Begin typing your search above and press return to search.

బూతు మాటల నేతల మీద వెంకయ్య ఆసక్తికర వ్యాఖ్యలు...!

ఆయన పూర్వపు ఉప రాష్ట్రపతి, హుందా రాజకీయాలను దశాబ్దాల తరబడి చేసిన వారు. ఆయనే వెంకయ్యనాయుడు

By:  Tupaki Desk   |   19 Feb 2024 3:09 PM GMT
బూతు మాటల నేతల మీద వెంకయ్య ఆసక్తికర వ్యాఖ్యలు...!
X

ఆయన పూర్వపు ఉప రాష్ట్రపతి, హుందా రాజకీయాలను దశాబ్దాల తరబడి చేసిన వారు. ఆయనే వెంకయ్యనాయుడు. రాజకీయ నేతల బూతుల మీద వెంకయ్యనాయుడు తరచూ ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. రాజకీయాల్లో వేషం భాష, భావ ప్రకటన అంతా కూడా మంచిగా ఉండాలని విశాఖలో జరిగిన ఒక కార్యక్రమంలో వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజకీయ నేతలు మంచిగా మాట్లాడాలని అసభ్య పదజాలం ఉపయోగించరాదని హితవు చెప్పారు. అయితే చాలా మంది నేతలు మాత్రం రాజకీయంగా దిగజారి మాట్లాడుతున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట సభలలో బయట కూడా ఈ తరహా వ్యాఖ్యలు వినాల్సి వస్తోందని ఆయన అన్నారు.

తన వద్దకు వస్తున్న వారు ఈ బూతు మాటలు వినలేకపోతున్నామని అంటున్నారని, వారికి తాను ఒక సలహా ఇచ్చానని వెంకయ్యనాయుడు అన్నారు. బూతుకు బూతుతోనే జవాబు చెప్పాలన్నదే ఆ సలహా అని ఆయన అన్నారు. పోలింగ్ బూత్ లోకి వెళ్ళు బటన్ గట్టిగా నొక్కు, ఫినిష్ అని వెంకయ్య చెప్పుకొచ్చారు.

అలా బూతు మాట్లాడే నేతలను ఓడించాలని ఆయన పిలుపు ఇచ్చారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. చదువుతో పాటు సంస్కారం ఉండాలని ఆయన అన్నారు. మంచి విద్య మాత్రమే కాదు, మంచి విలువలు ఉంటేనే ఉత్తమ పౌరులుగా తయారు అవుతారని ఆయన అన్నారు.

ఈ రోజున టెక్నాలజీ వస్తోందని, దాన్ని ప్రతీ వారూ అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు. కానీ అదే సమయంలో టెక్నాలజీ ఉంది కదా అని మన సంప్రదాయాన్ని మరచిపోరాదని ఆయన కోరారు. మాతృ భాష గురించి కూడా మాజీ ఉప రాష్ట్రపతి కీలక కామెంట్స్ చేశారు.

మాతౄ భాష కళ్ళు అయితే పరాయి భాష కళ్ళద్దాలు వంటిదని ఆయన అభివర్ణించారు. అందువల్ల ప్రతీ వారు మాతృ భాషను అసలు మరచిపోరాదని ఆయన సూచించారు. ఇదిలా ఉంటే మంచి రాజకీయ నేతలను ఎన్నుకోవాలని అవినీతి అక్రమాలు చేసేవారిని అరాచకాలు చేసేవారి ఓడగొట్టాలంటూ వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి.

ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారు అన్నది ఎవరికి వారు చర్చించుకుంటున్నారు. 2017 నుంచి వెంకయ్యనాయుడు రాజకీయాలను వదిలిపెట్టారు. రాజ్యాంగ పదవులు నిర్వహించి ప్రస్తుతం ఆయన పదవీ విరమణ చేశారు. అందువల్ల ఆయనకు రాజకీయాలు మీదే చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.

ఆయన బాధ్యత కలిగిన నేతగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న నేతగా ప్రజలకు హిత బోధ చేస్తున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా వెంకయ్యనాయుడు మాత్రం చేస్తున్న ఈ వ్యాఖ్యలు అవినీతి అక్రమార్క బూతు నేతలకే తగులుతాయని అంటున్నారు.