Begin typing your search above and press return to search.

టీటీడీ చైర్మన్ గా మురళీ మోహన్ ?

ఇదిలా ఉంటే తన జీవిత కాలంలో స్వామి వారిని సేవ చేసుకునే అదృష్టం కలిగించాలని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుని కలసి మురళీమోహన్ రిక్వెస్ట్ చేశారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   15 July 2024 4:30 PM GMT
టీటీడీ చైర్మన్ గా మురళీ మోహన్ ?
X

దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ధార్మిక సంస్థ టీటీడీ. దాని చైర్మన్ కు ఎంతో విలువ గౌరవం ఉంటాయి. ఒక కేబినెట్ ర్యాంక్ మంత్రికి ఉన్నంత గౌరవం దక్కుతుంది. అందుకే ఆ పదవికి అంతటి పోటీ. జగన్ సీఎం గా ఉండగా రెండు సార్లు వైవీ సుబ్బారెడ్డికి ఒక సారి భూమన కరుణాకరరెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు.

తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఈ కీలక పదవి దక్కుతుంది అన్న చర్చ అయితే చాలా రోజులుగా సాగుతోంది. రకరకాలైన పేర్లు తెర మీదకు వస్తున్నాయి. ఇపుడు కొత్తగా ప్రముఖ తెలుగు సినీ నటుడు, నిర్మాత, మాజీ ఎంపీ మురళీమోహన్ పేరు గట్టిగా వినిపిస్తోంది.

ఆయన గత నాలుగు దశాబ్దాలుగా టీడీపీకి ఎంతో సేవ చేస్తున్నారు. అన్న ఎన్టీఆర్ పిలుపుని అందుకుని రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీ కోసం ఎపుడూ ముందుంటే వ్యక్తిగా సౌమ్యుడిగా వివాదరహితుడిగా పేరు ఉంది. ఆయన వయసు ఇపుడు 84 ఏళ్ళు. ఇదిలా ఉంటే తన జీవిత కాలంలో స్వామి వారిని సేవ చేసుకునే అదృష్టం కలిగించాలని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుని కలసి మురళీమోహన్ రిక్వెస్ట్ చేశారు అని అంటున్నారు.

పాలిటిక్స్ కి కూడా ఆయన 2019లోనే స్వస్తి చెప్పిన నేపధ్యంలో ఆధ్యాత్మిక పదవిని చేపట్టి తృప్తికరంగా అధికారిక పదవుల నుంచి రిటైర్ కావాలని అనుకుంటున్నారు అని తెలుస్తోంది. దానిని చంద్రబాబు కూడా ఆమోదముద్ర వేశారు అని అంటున్నారు. టీటీడీకి సరైన నాయకత్వం వహించేవారు కావాలన్నది కూడా టీడీపీ ఆలోచనగా ఉంది అంటున్నారు.

మరో వారం రోజులలో టీటీడీ చైర్మన్ కి సంబంధించి మురళీమోహన్ నియామకం మీద అధికారిక ఉత్తర్వులు వస్తాయని అంటున్నారు. మరి కొన్ని నామినేటెడ్ పదవుల భర్తీతో పాటుగానే టీటీడీ పోస్టులను భర్తీ చేస్తారు అని అంటున్నారు.

ఈ నేపధ్యంలో నామినేటెడ్ పోస్టులు టీటీడీ చైర్మన్ పోస్టు గురించి కూడా చంద్రబాబు జనసేన బీజేపీ మిత్రులతో చర్చించి ఒక తుది నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే టీటీడీ చైర్మన్ పదవి విషయంలో టీడీపీలోనే అనేక మంది సీనియర్లు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.

చంద్రబాబు అయితే కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు పేరుని అనుకున్నారు అని వార్తలు వచ్చాయి. అలాగే సినీ ప్రముఖులు కె రాఘవేంద్రరావు, సి అశ్వనీదత్ పేర్లు కూడా నలిగాయి. కానీ చంద్రబాబు మాత్రం చివరికి మురళీ మోహన్ కే ఓటు వేశారు అని అంటున్నారు. ఆయన పార్టీకి వీర విధేయుడు కావడమే కాదు ఎన్టీఆర్ కుటుంబానికి సన్నిహితుడు అని అంటున్నారు. సో మురళీమోహన్ కొత్త చైర్మన్ గా టీటీడీకి రాబోతున్నారు అని అంటున్నారు.