మర్మమేమిటో..? పార్టీలకతీతంగా తెలంగాణలో 'కులాన్ని కూడగడుతున్న' ఎంపీ
బహుశా ఉమ్మడి ఏపీలోకానీ, తెలంగాణలో కానీ.. ఆ సామాజిక వర్గం లేని క్యాబినెట్ ప్రస్తుత తెలంగాణ మంత్రివర్గమే అనడంలో సందేహం లేదు.
By: Tupaki Desk | 6 Feb 2025 9:30 PM GMTతెలంగాణలోని ప్రధాన సామాజిక వర్గాల్లో ఒకదానికి రాష్ట్ర విభజన తర్వాత పెద్దగా ప్రాధాన్యం దక్కకుండా పోతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన నాయకులు మంత్రి పదవుల్లో, పార్టీ పదవుల్లో కీలకంగా ఉండేవారు. విభజన తర్వాత మారిన పరిస్థితుల్లో అవకాశాలు పెద్దగా దక్కలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో మాత్రం మంత్రి పదవుల్లో ప్రాధాన్యం లభించింది. కాంగ్రెస్ సర్కారు వచ్చాక ఆ కులం నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో సీనియర్లు లేకపోవడంతో అమాత్య యోగం దక్కలేదు. బహుశా ఉమ్మడి ఏపీలోకానీ, తెలంగాణలో కానీ.. ఆ సామాజిక వర్గం లేని క్యాబినెట్ ప్రస్తుత తెలంగాణ మంత్రి వర్గమే అనడంలో సందేహం లేదు.
మూడు పార్టీల్లోనూ కీలకంగా..
కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్.. తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూడూ మున్నూరు కాపులకు ప్రాధాన్యం ఇచ్చినవే. ఇస్తున్నవే. బీఆర్ఎస్ పాలనలో పలువురు మున్నూరు కాపు నేతలకు మంత్రి పదవులు దక్కాయి. కే.కేశవరావు వంటివారికి పార్టీలో, ప్రభుత్వంలో పెద్ద పీట వేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన వద్దిరాజు రవిచంద్రకు రెండుసార్ల రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. రెండోసారి కేసీఆర్ కుటుంబ సభ్యుడు సంతోష్ కుమార్ ఖాళీ చేసిన స్థానాన్ని ఇవ్వడం గమనార్హం.
కాంగ్రెస్ లో ఒకప్పుడు వెలుగు వెలిగిన సామాజిక వర్గం మున్నూరు కాపులు. ఆర్గుల రాజారాం, కేంద్ర మాజీ మంత్రి పుంజాల శివశంకర్, డీఎస్, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, దానం నాగేందర్ ఇలా చెప్పుకొంటూ పోతే ఎందరో? అయితే, తెలంగాణ వచ్చాక సమీకరణాలు మారడంతో చాలామంది మున్నూరు కాపు నేతలు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లారు. దీంతో ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రి పదవి ఇద్దామన్నా.. ఆ సామాజిక వర్గం నుంచి నేతలు లేరు. చివరకు మున్నూరు కాపు నాయకుడు కొండా మురళి వివాహం చేసుకున్న సురేఖ (పద్మశాలీ)కు మున్నూరు కాపు కోటా కింద మంత్రి పదవి ఇచ్చి సరిపెట్టారు.
ఆ ఎంపీ హడావుడితో
మూడేళ్ల కిందట బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ ఎంపీ పదవి దక్కిన సమయంలో ఓ ఎంపీ హడావుడి చేశారు. ఢిల్లీలో తన ప్రమాణ స్వీకారానికి తెలంగాణ నుంచి భారీగా కార్యకర్తలను తీసుకెళ్లారు. రూ.3 కోట్లు ఖర్చుపెట్టారు. దీంతో బీజేపీ అప్రమత్తమైంది. అదే సామాజిక వర్గానికి చెందిన మరో నాయకుడికి రాజ్యసభ ఎంపీ పదవి ఇచ్చింది. కాగా, బీఆర్ఎస్ ఎంపీ ఇప్పుడు వివిధ పార్టీల్లోని మున్నూరు కాపులను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారట. ఆయన ఈ చర్యకు దిగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏ ఉద్దేశంతో ఇలా చేస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది.
మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి తెలంగాణ బీజేపీ పగ్గాలు... తెలంగాణ మంత్రివర్గంలో ఆ సామాజిక వర్గానికి చోటు.. లేదా తన సొంత ప్రతిష్ఠను పెంచుకునే ప్రయత్నం.. వీటిలో ఆ బీఆర్ఎస్ ఎంపీ ఉద్దేశం ఏమిటో మరి..?