హైడ్రా నోటీసులపై స్పందించిన మురళీ మోహన్..
ఈ పరిణామంపై నటుడు మురళీమోహన్ తాజాగా స్పందించారు. తాను 33 ఏళ్లుగా రియల్‌ఎస్టేట్ రంగంలో ఉన్నానని.. ఎప్పుడూ ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని చెప్పుకొచ్చారు.
By: Tupaki Desk | 8 Sep 2024 6:06 AM GMTఎఫ్‌టీఎల్ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయడమే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అక్రమ నిర్మాణాలపై దూకుడుగా ముందుకు సాగుతోంది. మొన్నటి వరకు వర్షాల నేపథ్యంలో సైలెంట్ అయిపోయిన హైడ్రా.. మరోసారి జులుం విధిల్చింది. అందులో భాగంగా పలువురికి నోటీసులు జారీ చేసింది. మరికొన్ని చోట్ల కూల్చివేతలూ ప్రారంభించింది.
ఇదిలా ఉంటే.. సినీ నటుడు మురళీ మోహన్ రియల్ ఎస్టేట్ రంగంలో దశాబ్దాలుగా ఉన్నారు. కన్‌స్ట్రక్షన్ రంగంలో టాప్ టెన్‌లో ఉంటుంది ఆయన స్థాపించిన సంస్థ జయభేరి. అంతటి పెద్ద సంస్థకు సైతం హైడ్రా వదల్లేదు. బఫర్‌జోన్‌లో అక్రమ కట్టడం ఉందని నోటీసులు జారీ చేశారు.
గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో రంగలాల్‌కుంట చెరువు ఉంటుంది. ఆ చెరువు చుట్టూ అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు హైడ్రా యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. అందులో భాగంగానే జయభేరికి చెందిన నిర్మాణాలున్న చోట.. మూడడుగుల మేర రేకుల షెడ్డు పరిధి దాటి నిర్మించినట్లు గుర్తించారు. బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణం ఉందని, 15 రోజుల్లోగా దానిని తొలగించాలని ఆ మేరకు నోటీసులు జారీ చేశారు. ఇది కాస్త ఇప్పుడు సంచలనమైంది.
ఈ పరిణామంపై నటుడు మురళీమోహన్ తాజాగా స్పందించారు. తాను 33 ఏళ్లుగా రియల్‌ఎస్టేట్ రంగంలో ఉన్నానని.. ఎప్పుడూ ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని చెప్పుకొచ్చారు. తమకు హైడ్రా నోటీసులు ఇచ్చిందని తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా నోటీసులు జారీ చేసిందని ఆరోపించారు. తమకు 15 రోజుల సమయం ఇచ్చారని, ఆ తాత్కాలిక షెడ్‌ను తామే తొలగిస్తామని చెప్పుకొచ్చారు.