సర్వే సంచలనం: మూసీ వల్ల సంతాన సమస్యలు
పల్లెటూరు అంటేనే చుట్టూ పచ్చని వాతావరణం.. పచ్చని చెట్లతో కళకళలాడుతుంటుంది.
By: Tupaki Desk | 28 Sep 2024 6:30 AM GMTపల్లెటూరు అంటేనే చుట్టూ పచ్చని వాతావరణం.. పచ్చని చెట్లతో కళకళలాడుతుంటుంది. స్వచ్ఛమైన గాలి కావాలంటే పల్లెల బాట పట్టాల్సిందే. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల చదువు నిమిత్తం.. లేదంటే ఉపాధి కోసం గ్రామాల నుంచి చాలా మంది ప్రజలు పట్టణాలకు వలస వెళ్తున్నారు. పల్లెల స్వచ్ఛతను కోల్పోతున్నారు. ఎందుకంటే.. పల్లెల ఉన్న వాతావరణం పట్టణాల్లో కనిపించదు. వాయు, ధ్వని కాలుష్యం విపరీతంగా ఉంటుంది. అందులోనూ దేశ రాజధాని అయిన ఢిల్లీ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఈ బెదద ఎక్కువగా కనిపిస్తోంది.
కాలుష్యాల వల్ల మరో ప్రధాన సమస్య తెరమీదకు వచ్చింది. కాలుష్యం కారణంగా గాలిలోని రసాయనాలు రక్తం ద్వారా పునరుత్పత్తి వ్యవస్థలోకి చొచ్చుకెళ్లి హార్మోన్లను అస్తవ్యస్తం చేస్తాయట. నేరుగా అండాలు, శుక్ర కణాలనూ దెబ్బతీయొచ్చని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.
అలాగే.. హైదరాబాద్ నగరంలోని మూసీ నదిలో కొన్ని దశాబ్దాలుగా కాలుష్యం విపరీతంగా పెరిగింది. దాంతో మూసీ పరిధిలోని ప్రాంతాల్లో సంతానలేమి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. మూసీ పరిధిలోని కూరగాయలు, నాన్ వెజ్ తినే మహిళల్లో సంతానలేమి సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలు తెలిపాయి. సంతానలేమితోపాటు చర్మ సమస్యలు కూడా పెరుగుతున్నట్లు చెప్పాయి. ఆ బెల్ట్ పరిధిలోని చాలా మంది ప్రజలు చర్మ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని సర్వేలు పేర్కొన్నాయి.
ఇదే క్రమంలో రేవంత్ సర్కార్ మూసి ప్రక్షాళనకు దిగింది. దాని పరిధిలోని అక్రమ కట్టడాలను తీసేసి.. వారికి మరోచోట డబుల్ బెడ్ రూములు కేటాయించి.. మూసీని పూర్తి ప్రక్షాళన చేసేందుకు సర్కార్ నిర్ణయించింది. ఓ టూరిజం హబ్‌లాగా అక్కడి పరిసరాలను మార్చేలా ప్లాన్ చేయించింది. ఇప్పుడిప్పుడే మూసీ ప్రక్షాళనపై అడుగులు పడుతుండడంతో అక్కడి ప్రజలకు ఈ వ్యాధుల బారి నుంచి బిగ్ రిలీఫ్ దొరకనుంది.