సీఎస్ విశాఖ టూర్ మీద రచ్చ...ఏం జరుగుతోంది...!?
సీఎస్ విశాఖ టూర్ అంతా భూముల గురించే అని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు.
By: Tupaki Desk | 26 May 2024 4:04 AM GMTప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఇటీవల విశాఖ వెళ్ళారు. ఆయన టూర్ లో మీద ఇపుడు విపక్షాలు రాజకీయ రచ్చ చేస్తున్నాయి. సీఎస్ విశాఖ టూర్ అంతా భూముల గురించే అని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు.
ఉత్తరాంధ్రాలో రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే అసైన్డ్ భూములు కాజేశారు అని ఆయన ఆరోపించారు. ఈ మొత్తం భూ భాగోతం వెనక సీఎస్ ఉన్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఇటీవల జవహర్ రెడ్డి విశాఖ రావడం వెనక కూడా చాలా కారణాలు ఉన్నాయని ఆయన అంటున్నారు.
సీఎస్ కుమారుడి పేరిట అసైన్డ్ భూములను బినామీగా దక్కించుకునే ప్రయత్నాలు చేశారని ఆయన విమర్శించారు. అలాగే భోగాపురం విమానాశ్రయం వెనక ఉన్న భూముల మీద కన్నేశారు అని ఆయన అంటున్నారు. వైసీపీ నేతలు మరోసారి అధికారంలోకి రామని రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు అని ఆయన అంటున్నారు. జనసేన నేత చేసిన ఈ వ్యాఖ్యలు మంట రేపుతున్నాయి.
మరో వైపు టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ అయిన వర్ల రామయ్య కూడా సీఎస్ మీద తీవ్ర విమర్శలు చేశారు. సుమారు రూ.4 వేల కోట్ల విలువగల 800 ఎకరాల అసైన్డ్ భూములను తన కుమారుడికి అప్పనంగా కట్టబెట్టేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జీవో నెం.596 విడుదల చేయడం ఘోరాతి ఘోరం అని పేర్కొన్నారు.
పేద దళితులైన మాల, మాదిగలు జీవనోపాధి కోసం ప్రభుత్వమిచ్చిన అసైన్డ్ భూములను కొందరు అధికారులు, వారి అండతో రాజకీయ నాయకులు కబ్జా చేయడం దారుణం అని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన వెంటనే, దళితుల భూములను చేజిక్కించుకుని, వారికి అన్యాయం చేస్తున్న సీఎస్ జవహర్ రెడ్డి, వారు కుమారుడు లాంటి వారి మీద చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పెద్దలను వదలకుండా శిక్షించడం ఖాయం. వారి వద్ద నుండి అసైన్డ్ భూములు స్వాధీనం చేసుకొని, రాష్ట్రంలోని పేదవారికి పంచాలని, అవసరమైతే అసైన్డ్ భూములను కొట్టేసిన భూకబ్జా దారుల మీద ఒక కమిషన్ వేయాలని కూడా చంద్రబాబును కోరుతామని అన్నారు.
అలాగే, గత ఐదేళ్లుగా విశాఖ విజయనగరం జిల్లాల్లో జరిగిన భూ క్రయ విక్రయాలపై కూడా మరో కమిషన్ వేసి విచారణ జరిపించాలని చంద్రబాబును కోరుతాం అంటూ వర్ల రామయ్య స్పష్టం చేశారు. ఇలా సీఎస్ విశాఖ పర్యటన మీద టీడీపీ జనసేన తీవ్ర ఆరోపణలు చేసిన నేపధ్యంలో సీఎస్ జవహర్ రెడ్డి స్పందించారు.
అసైన్డ్ భూములను ఆయన కుమారుడు స్వాధీనపరచు కున్నట్లుగా వచ్చిన ఆరోపణలను ఖండించారు. "విశాఖ పరిసరాల్లో నేను, నా కుటుంబ సభ్యులు ఎలాంటి అసైన్డ్ భూములు కొనుగోలు చేయలేదు. జనసేన నేత పీతల మూర్తి యాదవ్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు విశాఖ వెళ్లాను. పనిలో పనిగా భోగాపురం ఎయిర్ పోర్టు పనులను కూడా పరిశీలించాను. అసైన్డ్ భూముల కోసమే విశాఖ వచ్చాననడం అర్థరహితం.
నా కుమారుడు గత ఐదేళ్లలో విశాఖకు కానీ, ఉత్తరాంధ్రలో మరే జిల్లాకు కానీ వెళ్లలేదు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ మీడియా ముందు క్షమాపణ చెప్పాలి. తన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలి. లేకపోతే చట్టప్రకారం క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది" అని జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.
మొత్తం మీద చూస్తే జవహర్ రెడ్డి మీద ఈ విధంగా విపక్షాలు రచ్చ చేయడంతో అసలు ఏమి జరుగుతోంది అన్న చర్చకు ఆస్కారం ఏర్పడుతోంది. అదే సమయంలో విశాఖ వచ్చిన జవహర్ రెడ్డి జగన్ రెండవసారి సీఎం గా ప్రమాణం చేసే కార్యక్రమం మీద సన్నద్ధత కోసం కూడా చర్చించారు అని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. దీంతో సీఎస్ మీద గత రెండు నెలలుగా గురి పెట్టిన విపక్షాలు కౌంటింగ్ టైం లో ఆయన విశాఖ టూర్ మీద మరోసారి ఈసీకి ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నాయి.