Begin typing your search above and press return to search.

6 గంటల్లో 300 మి.మి.ల వాన... అస్తవ్యస్తమైన నగరం!

దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరం వర్షాకాలం ఎంత గందరగోళంగా ఉంటుందో అందరికీ తెలిసిందే

By:  Tupaki Desk   |   8 July 2024 7:21 AM GMT
6 గంటల్లో 300 మి.మి.ల వాన... అస్తవ్యస్తమైన నగరం!
X

దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరం వర్షాకాలం ఎంత గందరగోళంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. కొన్నిసార్లు భారీ వర్షాలకు రాకపోకల నిలిచిపోవడం.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం అక్కడ సహజమే. అయితే 6 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వాన కారణంగా ముంబై అతలాకుతలం అయింది. కేవలం 6 గంటల్లో 300 మి.మి.ల వాన పడడంతో లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఏకధాటిగా ఆగకుండా కుంభవృష్టిలా కురిసిన వాన రికార్డ్ స్థాయి వర్షపాతాన్ని నమోదు చేసింది. దీంతో నగరంలోని జనజీవనం తంబించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ప్రారంభమైన ఈ వాన సోమవారం ఉదయం 7 గంటల వరకు ముంబైని వణికించింది. అత్యధికంగా గోవండీ ప్రాంతంలో 315 మిల్లీమీటర్లు,పోవాయ్లో ౩౧౪ మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.

భారీగా కురిసిన వర్షం కారణంగా సెంట్రల్ రైల్వే సబ్ అర్బన్ సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడింది. వర్షపు నీటికి పట్టాలు మునిగిపోవడంతో లోకల్ ట్రైన్స్ కొన్నిటి రాకపోకలు నిలిపివేయగా మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.ఠాణె, పాల్హర్, రాయడ్ ప్రాంతాలలో ప్రతిరోజు సుమారు 30 లక్షల మంది సబ్ అర్బన్ లోకల్ రైల్ సర్వీస్ లను ఉపయోగిస్తున్నారు. ఇటు లోతట్టు ప్రాంతాలలో కూడా వర్షపు నీరు నిండుకోవడంతో చాలా ఇళ్లల్లోకి నీళ్లు వెళ్లిపోయాయి. రహదారులపై కూడా మోకాలి లోతు నీళ్లు నిలబడిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో ఈరోజు స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. సహాయక చర్యల కోసం lఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగింది. సోమవారం నాడు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంబైలో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పాల్హార్ జిల్లాలోపొలంలో పనిచేస్తూ వరదలో చిక్కుకున్న 16 మంది గ్రామస్తులను అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఎన్డీఆర్ఎఫ్ బృందం రక్షించింది.ముంబై, ఠాణె,పాల్హర్, కొంకణ్ బెల్ట్కు ఐఎండీ ప్రాంతాలలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.