏమిటి అన్నది కూడా ఈ ఎన్నికలు చూపించబోతున్నాయని అంటున్నారు.