ప్రపంచ రియల్ ఎస్టేట్ లో ముంబై ర్యాంక్ ఎంతో తెలుసా?
ప్రపంచ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం రోజు రోజుకీ భారీ అభివృద్ధిని నమోదు చేస్తుందనే మాటలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి.
By: Tupaki Desk | 15 Jun 2024 3:30 PM GMTప్రపంచ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం రోజు రోజుకీ భారీ అభివృద్ధిని నమోదు చేస్తుందనే మాటలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. ప్రధానంగా పెరుగుతున్న జానాభాతో పాటు మారుతున్న జీవనశైలి దీనికి కారణాలుగా చెబుతారు. ఈ నేపథ్యంలో... ప్రపంచ రియల్ ఎస్టేట్ రంగంలో భారతదేశంలోని ముంబై, ఢిల్లీ నగరాలు తమ స్థానాన్ని కాపాడుకుంటూ, మెరుగుపరుచుకుంటూ వస్తున్నాయి.
అవును... ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా అధ్యయనం చేసిన ప్రైం గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ క్యూ 4 - 2023 ప్రకారం... ఇళ్ల ధరల వార్షిక పెరుగుదలలో దేశ ఆర్థిక రాజధాని ప్రపంచంలోనే మూడోస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రైం గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ క్యూ1 - 2024 నివేదిక ప్రకారం జనవరి - మార్చి 20204 లో గృహాల ధరల పెరుగుదలలో ముంబై తన స్థానాన్ని పథిలంగా కాపాడుకుంది.
ఇందులో భాగంగా... 44 గ్లోబల్ నగరాల్లో భారతదేశ ఆర్థిక రాజధాని 3వ స్థానంలో నిలవగా.. దేశ రాజధాని 5వ స్థానంలో నిలిచింది. తాజా నివేదిక ప్రకారం... 2024 ఆర్థిక సంవత్సర మొదటి త్రైమాసికంలో ముంబై, ఢిల్లీలలో లగ్జరీ హౌసెస్ ధరలు సుమారు 11 శాతం గణనీయంగా పెరిగాయని చెబుతున్నారు.
వాస్తవానికి హౌసింగ్ ధరల పెరుగుదల పరంగా ప్రపంచ వ్యాప్తంగా టాప్ 44 నరగాల జాబితాలోనూ... గత ఏడాది సరిగ్గా ఇదే కాలానికి ముంబై స్థానం 6 కాగా... ఢిల్లీ స్థానం 17గా ఉండేది. అయితే అనూహ్యంగా అధిక విలువైన ఆస్తులకు బలమైన డిమాండ్ కారణంగా ముంబై 3వ స్థానానికి, ఢిల్లీ ఐదోస్థానానికి చేరుకుందని అంటున్నారు. అయితే బెంగళూరు మాత్రం 17వ స్థానంలో ఉంది.
ఈ సందర్భంగా టాప్ 10 గ్లోబల్ సిటీస్ లిస్ట్ ఈ విధంగా ఉంది.
1 - మనీలా
2 - టొక్యో
3 - ముంబై
4 - పెర్త్
5 - ఢిల్లీ
6 - సొయెల్
7 - క్రైస్ట్ చర్చ్
8 - దుబాయ్
9 – లాస్ ఏంజిల్స్
10 – మేడ్ రిడ్