Begin typing your search above and press return to search.

మూసీ ప్రాజెక్టు ఖర్చెంత..? బీఆర్ఎస్, కాంగ్రెస్ చెప్తున్న లెక్కల్లో వాస్తవమెంత..?

మూసీ సుందరీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించగా.. బీఆర్ఎస్ ముందు నుంచీ అడ్డుపడుతోంది.

By:  Tupaki Desk   |   18 Oct 2024 11:30 PM GMT
మూసీ ప్రాజెక్టు ఖర్చెంత..? బీఆర్ఎస్, కాంగ్రెస్ చెప్తున్న లెక్కల్లో వాస్తవమెంత..?
X

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు మూసీ ప్రాజెక్టు చుట్టూరే నడుస్తున్నాయి. మూసీ సుందరీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించగా.. బీఆర్ఎస్ ముందు నుంచీ అడ్డుపడుతోంది. ముఖ్యంగా మూసీ పరిధిలోని నిర్వాసితులను ఖాళీ చేయించేందుకు వ్యతిరేకిస్తోంది. మూసీ సుందరీకరణతో ఎవరికి ఉపయోగం అంటూ నిలదీస్తోంది. కేవలం అప్పనంగా దోచుకునేందుకే ఈ ప్రాజెక్టును ముందరేసుకున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అప్పనంగా రాష్ట్రం నుంచి సొమ్మను దోచుకొని ఢిల్లీకి సూటుకేసులు తరలిస్తున్నారని బీఆర్ఎస్ లీడర్లు ఆరోపిస్తున్నారు. అందుకే మూసీ ప్రాజెక్టుతో పెద్ద ఎత్తున దోపిడీ కోసమే ఈ సుందరీకరణ పనులు మొదలు పెడుతున్నారని అంటున్నారు. అయితే.. ఏకంగా లక్షా 50వేల కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడుతున్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు సందర్భాల్లో ఆరోపించారు. అందులో 50వేల కోట్లు ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టి.. లక్ష కోట్లను ఢిల్లీకి తరలించేందుకు సిద్ధమయ్యారని ఆయన ప్రధాన ఆరోపణ. కేవలం దోచుకో.. దాచుకో అన్నట్లుగానే కాంగ్రెస్ పాలన నడుస్తోందని అంటున్నారు.

దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బదులిచ్చారు. బీఆర్ఎస్ ఆరోపణలను ఆయన ఖండించారు. లక్షా 50వేల కోట్లతో నిర్మించడానికి ఇదేమైనా కాళేశ్వరం ప్రాజెక్టా అని ప్రశ్నించారు. దోచుకునే అలవాటు మీదని.. ప్రజలకు మంచి చేసే అలవాటు తమదని చెప్పుకొచ్చారు. డిటైల్డ్ రిపోర్ట్ తయారు చేసేందుకు 5 కంపెనీలకు సంబంధించిని కన్సార్టియానికి పనులు అప్పగించినట్లు తెలిపారు. అందుకు రూ.141 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ముూసీ సుందరీకరణ కాదని.. పునరుజ్జీవం అని వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు తాము కేవలం 141 కోట్లు కేటాయిస్తే.. ఈ లక్షా 50వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో బీఆర్ఎస్ లెక్కలు చెప్పాలని సవాల్ విసిరారు.

అయితే.. ఇరుపార్టీల సవాళ్లు, ప్రతిసవాల్ల నేపథ్యంలో ఇప్పుడు ప్రజల్లోనూ కొత్త కన్ఫ్యూజన్ మొదలైంది. అసలు మూసీ ప్రాజెక్టు సుందరీకరణ చేపడుతున్నారు సరే.. దానికి ఎంత ఖర్చు చేస్తారనేది క్లారిటీ లేకుండా పోయింది. బీఆర్ఎస్ పార్టీ ఏమో లక్షా 50వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెబుతోంది. కానీ.. ముఖ్యమంత్రి మాత్రం ఇప్పటివరకు 141 కోట్లు కేటాయించామని అంటున్నారు. ఇప్పటివరకు 141 కోట్లు కేటాయిస్తే.. భవిష్యత్తులో నిర్మాణాలన్నింటికీ ఎన్ని వేల కోట్లు ఖర్చు చేస్తారనేది ఎక్కడా చెప్పలేదు. దాంతో అసలు ఈ ప్రాజెక్టు వ్యయం ఎంత..? అనే విషయంపై స్పష్టత లేకుండా పోయింది. మొత్తానికి ఖర్చు విషయంలో మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాత్రం రోజూ మాటల తూటాలైతే పేలుతున్నాయి. అసలు బీఆర్ఎస్ చెబుతున్న లెక్కలు కరెక్టా.. ప్రభుత్వం చెబుతున్న లెక్కలు వాస్తవమా అనేది తేల్చుకోలేకపోతున్నారు. మొత్తానికి మూసీ ప్రాజెక్టు ఖర్చు అంశం చివరకు రేవంత్, కేటీఆర్ సవాళ్లు చేసుకునే స్థాయికి చేరింది. డిటైల్డ్ రిపోర్టు వచ్చాకే ఖర్చుపై ప్రభుత్వం క్లారిటీ ఇస్తుందా అనేది చూడాలి మరి.