Begin typing your search above and press return to search.

ముకేశ్ అంబానీ భారీ ప్లానింగ్.. చరిత్రలో నిలిచేలా జియో ఐపీవో

తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన టెలికాం విభాగం రిలయన్స్ జియో తన తొలి మెగా ఐపీవో (పబ్లిక్ ఆఫర్) కు సిద్ధమవుతున్నట్లుగా ఒక ఇంగ్లిషు మీడియా సంస్థ పేర్కొంది.

By:  Tupaki Desk   |   3 Jan 2025 5:12 AM GMT
ముకేశ్ అంబానీ భారీ ప్లానింగ్.. చరిత్రలో నిలిచేలా జియో ఐపీవో
X

ఏం చేసినా భారీగా చేసే అలవాటు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీలో కనిపిస్తుంది. అది వ్యాపారమైనా.. వ్యక్తిగత వ్యవహారాలైనా. తాను చేసే పనిని అందరూ మాట్లాడుకునేలా చేయటం అతడికే చెల్లుతుంది. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన టెలికాం విభాగం రిలయన్స్ జియో తన తొలి మెగా ఐపీవో (పబ్లిక్ ఆఫర్) కు సిద్ధమవుతున్నట్లుగా ఒక ఇంగ్లిషు మీడియా సంస్థ పేర్కొంది.

భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో నిలిచిపోయేలా ఈ ఐపీవో ఉంటుందని చెబుతున్నారు. దీని ద్వారా రూ.35వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల వరకు సమీకరించాలని సదరు సంస్థ భావిస్తున్నట్లు పేర్కొన్నారు. జియో ఐపీవో పనులు ఖరారు చేసేందుకు ముకేశ్ అంబానీ ఉన్నట్లుగా సదరు రిపోర్టు వెల్లడించింది.

ఐపీవో కోసం జియో విలువను 120 బిలియన్ డాలర్లుగా లెక్క కట్టినట్లుగా తెలుస్తోంది. మన రూపాయిల్లో చెప్పాలంటే దగ్గర దగ్గర రూ.10 లక్షల కోట్లుగా చెప్పొచ్చు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ భారీ ఐపీవో ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. మీడియా.. ఎంటర్ టైన్ మెంట్ సంస్థ వయాకామ్ 18 మీడియా అనుబంధ కంపెనీగా అవతరించినట్లుగా రిలయన్స్ వెల్లడించింది.

తప్పనిసరిగా మార్పిడికి లోనయ్యే 24.61 కోట్ల ప్రిఫరెన్స్ షేర్లను అదే సంఖ్యలో ఈక్విటీ షేర్లుగా మార్పు చేసినట్లుగా వెల్లడించింది. ఇప్పటివరకు రిలయన్స్ అనుబంధ కంపెనీ నెట్ వర్కు 18 మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ కు వయాకామ్ 18 మీడియా మెటీరియల్ సబ్సిడీయరీగా వ్యవహరించేది. తాజాగా చేసిన మార్పుతో వయాకామ్ 18లో రిలయన్స్ వాటా 70.49 శాతం నుంచి 83.88శాతానికి పెరిగినట్లైంది.

2024 మార్చిలో పారామౌంట్ గ్లోబల్ నుంచి వయాకామ్ 18లో 13.01 శాతం వాటాను రిలయన్స్ సొంతం చేసుకుంది. ఇందుకు రూ.4286 కోట్లను వెచ్చించింది. గత ఏడాది నవంబరు 14న వాల్ట్ డిస్నీ దేశీ మీడియా బిజినెస్ తో రిలయన్స్ మీడియా విభాగాలను విలీనం చేయటంతో రూ.70వేల కోట్ల విలువైన దేశీ మీడియా దిగ్గజం అవతరించటం తెలిసిందే. ఇలాంటి సమయంలోనే జియో మెగా ఐపీవో వివరాలు బయటకు పొక్కటం ఆసక్తికంగా మారింది.