టీడీపీలో డేంజర్ బెల్స్.. సరిదిద్దుకుంటారా...!
ఏపీ కూటమి ప్రభుత్వాన్ని ముందుండి నడిపిస్తున్న టీడీపీకి ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఆ
By: Tupaki Desk | 19 Oct 2024 4:26 AM GMTఏపీ కూటమి ప్రభుత్వాన్ని ముందుండి నడిపిస్తున్న టీడీపీకి ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఆ పార్టీ అధికారంలో ఉందని, అంతా బాగానే ఉందని, క్షేత్రస్థాయిలో బలంగా ఉందని అనుకున్నా.. తాజాగా జరిగిన కీలక పరిణామం టీడీపీకి ఇబ్బందిగానే మారింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గం అబ్జర్వర్‌గా వ్యవహరించిన ముదునూరి మురళీకృష్ణ తాజాగా జగన్ జట్టులో చేరిపోయారు. ప్రస్తుతం మురళీ కృష్ణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఉన్నారు.
అయితే.. ఒకరిద్దరు పోయినంత మాత్రాన టీడీపీకి ఇబ్బంది అని కానీ, మరొకటని కానీ.. ఇక్కడ ప్రశ్న కాదు. అధికారంలో ఉన్న పార్టీ.. పైగా నాలుగు నెలలు కూడా కాకముందే.. ఒక కీలక నాయకుడు ఆ పార్టీ నుంచి బయటకు రావడమే చర్చనీయాంశం. నిజానికి ఎన్నికలకు ముందు వచ్చేవారు వస్తారు. పోయేవారు పోతారని సరిపుచ్చుకోవచ్చు. 2019-24 మధ్య కూడా.. ఎన్నికలకు ఆరు మాసాలు లేదా ఏడాది ముందు మాత్రమే వైసీపీ నుంచి బయటకు వచ్చిన నాయకులు ఉన్నారు.
ఒక వేళ వైసీపీపై అసమ్మతి ఉన్నా.. బయటకు చెప్పినవారు ఉన్నారు. మౌనంగా ఉన్న వారు కూడా ఉన్నారు. కానీ, ఎప్పుడూ ఎవరూ ఇలా ప్రభుత్వం ఏర్పడగానే బయటకు వచ్చిన సంబర్భం లేదు. ఒకవేళ వచ్చినా.. నిరంతరం చంద్రబాబు తిట్టిపోసే వైసీపీ తీర్థం పుచ్చుకోవడం, అందునా 11 స్థానాలకే పరిమితమైన పార్టీలో చేరడం వంటివి మాత్రం నిస్సందేహంగా టీడీపీకి డేంజర్ బెల్సేనని అనడంలో సందేహం లేదు. ఇది రాంగ్ స్టేట్‌మెంట్‌నే ప్రజల్లోకి తీసుకువెళ్తుంది.
సో.. ఇలాంటి సందర్భాలు ఎందుకు వస్తున్నాయన్నది పార్టీ యుద్ధప్రాతిపదికన దృష్టి పెట్టాలి. ఈ రోజు మురళీ కృష్ణ కావొచ్చు. రేపు మరొకరు కావొచ్చు. కానీ, వాస్తవం ఏంటి? క్షేత్రస్థాయిలో తమ్ముళ్ల దూకుడు ఎలా ఉంది? సొంత పార్టీ నాయకులనే లెక్కచేయడం లేదా? లేక.. ఆధిపత్య రాజకీయాలు పెరిగిపోయి.. సొంత పార్టీలోనే కుంపటి పెడుతున్నారా? అనే విషయంపై చంద్రబాబు సహా సీనియర్ నాయకులు స్పందించాల్సి ఉంది. లేకపోతే... పార్టీలో అంతర్గత కలహాలు మరింత పెరిగి.. మరిన్ని ఇబ్బందులు వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు.