Begin typing your search above and press return to search.

మహ్మద్ సూచన... మథుర, జ్ఞానవాపిలను హిందువులకు ఇచ్చేయాలి!

ఎంతో అంగరంగ వైభవంగా రాం లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగింది.

By:  Tupaki Desk   |   24 Jan 2024 3:30 AM GMT
మహ్మద్  సూచన... మథుర, జ్ఞానవాపిలను హిందువులకు ఇచ్చేయాలి!
X

సుమారు ఐదు శతాబ్ధాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం కోదండ రాముడు తన జన్మస్థానం అయిన అయోధ్యలో కొలువుతీరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్పందించిన మోడీ... రాముడు ఇకపై డేరాలో ఉండాల్సిన అవసరం లేదని, ఆయన దివ్యమందిరంలో కొలువుదీరారని తెలిపారు. ఎంతో అంగరంగ వైభవంగా రాం లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగింది. ఈ సమయలో దేశమంతటా శ్రీరామ నామ స్మరణతో మారుమ్రోగిపోయింది.

ఆ విధంగా సోమవారం అయోధ్య రామాలయంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగ్గా... మంగళవారం నుంచి సామాన్య భక్తులకు శ్రీరామచంద్రమూర్తి దర్శనానికి అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం మూడు గంటల నుంచే నవనిర్మాణ రామాలయ ప్రధాన ద్వారం వద్ద శ్రీరాముని భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ప్రముఖ ఆర్కియాలజిస్ట్ కేకే మహమ్మద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

అవును... శతాబ్ధాలుగా ఎదురు చూస్తున్న కల, ఎందరో రామ భక్తుల పోరాటం వల్ల అయోధ్య రామాలయానికి ప్రాణం పోసిందనే చర్చ బలంగా మొదలైంది. ఈ సమయంలో... జ్ఞానవాపి, మధుర హిందువులకు ముస్లింలు ఇష్టపూర్వకంగా అప్పగించాలని కేకే ముహమ్మద్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఆయన ఏ ఉద్దేశ్యంతో అన్నారనే చర్చకు తావులేకుండా... ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సరికొత్త చర్చకు దారి తీసుకున్నాయి!!

ఇందులో భాగంగా... అయోధ్యలానే.. మధురలోని ఉన్న శ్రీకృష్ణ జన్మస్థలాన్ని, కాశీలోని జ్ఞానవాపి ప్రాంతాలను ముస్లింలు హిందువులకు ఇచ్చేయాలని మహమ్మద్ సూచించారు. శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు, శివుడి దేవాలయాలు ఉన్న ప్రాంతాలతో హిందువులకు తీవ్రమైన భావోద్వేగాలు ఉంటాయని.. ఈ ప్రాంతాలతో ముస్లింలకు పెద్దగా సెంటిమెంట్ ఉండదని.. అందువల్ల ఆ ప్రాంతాలను పవిత్ర ప్రాంతాలుగా చూసుకునే హిందువులకు ఇచ్చేయడమే ఈ సమస్యకు సరైన పరిష్కారమని కేకే మహమ్మద్ పేర్కొన్నారు.

కాగా... ప్రస్తుతం అయోధ్యలోని రామ మందిరం ఉన్న స్థానంలో ఉండే బాబ్రీ మసీదును గతంలో కూల్చివేసిన స్థలాన్ని తవ్విన భారత పురావస్తు శాఖ బృందంలో 71 ఏళ్ల కేకే ముహమ్మద్ కూడా ఒక సభ్యుడుగా ఉన్నారు. ఆ సమయంలో... బాబ్రీ మసీదు కూల్చివేయడం ఒక పురావస్తు శాస్త్రవేత్తగా తనను ఎంతగానో దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా... జ్ఞానవాపి, మధుర స్థాలాలను హిందువులకు ఇష్టపూర్వకంగా అప్పగించాలని వ్యాఖ్యానించారు!