Begin typing your search above and press return to search.

థేమ్స్ మోడల్లో మూసీనది ప్రక్షాళన సాధ్యమేనా ?

లండన్ పర్యటనలో ఉన్న రేవంత్ బృందం థేమ్స్ నది నిర్వహణ అధికారులతో భేటీ అయ్యారు. రివర్ అథారిటి, లండన్ పోర్టు నిర్వహణ యాజమాన్యం, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

By:  Tupaki Desk   |   21 Jan 2024 4:30 PM GMT
థేమ్స్ మోడల్లో మూసీనది ప్రక్షాళన సాధ్యమేనా ?
X

హైదరాబాద్ నగరంలో ఉన్న మూసీ నదిని ప్రక్షాళన చేసి మంచినీటి వాడకానికి పనికొచ్చేట్లు చేస్తామని కేసీయార్ ప్రభుత్వం చాలాసార్లు ప్రకటించింది. ఒకపుడు మంచినీటిని సరఫరా చేసిన మూసీనది కాలక్రమంలో చాలా అసహ్యంగా తయారైంది. నది ఆనకట్టలు ఆక్రమలకు గురికావటంతో నది వైశాల్యం కుచించుకుపోయింది. నగరానికి మంచినీటి సరఫరాకు మూసీనదితో పాటు హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ లాంటివి వచ్చాయి. దాంతో మూసీనది ప్రాధాన్యత తగ్గిపోయింది. దానికితోడు అతివృష్టి, అనావృష్టి కారణంగా మూసీనది ఆక్రమణలకు గురయ్యింది.

అప్పటినుండి మూసీనది కేవలం ప్రచారానికి మాత్రమే పనికొస్తోంది. కేసీయార్ హయాంలో మూసీనది ప్రక్షాళనకు చాలా ప్లాన్లు వేశారు కానీ ఏదీ అమల్లోకి రాలేదు. అనేక రూపాల్లో కోట్ల రూపాయలు మాత్రం ఖర్చయిపోయింది. ఇలాంటి మూసీనదిని ప్రక్షాళన చేయటానికి ఇపుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగా ఆసక్తి చూపుతోంది. లండన్ పర్యటనలో ఉన్న రేవంత్ బృందం థేమ్స్ నది నిర్వహణ అధికారులతో భేటీ అయ్యారు. రివర్ అథారిటి, లండన్ పోర్టు నిర్వహణ యాజమాన్యం, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

మూసీనది ప్రక్షాళన ద్వారా కాలుష్య నివారణ, టూరిజం డెవలప్మెంట్ తో పాటు మంచినీటి సరఫరాను ఏకకాలంలో చేయాలని రేవంత్ ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది. థేమ్స్ నది నిర్వహణలోని కష్ట, నష్టాల వివరాలను రేవంత్ అండ్ కో అడిగి తెలుసుకున్నారు. మూసీనది ప్రస్తుత పరిస్ధితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మూసీనదిని డెవలప్ చేయటం కోసం లండన్ అధికారులకు అవగాహన కోసమే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత తొందరలోనే తాము హైదరాబాద్ వచ్చి ఫీల్డ్ విజిట్ చేస్తామని థేమ్స్ రివర్ నిపుణులు హామీ ఇచ్చారు. నిజంగానే మూసీనదిని ప్రక్షాళన చేస్తే నగరానికి చాలా మంచి జరుగుతుందనటంలో సందేహంలేదు. కానీ అది సాధ్యమేనా అన్నదే పెద్ద పాయింట్. ఎందుకంటే నదికి రెండువైపులా కిలోమీటర్ల కొద్ది ఆక్రమణలు జరిగిపోయాయి. ఈ ఆక్రమణల్లో అన్నీ పార్టీల నేతలూ ఉన్నారు. నదిని ప్రక్షాళన చేయాలంటే ముందుగా ఆక్రమణలను క్లియర్ చేయాలి. అప్పుడు నది విశాలమవుతుంది. అప్పుడు నీళ్ళొచ్చినపుడు ప్రక్షాళన మొదలుపెట్టాలి. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.