Begin typing your search above and press return to search.

హసీనా.. భారత్ లో మీ మౌనమే మీకు రక్ష.. లేదంటే కక్షే: యూనస్

భారత్‌లో కూర్చున్న హసీనా రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆమెపై యూనస్ మండిపడ్డారు.

By:  Tupaki Desk   |   5 Sep 2024 9:30 PM GMT
హసీనా.. భారత్ లో మీ మౌనమే మీకు రక్ష.. లేదంటే కక్షే: యూనస్
X

‘‘హసీనా.. మీరు ఎక్కడో ఉంటూ స్వదేశంపై నిందలేస్తారా..? అక్కడే ఉండండి.. కానీ.. నోర్మూసుకోండి. ఎక్కువ మాట్లాడొద్దు.. లేదంటే ఇబ్బంది అవుతుంది’’ అంటూ బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు చేసింది. ఎంత మౌనంగా ఉంటే.. ఆమె గురించి అంత మర్చిపోతామని.. నోరు విప్పుతుంటే సమస్య తీవ్రం అవుతుందని పరోక్షంగా తప్పుబట్దింది. ఇదంతా ఎందుకొచ్చిందంటే.. ఇటీవల షేక్ హసీన భారత్ నుంచి బంగ్లాదేశ్ ప్రజలను అభ్యర్థిస్తూ ఓ ప్రకటన చేశారు. కొందరు ఆందోళనకారులు విధ్వంసానికి దిగి.. హింసకు పాల్పడ్డారని.. చాలామంది ప్రాణాలు కోల్పోయారని అందులో పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆగస్టు 15న బంగబంధు భవన్‌ వద్ద మృతులకు నివాళి అర్పించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హత్యలు, విధ్వంసానికి కారకులను గుర్తించి శిక్ష విధించాలని.. తనకు న్యాయం కావాలని డిమాండ్‌ చేశారు. బంగబంధు అంటే.. హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్. ఆయన నివాసం లేదా స్మారకం పేరే బంగబంధు భవన్. కాగా.. ముజిబుర్ విగ్రహాలను ఆందోళనకారులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అలాంటిది హసీనా.. ఆయన నివాసం వద్దనే నివాళి అర్పించాలని కోరడం గమనార్హం. దీంతోనే బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ స్పందించారు.

పొరుగు గడ్డ నుంచి రాజకీయాలా?

భారత్‌లో కూర్చున్న హసీనా రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆమెపై యూనస్ మండిపడ్డారు. హసీనాను అప్పగించాలని బంగ్లా ప్రభుత్వం కోరే వరకు అక్కడే (భారత్‌ లో) మౌనంగా ఉండాలని కూడా సూచించారు. లేదంటే హసీనా వ్యాఖ్యలు ఇరు దేశాల సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని కూడా వ్యాఖ్యానించారు. హసీనా మౌనమే ఆమెకు రక్ష అని.. దానిని మర్చిపోయి వ్యాఖ్యలు, సూచనలు చేస్తే ఎవరూ ఇష్టపడరని అన్నారు. దేశంలో జరిగిన దురాగతాల నుంచి న్యాయం అందిస్తామని.. అందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ఆమె తిరిగొస్తేనే న్యాయం

హసీనా తిరిగి స్వదేశానికి వస్తేనే న్యాయం అని యూనస్ అన్నారు. అలా జరగకుంటే బంగ్లా ప్రజలు క్షమించరని తేల్చిచెప్పారు. హసీనా పాల్పడిన దురాగతాలకు అందరి ముందు విచారించాల్సిందే’’ అని కూడా ప్రకటించారు. దీన్నిబట్టి హసీనాను రప్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. భారత్‌ తో సత్సంబంధాలను కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానిస్తూనే.. హసీనా సారథ్యంలోనే బంగ్లాలో స్థిరత్వం ఉంటుందనే ధోరణి వీడాలంటూ పరోక్షంగా భారత్ వ్యతిరేక వైఖరిని బయటపెట్టారు.

మరోవైపు హసీనాను భారత్‌ అప్పగిస్తుందా? లేదా? అని ఇప్పటికే తాత్కాలిక ప్రభుత్వం ప్రశ్నించింది. హసీనాను రప్పించడానికి యూనస్‌ ప్రభుత్వం ఏమైనా చేస్తుందని కూడా కథనాలు వచ్చాయి. ఆమెను అప్పగించాలని ఎన్నిసార్లు కోరినా సమాధానం రాలేదని కూడా నిష్టూరమాడింది. అసలు అప్పగించాలా, వద్దా అనే నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత భారత్‌ పైనే ఉందని కూడా పేర్కొంది.