మయిజ్జు దొంగ బుద్ధిని కళ్లకు కట్టినట్లు చెప్పేశాడు
ఆయన.. ఎన్నికల సమయంలో చేసిన తప్పుడు ఆరోపణలకు ఆధారాలు చూపించలేకపోతున్నట్లుగా పేర్కొన్నారు.
By: Tupaki Desk | 26 Feb 2024 4:22 AM GMTచిరకాలంగా స్నేహితుడిగా ఉండే మాల్దీవులతో ఈ మధ్యన దూరం పెరగటం.. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు తెలిసిందే. చైనా మీద సానుకూలత ఎక్కువగా ఉండే మాల్దీవుల అధ్యక్షుడు మయిజ్జు వ్యవహరించే తీరు.. ఆయన మాటలకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్. ఎన్నికల వేళలో మాల్దీవు ప్రజల్ని తన తప్పుడు మాటలతో రెచ్చగొట్టారని ఆయన మండిపడ్డారు. మాల్దీవుల్లో వేలాది మంది భారత సైన్యం ఉన్నారంటూ అబద్ధాలతో ఎన్నికల ప్రచారాన్ని చేయటాన్ని ఆయన గుర్తు చేశారు.
తాజాగా మాట్లాడిన ఆయన.. తమ దేశ భూభాగంలో సాయుధలైన విదేశీ సైనికులు ఎవరూ లేరన్న ఆయన.. ఎన్నికల సమయంలో చేసిన తప్పుడు ఆరోపణలకు ఆధారాలు చూపించలేకపోతున్నట్లుగా పేర్కొన్నారు. మయిజ్జు తన వంద రోజుల పాలనలో ఎన్నో అబద్ధాల్ని ప్రచారం చేశారని.. అందులో భారత సైనికులు వందలాది మంది మాల్దీవుల్లో ఉన్నారన్నది కూడా ఒకటన్నారు. గతంలో అధికారంలో ఉండి.. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ వల్లే అనేక మంది భారత సైనికులు దేశంలోకి ప్రవేశించారని ఎన్నికల సమయంలో మయిజ్జు ప్రచారం చేశారని.. ఇదే నినాదంతో ఆయన ప్రజల్ని రెచ్చగొట్టి ఓట్లు పొందే ప్రయత్నం చేశారన్నారు.
కానీ.. భారత్ తో ఆ తరహా ఒప్పందాలు కుదిరినట్లు అధికారంలోకి వచ్చిన తర్వాత మయిజ్జు చూపించలేకపోతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తమ దేశంలోని మూడు వైమానిక స్థావరాల్లో ఒకదానిలో విధులు నిర్వహిస్తున్న బలగాలు మార్చి పది లోపు.. మిగిలిన రెండు స్థావరాల్లోని దళాలు మే 10 నాటికి వైదొలుగుతున్నట్లుగా మయిజ్జు ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో మాజీ విదేశాంగ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. నిజానికి భారత్ కు చెందిన 80 మందితో కూడిన సైన్యం ప్రస్తుతం మాల్దీవుల్లో ఉంది. భారత్ సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు.. నిఘా విమానాల నిర్వహణ బాధ్యతల్ని చూస్తుందే తప్పించి.. మరే విషయంలోనూ భారత సైన్యం జోక్యం చేసుకోదు. కానీ.. మయిజ్జు చేసిన ప్రచారానికి వందలాది మంది భారత సైన్యం మల్దీవుల్లో పెత్తనం చేస్తున్న భావన కలిగిందని చెప్పాలి.